ఉత్తరకొరియాలోకి విదేశీయుల ఎంట్రీ.. కిమ్ ప్లాన్ ఇదీ

‘నిండా మునిగాక ఇప్పుడు పాపం ఉత్తరకొరియా అధ్యక్షుడికి తత్త్వం బోధపడింది. యుద్ధాలు, శత్రుత్వాలతో దేశం ముందుకెళ్లదని గ్రహించి ఇప్పుడు ద్వారాలు తెరిచాడు

Update: 2025-02-26 15:19 GMT

‘నిండా మునిగాక ఇప్పుడు పాపం ఉత్తరకొరియా అధ్యక్షుడికి తత్త్వం బోధపడింది. యుద్ధాలు, శత్రుత్వాలతో దేశం ముందుకెళ్లదని గ్రహించి ఇప్పుడు ద్వారాలు తెరిచాడు. ఉత్తరకొరియా అనే ఆంక్షల లాంటి దేశంలోకి ఐదేళ్ల తర్వాత విదేశీయులకు ద్వారాలు తెరిచారు. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ తన దేశంలో పర్యాటక రంగాన్ని పునరుద్ధరించేందుకు దృష్టి సారించారు. దాదాపు ఐదేళ్ల తరువాత, కిమ్ సర్కార్ తొలిసారిగా విదేశీ పర్యాటకులను తమ దేశంలోకి అనుమతించనుంది. ఈ విషయాన్ని పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు వెల్లడించాయి.

- ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలనే లక్ష్యం

కరోనా మహమ్మారి కారణంగా 2020లో ఉత్తర కొరియా తన సరిహద్దులను మూసివేసి, పర్యాటక కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేసింది. అయితే ఇటీవల కొన్ని వారాల క్రితం కొందరు విదేశీయులు ఉత్తర కొరియాలో పర్యటించినట్లు నివేదికలు వెల్లడించాయి. దేశ ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిన పెట్టేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. విదేశీ మారక నిల్వలను పెంచుకోవడమే ప్రధాన లక్ష్యంగా భావిస్తున్నారు.

- పర్యాటకుల కోసం ఉత్తర కొరియా సిద్ధం

కిమ్ సర్కార్ తీసుకున్న తాజా నిర్ణయంతో యూకే, కెనడా, న్యూజిలాండ్, ఫ్రాన్స్, జర్మనీ, చైనా వంటి దేశాల నుంచి అనేక మంది పర్యటకులు ఉత్తర కొరియాలో పర్యటించేందుకు సిద్ధమవుతున్నట్లు కొరియా టూర్స్ జనరల్ మేనేజర్ తెలిపారు. ప్రభుత్వ చర్యల కారణంగా ఉత్తర కొరియా పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతుందని అంచనా వేస్తున్నారు.

- గత ఏడాది రష్యా పర్యాటకులకు ప్రత్యేక అనుమతి

2023లో ఉత్తర కొరియా సర్కార్ రష్యా నుంచి దాదాపు 100 మంది పర్యాటకులను దేశంలోకి అనుమతించినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆ పర్యాటకులను మినహాయిస్తే, దాదాపు ఐదేళ్ల తర్వాత ఉత్తర కొరియా విదేశీయులను అనుమతించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

-ముందు చూపుతో తీసుకున్న నిర్ణయం

కిమ్ జోంగ్ ఉన్ తీసుకున్న ఈ నిర్ణయం ఉత్తర కొరియా భవిష్యత్ ఆర్థిక ప్రగతికి మార్గదర్శిగా మారే అవకాశం ఉంది. ప్రపంచ దేశాల పర్యాటకులను ఆకర్షించి, దేశానికి అవసరమైన విదేశీ మారక నిల్వలను సమకూర్చుకోవాలనే కిమ్ ప్రభుత్వ లక్ష్యం ఈ నిర్ణయంతో కార్యరూపం దాల్చనుంది.

Tags:    

Similar News