ట్రంప్ పాలన వద్దా... సముద్రంపై నాలుగేళ్లు గడిపేద్దాం రండి!
సర్వే ఫలితాలను తలకిందులు చేస్తూ అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ఘన విజయం సాధించారు.
అత్యంత ఆసక్తికరంగా.. ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఒకానొక సమయంలో 'ఫలితం టై అయితే' అనే చర్చ కూడా జరిగిన నేపథ్యంలో.. స్వింగ్ స్టేట్స్ మొత్తాన్ని క్లీన్ స్వీప్ చేస్తూ ట్రంప్ విజయం సాధించారు.
సర్వే ఫలితాలను తలకిందులు చేస్తూ అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ఘన విజయం సాధించారు. త్వరలో అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ సమయంలో ట్రంప్ గెలిచిన తర్వాత దేశం విడిచి వెళ్లిపోతున్న వారి జాబితా పెరుగుతుందనే చర్చ తెరపైకి వచ్చింది. ఈ సమయంలో ఓ క్రూయిజ్ కంపెనీ ఓ వినూత్న టూర్ ప్యాకేజ్ ని ప్రవేశపెట్టింది.
అవును... విల్లా వై రెసిడెన్స్ అనే క్రూయిజ్ కంపెనీ ఓ వినూత్నమైన టూర్ ప్యాకేజీ ని ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా.. నాలుగేళ్ల పాటు సముద్రంలో ఉండే అవకాశాన్ని కల్పిస్తోంది. అయితే... అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఫలానా వారు గెలిస్తే దేశం విడిచి వెళ్లిపోతామని చెప్పినవారిని దృష్టిలో పెట్టుకొని ఈ అవకాశాన్ని ఈ ప్యాకేజీని తీసుకొచ్చినట్లు చెబుతున్నారు.
ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసిన విల్లా వై రెసిడెన్సీ... ప్రస్తుత పాలన వద్దు అనుకునేవారికి మంచి టూర్ ప్యాకేజీ తీసుకొచ్చినట్లు వెల్లడించింది. ఇందులో భాగంగా.. నాలుగేళ్ల పాటు క్రూయిజ్ షిప్ లో ప్రపంచాన్ని చుట్టేయొచ్చని పేర్కొంది. అయితే.. ఈ ప్రకటనలో ఎక్కడా.. ట్రంప్ పేరు ప్రస్థావించకుండా జాగ్రత్తపడింది.
ఇక ఈ టూర్ ప్యాకేజీ విషయాలకొస్తే... డబుల్ ఆక్యుపెన్సీ గదులకు 1,59,999 డాలరు (సుమారు రూ.1.35 కోట్లు), సింగిల్ ఆక్యుపెన్సీ గదులకు 2,55,999 (సుమారు రూ.2.16 కోట్లు) చెల్లించాల్సిందిగా తెలిపింది. ఇంతకూ ఈ ప్యాకేజీకి పెట్టిన పేరేమిటో తెలుసా... "స్కిప్ ఫార్వర్డ్"!