ఇరాన్ అధ్యక్షుడి మృతికి కారణం ఇదే... తొలి నివేదిక విడుదల

ఇరాన్ దివంగత అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలీకాప్టర్ ప్రమాదంలో మృతి చెందడం ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే

Update: 2024-05-24 06:05 GMT

ఇరాన్ దివంగత అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలీకాప్టర్ ప్రమాదంలో మృతి చెందడం ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. పైగా.. ఇటీవల ఇజ్రాయేల్ - హమాస్ మధ్య జరుగుతున్న పోరులో ఇరాన్ ఎంట్రీ ఇవ్వడం.. ఇజ్రాయేల్ - అమెరికా కు శత్రువు అనే పేరు సంపాదించుకోవడంతో ఈ విషయం మరింత చర్చనీయాంశం అయ్యిందనే కామెంట్లు వినిపించాయి.

ఇందులో భాగంగా ఇరాన్ అధ్యక్షుడి మృతి వెనుక ఇజ్రాయేల్ హస్తం, అగ్రరాజ్యం అమెరికా సహకారం ఉందనే ఊహాగాణాలు కూడా నెట్టింట హల్ చల్ చేశాయి. అయితే వాటిని ఈ ఇరు దేశాలు ఖండించినట్లూ కథనాలొచ్చాయి. ఈ సమయంలో రైసీ హెలీకాప్టర్ ప్రమాదానికి సంబంధించిన ప్రాథమిక నివేదిక విడుదలైంది. ఈ మేరకు ఆ దేశ సాయుధ దళాల జనరల్ స్టాఫ్ తొలి నివేదికను విడుదల చేశారు.

అవును.. ఎన్నో ఊహాగాణాల అనంతరం ఇరాన్ దివంగత అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలీకాప్టర్ ప్రమాదంపై ప్రాథమిక నివేదిక విడుదలైంది. ఇందులో భాగంగా... ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ నిర్ణయించిన మార్గంలోనే వెళుతోంది.. దాని మార్గం నుండి అది తప్పుకోలేదు. హెలికాప్టర్ పైలట్ ఇతర హెలికాప్టర్ సిబ్బందితో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు కూడా కమిటీ నివేదికలో పేర్కొంది.

ఇదే క్రమంలో... ప్రమాదం జరిగిన ప్రాంతంలో పొగమంచు, అత్యల్ప ఉష్ణోగ్రతల కారణంగా సహాయక చర్యలు ఆలస్యమయ్యాయి.. రాత్రంతా గాలింపు కొనసాగింది.. ఉదయం 5 గంటలకు డ్రోన్‌ ల సహాయంతో ఘటన జరిగిన కచ్చితమైన ప్రదేశం గుర్తించబడింది అని ప్రాథమిక నివేదికలో పేర్కొన్నారు. హెలికాప్టర్‌ సిబ్బంది, వాచ్‌ టవర్‌ మధ్య జరిగిన సంప్రదింపుల్లో ఎలాంటి అనుమానాస్పద సంభాషణలను గుర్తించలేదని తెలిపారు.

కాగా... అజర్‌ బైజాన్ సరిహద్దులోని డ్యామ్‌ ను ప్రారంభించి తిరిగి వస్తుండగా రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. అజర్‌ బైజాన్ సరిహద్దులోని జోల్ఫా నగరానికి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ సమయంలో రైసీతో పాటు హెలికాప్టర్‌ లో మొత్తం 9 మంది సిబ్బంది ఉన్నారు. ఆదివారం ప్రమాదం తర్వాత, సెర్చ్ ఆపరేషన్ సోమవారం ఉదయం 5 గంటల వరకు కొనసాగింది.

మరోపక్క ఇబ్రహీం రైసీ అంత్యక్రియలు గురువారం షియా మతస్థులకు అత్యంత పవిత్రమైన మషహద్‌ నగరంలో జరిగాయి.

Tags:    

Similar News