కల్లోల కమలం..కిషన్ రెడ్డి కి వర్గ పోరు స్వాగతం

తెలంగాణా బీజేపీ కొత్త ప్రెసిడెంట్ జి కిషన్ రెడ్డికి ఆ పార్టీలోని వర్గ పోరు ఘన స్వాగతం పలికింది.

Update: 2023-07-21 15:02 GMT

తెలంగాణా బీజేపీ కొత్త ప్రెసిడెంట్ జి కిషన్ రెడ్డికి ఆ పార్టీలోని వర్గ పోరు ఘన స్వాగతం పలికింది. శుక్రవారం ఆయన తెలంగాణా బీజేపీ ప్రెసిడెంట్ గా చార్జి తీసుకున్నారు. అయితే ఎన్నికలు అతి కొద్ది నెలలలో జరగనున్న వేళ అంతా ఒక్కటి అని గ్రూప్ ఫోటో దిగాల్సిన కాషాయం నేతలు గ్రూప్ పోరుతో సతమతం అవుతున్నారు.

కిషన్ రెడ్డి చార్జి తీసుకున్న కార్యక్రమానికి కీలక నేతలు డుమ్మా కొట్టారు. ఇక కొందరు వచ్చిన వారు ఎందుకు వచ్చారో తెలియనంతగా అయోమయంలో పడ్డారు. మరి కొందరు మాట్లాడిన మాటలు చూస్తే వర్గ పోరు కళ్లకు కట్టింది. ఇంకొందరు అయితే సోషల్ మీడియాలో తమ అసంతృప్తిని వెళ్లగక్కారు.

ఇక బండి సంజయ్ మాట్లాడుతూ ఢిల్లీకి ఇకనైనా పార్టీ వర్గాలు ఫిర్యాదు చేయడం మానేయాలని కోరారు. తన మీద ఫిర్యాదులు చేసి పదవి నుంచి దించేశారు అన్న బాధ విమర్శ ఆయన ప్రసంగంలో కనిపించింది. మీడియా బేబీలు సోషల్ మీడియా బేబీలూ కాదు ప్రజలలో ఉంటూ ప్రజలతో కనెక్ట్ అయ్యేవారు బీజేపీకి కావాలని బండి అనడం ఎవరిని ఉద్దేశించి అన్నదే చర్చకు వస్తోంది.

కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి అయితే బండి సంజయ్ వల్లనే తెలంగాణాలో బీజేపీ ఈ స్థాయికి ఎదిగిందని ఆయనను తప్పించినపుడు తన ముఖం చూసి తనకు ఏడుపు వచ్చిందని చెప్పి పార్టీలో కొత్త డౌట్లు తెచ్చారు. బీజేపీ వచ్చే ఎన్నికల్లో గెలవాలని ఎంపీ సాయం బాపూరావు కోరుకున్నారు. కొత్త సీఎం గా కిషన్ రెడ్డి ఉండాలని అయన చెప్పడమూ విశేషం.

ఇక ఆ మీటింగ్ కి వెళ్లి వెనక్కి వచ్చేసిన విజయశాంతి మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మీద విమర్శలు ఇండైరెక్ట్ గా చేస్తూ సోషల్ మీడియాలో పెట్టారు. నాడు తెలంగాణా వాదాన్ని ఉక్కుపాదంతో అణచేసిన వారు ఇపుడు బీజేపీలో ఉన్నారు. వారే స్టేజి మీద ఉన్నారు. అందుకే అక్కడ ఎక్కువ సేపు ఉండాలని అనిపించలేదు అని ఆమె ఘాటు కామెంట్స్ చేశారు.

మొత్తం మీద చూసుకుంటే కిషన్ రెడ్డికి పగ్గాలు అప్పగిస్తే అంతా సర్దుకుంటుంది అని భావించిన వారికి ఈ పరిణామాలు మింగుడుపడడంలేదు. రానున్న వంద రోజులు అతి ముఖ్యం, కీలకం అని కిషన్ రెడ్డి తన స్పీచ్ లో చెప్పినా నేతలలో జోష్ అయితే కనిపించలేదు. మరో వైపు చూస్తే సీనియర్ నేతలు జిట్టా బాలక్రిష్ణారెడ్డి, ఏ చంద్రశేఖర్, ఏనుగు రవీందర్ రెడ్డి ఈ కార్యక్రమానికి రాలేదు.

వారితో చర్చలు జరిపి పార్టీలో ఉండాలని ఈటెల రాజేందర్ చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయనడానికి వారి గైర్ హాజరే సాక్ష్యం అంటున్నారు. మొత్తానికి ఎన్నికల వేళ బీజేపీ ఇలా అయిపోయింది ఏమిటి అని అనిపించకమానదు. మరో వైపు చూస్తే కర్నాటక ఎన్నికల ఫలితాల ప్రభావం పూర్తిగా బీజేపీ మీద పడింది అని అంటున్నారు. మరి కిషన్ రెడ్డి ఎలా ఎన్నికల నాటికి కమలం పార్టీకి సమాయత్తం చేస్తారో చూడాలని అంటున్నారు.

Tags:    

Similar News