ఓటీటీలోకి వచ్చేసిన నయనతార డాక్యుమెంటరీ.. ఎలా ఉందంటే?
నేడు (నవంబర్ 18) నయన్ 40వ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.
సౌత్ స్టార్ హీరోయిన్ నయనతార జీవితంపై తీసిన డాక్యుమెంటరీ మూవీ ''నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్''. ఆమె సినీ కెరీర్, వ్యక్తిగత జీవితంలోని ప్రేమ, పెళ్లి వంటి కీలకమైన విషయాలతో ఈ చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ రూపొందించింది. అమిత్ కృష్ణన్ దీనికి దర్శకత్వం వహించారు. నేడు (నవంబర్ 18) నయన్ 40వ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. తెలుగు తమిళ హిందీ ఇంగ్లీష్ భాషల్లో ఈ డాక్యుమెంటరీని స్ట్రీమింగ్ చేసారు.
'నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్' విడుదల నేపథ్యంలో హీరో ధనుష్, నయన్ మధ్య విబేధాలు బయటపడిన సంగతి తెలిసిందే. నయన్, తన భర్త డైరెక్టర్ విఘ్నేశ్ శివన్ కలిసి పని చేసిన తొలి సినిమా 'నానుమ్ రౌడీ దాన్' (తెలుగులో నేనూ రౌడీనే)లోని ఫుటేజీ ఉపయోగించుకోడానికి అనుమతి ఇవ్వలేదంటూ.. ఆ చిత్రాన్ని నిర్మించిన ధనుష్ పై తీవ్ర విమర్శలు చేస్తూ నయన్ ఇటీవల ఓపెన్ లెటర్ రాయడం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా నడుస్తోంది. వివాదాల నడుమ ఓటీటీలోకి వచ్చేసిన నయన్ డాక్యుమెంటరీకి నెటిజన్లు సోషల్ మీడియాలో రివ్యూలు ఇస్తున్నారు.
'నానుమ్ రౌడీ దాన్' షూటింగ్ లొకేషన్స్ లోని 3 సెకన్ల బీటీఎస్ విజువల్స్ వాడిననందుకు 10 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని ధనుష్ తమకు లీగల్ నోటీసు పంపించినట్లుగా నయనతార లేఖలో తెలిపింది. అయితే చివరకు డాక్యుమెంటరీలో ధనుష్ అభ్యంతరం వ్యక్తం చేసిన విజువల్స్ ను తొలగించారని తెలుస్తోంది. దాదాపు 1 గంట 20 నిమిషాల నిడివితో వచ్చిన ఈ ఫిల్మ్.. నయన్ లైఫ్ లోని ముఖ్యమైన ఘట్టాలను ప్రస్తావిస్తుంది. సినీ ప్రయాణాన్ని, ఆమె ఎదుర్కొన్న ఒడిదుడుకులను, లవ్ స్టోరీ, వివాహ జీవితాన్ని తెలియజేస్తుంది.
నయనతార కుటుంబం, ఆమె చిన్ననాటి సంగతులు, చదువు వంటి విషయాలను చర్చిస్తూ 'బియాండ్ ది ఫెయిరీ టేల్' ముందుకు సాగింది. పెద్దగా సినిమాలు చూడని నయన్ కు, మలయాళ ఇండస్ట్రీలో సినిమా ఛాన్స్ ఎలా వచ్చింది? ఆ తర్వాత తెలుగు, తమిళ భాషల్లో ఎలా అవకాశాలు వచ్చాయి? వంటి విషయాల గురించి వివరించారు. అటు పర్సనల్ లైఫ్, ఇటు ప్రొఫెషనల్ లైఫ్ లో నిరాశ నిస్పృహల్లోకి వెళ్లిన తర్వాత నయనతార ఎలా స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చిందనే తెలియజేసారు.
సినిమా ఆఫర్స్ తగ్గిన సమయంలో స్టార్ హీరో అక్కినేని నాగార్జున ఫోన్ చేసి 'బాస్' చిత్రంలో నటించమని అడగడం, బ్రేకప్ అయిన సమయంలో 'శ్రీరామరాజ్యం'లో సీత పాత్రలో నటించే అవకాశం రావడం గురించి తెలియజేసారు. దీనికి నాగార్జున వీడియో బైట్ తో పాటుగా పలువురు సినీ ప్రముఖుల అభిప్రాయాలను కూడా పొందుపరిచారు. 'గజినీ' మూవీ టైంలో వచ్చిన విమర్శలు, బాడీ షేమింగ్, 'బిల్లా' సినిమా కోసం ధైర్యంగా బికినీ ధరించడం వంటి విషయాలు గురించి నయనతార మాట్లాడింది. 'లేడీ సూపర్ స్టార్' గా ఎదిగిన క్రమాన్ని వివరించింది.
అలానే నయనతార - విగ్నేష్ శివన్ ప్రేమ కథను ఈ డాక్యుమెంటరీలో ప్రముఖంగా వివరించారు. ‘నానుమ్ రౌడీ దాన్’ సినిమా టైములో ఒకరిపై ఒకరికి ఎలాంటి అభిప్రాయాలు ఉండేవి? ఇద్దరి మధ్య ఎలాంటి డిస్కషన్ జరిగేది? ఇద్దరి మధ్య ప్రేమ ఎలా చిగురించింది? ముందుగా ఎవరు ప్రపోజ్ చేసారు? వంటి విషయాల గురించి సెలబ్రిటీ కపుల్ మాట్లాడారు. తమ రిలేషన్ షిప్ గురించి తెలిసిన తర్వాత వచ్చిన మీమ్స్ గురించి, ఆ సమయంలో జరిగిన ట్రోలింగ్ పైనా విగ్నేష్ స్పందించారు.
ఏడడుగుల బంధంలో అడుగుపెట్టడం గురించి చెబుతూ.. నయనతార - విఘ్నేష్ శివన్ వివాహానికి సంబంధించిన వీడియోలను అందంగా చూపించారు. పెళ్లి, దానికి సంబంధించిన సన్నాహాలు, గెస్ట్ లిస్ట్, మ్యారేజ్ టెన్షన్, వెడ్డింగ్ డ్రెస్ లు రూపొందించడానికి డిజైనర్లు పడిన శ్రమ.. ఇలా అన్ని అంశాలను ప్రస్తావించారు. పెళ్లికి ముందు వీరిద్దరూ ఎలా ఉన్నారు? పెళ్లి తర్వాత బంధం ఎలా ఉంది? అనే విషయాలను పంచుకున్నారు. ఇక చివర్లో వీరి పిల్లల ఉలగం, ఉయిరే లను చూపిస్తూ డాక్యుమెంటరీని ముగించారు.