థియేట‌ర్ కంటే ఓటీటీకే అగ్ర తాంబూలం!

వారం రోజుల్లోనే 300 నుంచి 500 కోట్లు క‌లెక్ష‌న్లు చూపిస్తున్నారు. ఒక‌వేళ ప్లాప్ అయితే ప్రేక్ష‌కులు ప్లాన్ బీ ప్ర‌కారం ఓటీటీకి వెళ్లిపోతున్నారు.

Update: 2023-09-23 13:30 GMT

థియేట‌ర్ కంటే ప్రేక్ష‌కులు ఓటీటీకే పెద్ద పీట వేస్తున్నారా? ఓటీటీ మించిన గొప్ప మాధ్య‌మం ఇంకెక్క‌డ‌? అన్న ఓ అంచ‌నాకి ప్రేక్ష‌కులు దాదాపు వ‌చ్చేసిన‌ట్లేనా? అంటే అవున‌నే సంకేతాలు అందుతున్నాయి. కోవిడ్ స‌మ‌యంలో ఓటీటీ ఎలా పుంజుకుందో తెలిసిందే. గ‌డ‌ప‌దాటి బ‌య‌ట‌కు రాని ప‌రిస్థితుల్లో కావాల్సిన ఎంట‌ర్ టైన్ మెంట్ అంతా ఓటీటీ డిజిట‌ల్ మాధ్య‌మాల్లోనే ప్రేక్ష‌కులు వెతుక్కున్నారు.

ఇదే అవ‌కాశంగా భావించిన ఓటీటీలు ఆఫ‌ర్లు మీద ఆఫ‌ర్లు ప్ర‌క‌టించి జ‌నాల‌కు మ‌రింత అల‌వాటుగా మార్చేసారు. అప్ప‌టి నుంచి సీన్ మారిన సంగ‌తి తెలిసిందే. చిన్న సినిమాల‌న్నీ ఓటీటీలోనే..అగ్ర హీరోల సినిమాలు హిట్ టాక్ తెచ్చుకుంటే థియేట‌ర్ కి వెళ్లి చూడ‌టం అల‌వ‌ర్చుకున్నారు. ఈ క్ర‌మంలోనే మ‌ళ్లీ జ‌నాల్ని థియేట‌ర్ల‌కి ర‌ప్పించ‌డం కోసం ప్రేక్ష‌కుల‌కు టికెట్ ధ‌ర‌లు త‌గ్గించి ఎర వేయాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది.

అలాగే మ‌ల్లీప్లెక్స్ అసోసియేష‌న్ నేష‌న‌ల్ సినిమా డే అంటూ ఓ రోజును తీసుకురావాల్సి వ‌చ్చింది. ఇలా కొన్ని ర‌కాల ప్రయ‌త్నాలు స‌ఫ‌లం అయిన‌ప్ప‌టికీ ప్రేక్ష‌కులు మాత్రం పూర్తి స్థాయిలో థియేట‌ర్ వైపు మొగ్గు చూప‌డం లేద‌న్న‌ది వాస్త‌వం. చిన్న సినిమాల విష‌యంలో ప్రేక్ష‌కులు థియేట‌ర్ కి రావాలంటే? అది సూప‌ర్ హిట్ అయి ఉండాలి. ఓటీటీలోకి ఇప్ప‌ట్లో వ‌చ్చే అవ‌కాశం లేదు అని బ‌లంగా చాట‌గ‌ల‌గాలి.

అప్పుడే ప్రేక్ష‌కుడు థియేట‌ర్ కి వ‌చ్చి చూసే ప‌రిస్థితి. ఈ మ‌ధ్య విడుద‌లైన కొన్ని కంటెంట్ బేస్డ్ చిత్రాలు థియేట్రిక‌ల్ గా మంచి వ‌సూళ్లు సాధించాయి అంటే దాని వెనుక అస‌లు కార‌ణం అది. ఇక స్టార్ హీరోల సినిమాలైతే ఎలాగూ ఓపెనింగ్స్ ఉంటాయి. హిట్ టాక్ వ‌స్తే జ‌నాలు ఎలాగూ థియేట‌ర్ కి వెళ్తారు. వారం రోజుల్లోనే 300 నుంచి 500 కోట్లు క‌లెక్ష‌న్లు చూపిస్తున్నారు. ఒక‌వేళ ప్లాప్ అయితే ప్రేక్ష‌కులు ప్లాన్ బీ ప్ర‌కారం ఓటీటీకి వెళ్లిపోతున్నారు.

ఈ మధ్య కాలంలో చాలా చిన్న‌చితకా సినిమాలు థియేట‌ర్లో రిలీజ్ అయ్యాయి. వాటితో పాటు స‌ప్త‌సాగ రాలు దాటే అనే ఓక‌న్న‌డ సినిమా కూడా రిలీజ్ అయింది. హిట్ టాక్ తెచ్చుకున్న సినిమా అది. కానీ ఇప్పుడా సినిమా కూడా ఓటీటీలో వ‌స్తే చూద్దాం! అనే ఆలోచ‌న‌లోనే మెజార్టీ వ‌ర్గం క‌నినిపిస్తుంది. థియేట‌ర్ ఎక్స్ పీరియ‌న్స్ చూడాల‌నుకున్న సెక్ష‌న్ ఎలాగూ వెళ్తోంది. అయితే ప‌ల‌చ‌నైన జ‌నాల్ని చూస్తుంటే హిట్ సినిమా ప‌రిస్థితి థియేట‌ర్లో ఇంతేనా? అన్న ఓ డౌట్ రెయిజ్ అవుతుంది. ఆ ర‌కంగా ఓటీటీ ప్ర‌భావం థియేట‌ర్ల‌పై అయితే స్ప‌ష్టంగా ప‌డుతుంద‌ని నిపుణులు అంచ‌నా వేస్తున్నారు.

Tags:    

Similar News