నెట్‌ఫ్లిక్స్ పంట పండిస్తున్న తెలుగు!

అమేజాన్ ప్రైమ్ తెలుగు స‌హా ద‌క్షిణాది చిత్రాలు, సిరీస్‌ల‌తో బోలెడంత కంటెంట్ ఇస్తున్న టైంలో నెట్ ఫ్లిక్స్ మాత్రం ఇక్క‌డి మార్కెట్ మీద పెద్ద‌గా దృష్టిపెట్ట‌లేదు.;

Update: 2025-02-28 04:39 GMT

నెట్ ఫ్లిక్స్ ఇండియా కంటెంట్ చూస్తే.. ఎక్కువ‌గా హిందీ సినిమాలు, వెబ్ సిరీస్‌లే కనిపించేవి ఒక‌ప్పుడు. అమేజాన్ ప్రైమ్ తెలుగు స‌హా ద‌క్షిణాది చిత్రాలు, సిరీస్‌ల‌తో బోలెడంత కంటెంట్ ఇస్తున్న టైంలో నెట్ ఫ్లిక్స్ మాత్రం ఇక్క‌డి మార్కెట్ మీద పెద్ద‌గా దృష్టిపెట్ట‌లేదు. కానీ ఈ మ‌ధ్య సౌత్ కంటెంట్ బాగా పెంచుతోంది నెట్ ఫ్లిక్స్. ముఖ్యంగా తెలుగు సినిమాలు బోలెడ‌న్ని క‌నిపిస్తున్నాయి ఆ యాప్‌లో.

వాటికి ప్రేక్ష‌కుల నుంచి వ‌స్తున్న స్పంద‌న కూడా గొప్ప‌గా ఉంటోంది. చాలా ఎక్కువ రేటు పెట్టి కొని స్ట్రీమింగ్ చేస్తున్న హిందీ చిత్రాల‌తో పోలిస్తే.. త‌క్కువ రేటుకు వ‌స్తున్న తెలుగు చిత్రాల‌కే వ్యూయర్ షిప్ ఎక్కువ ఉంటున్న సంకేతాలు క‌నిపిస్తున్నాయి. ఈ మ‌ధ్య తెలుగు సినిమాలు నెట్ ఫ్లిక్స్‌లో ట్రెండ్ అవుతున్న తీరు చూస్తే ఆశ్చ‌ర్యం క‌ల‌గ‌క‌మాన‌దు. పాన్ ఇండియా సినిమాలుగా ప్ర‌మోట్ కానివి కూడా అద్భుత‌మైన స్పంద‌న తెచ్చుకుంటున్నాయి.

నంద‌మూరి బాల‌కృష్ణ సినిమా డాకు మ‌హారాజ్‌కు గ‌త వారం రోజులుగా నెట్ ఫ్లిక్స్‌లో వ‌స్తున్న రెస్పాన్స్ చూస్తే ఆశ్చ‌ర్యం క‌ల‌గ‌క మాన‌దు. ఇండియా లెవెల్లో టాప్‌లో ట్రెండ్ అవుతోందా చిత్రం. మ‌ల‌యాళీలు, హిందీ ప్రేక్ష‌కులు ఈ సినిమాను ఎగ‌బ‌డి చూస్తుండ‌డం విశేషం. డాకు మ‌హారాజ్ ప‌క్కా రీజ‌న‌ల్ మూవీ. దీనికి ఇలాంటి స్పంద‌న‌ను నెట్ ఫ్లిక్స్ సంస్థ ఊహించి ఉండ‌దు.

దీని కంటే ముందు దుల్క‌ర్ స‌ల్మాన్ న‌టించిన తెలుగు చిత్రం ల‌క్కీ భాస్క‌ర్ కూడా అదిరిపోయే రెస్పాన్స్ తెచ్చుకుంది ఇది వ‌రుస‌గా 13 వారాలు పాటు నెట్ ఫ్లిక్స్ ట్రెండింగ్‌లో ఉండి రికార్డు నెల‌కొల్పింది. ఇక భారీ చిత్రం పుష్ప‌-2కు అనుకున్న‌ట్లే గొప్ప స్పంద‌న వ‌చ్చింది. అంత‌కుముందు దేవ‌ర‌, గుంటూరు కారం స‌హా ప‌లు చిత్రాలు నెట్ ఫ్లిక్స్‌లో భారీగా వ్యూయ‌ర్‌షిప్ తెచ్చుకున్నాయి. ఇక రాజ‌మౌళి సినిమా ఆర్ఆర్ఆర్‌కు నెట్‌ఫ్లిక్స్‌లో వ‌చ్చిన స్పంద‌న ఒక చ‌రిత్ర అని చెప్పుకోవ‌చ్చు. మొత్తానికి తెలుగు కంటెంట్‌తో నెట్‌ఫ్లిక్స్ సంస్థ బాగానే లాభ‌ప‌డుతున్న‌ట్లు క‌నిపిస్తోంది.

Tags:    

Similar News