మాల్దీవులకు వెళుతున్నారా? ఈ పన్ను భారం మోసేందుకు సిద్ధంకండి
ఆ దేశానికి విమానాల్లో వెళ్లే ప్రయాణికుల నుంచి వసూలు చేసే ఫీజును భారీగా పెంచేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
విషయం ఏమైనా కానీ గతానికి భిన్నంగా మాల్దీవులపై ఒక క్లారిటీ భారతీయులకు వచ్చేసింది. నాలుక మడతేసి.. ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ నోరు పారేసుకున్న ఆ దేశ రాజకీయ నేతల కారణంగా ఆ దేశం మరింత పాపులర్ అయ్యింది. తాజాగా తమ దేశానికి వచ్చే విదేశీయుల నుంచి వసూలు చేసే ఎగ్జిట్ ఫీజు పెంపుతో మరోసారి మాల్దీవులు వార్తల్లోకి వచ్చింది. ఆ దేశానికి విమానాల్లో వెళ్లే ప్రయాణికుల నుంచి వసూలు చేసే ఫీజును భారీగా పెంచేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
డిసెంబరు ఒకటి నుంచి అమల్లోకి వచ్చే ఈ కొత్త ఎగ్జిట్ ఫీజు విషయానికి వస్తే.. మాల్దీవులకు వెళ్లి.. అక్కడి నుంచి తిరిగి వెళ్లే వేళలో ఎగ్జిట్ ఫీజును వసూలు చేస్తారు. మల్దీవుల పౌరసత్వం లేని అందరి నుంచి ఈ ఫీజును వసూలు చేస్తారు. అయితే.. ఈ ఫీజును విమాన ప్రయాణంలో జర్నీ చేసే తరగతికి అనుగుణంగా ఫీజులు ఉండటం గమనార్హం. ఎకానమీ క్లాస్ వారికి ప్రస్తుతం ఈ ఎగ్జిట్ ఫీజు 30 డాలర్లు ఉంటే.. డిసెంబరు ఒకటి నుంచి ఇది కాస్తా 50 డాలర్లుగా పెంచారు. మన రూపాయిల్లో చెప్పాలంటే దగ్గర దగ్గర రూ.4200.
అదే బిజినెస్ క్లాస్ ప్రయాణికులైతే 60 డాలర్లుగా ఉండేది. దాన్ని 120 డాలర్లకు పెంచేశారు. ఇక.. ఫస్ట్ క్లాస్ ప్రయాణికులకైతే ఇప్పుడు 90 డాలర్లు ఉండగా.. దాన్ని 240 డాలర్లకు పెంచేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇక.. ప్రైవేటు జెట్ లలో ఆ దేశానికి వచ్చే విదేశీ టూరిస్టుల నుంచి ఇప్పుడు 120 డాలర్లు వసూలు చేస్తుంటే.. దాన్ని 480 డాలర్లకు పెంచేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఫీజును వయసు.. పాస్ పోర్టుతో సంబంధం లేకుండా.. తమ దేశ పౌరులు కాని ప్రతి ఒక్కరి నుంచి వసూలు చేయనున్నారు.
అంతేకాదు.. ఈ ఫీజుకు ప్రయాణ సమయం.. ప్రయాణ దూరంతో కూడా సంబంధం లేదు. మాల్దీవ్ సిటిజన్ కాకుంటే చాలు.. ఫీజు వాయింపేనని చెప్పాలి. ఎగ్జిట్ ఫీజు పెంపునకు సంబంధించి ఇటీవల ప్రకటన చేసిన ఆ దేశ ప్రభుత్వం.. ఎగ్జిట్ ఫీజు ద్వారా వచ్చే ఆదాయాన్నితమ దేశంలోని వెలానా అంతర్జాతీయ విమానాశ్రయ నిర్వహణకు వినియోగించనున్నట్లుగా పేర్కొన్నారు. ఏమైనా.. తమ దేశానికి వచ్చే విదేశీ అతిధులకు ఛార్జీల రూపంలో వసూలు చేసి.. తమను తాము డెవలప్ చేసుకునే తీరును గుర్తించాల్సిందే.