పేర్ని నాని...టన్నుల కొద్దీ ధైర్యమా !
తాము అరెస్టులకు భయపడే రకం కాదని ఆయన అన్నారు. నా ఫోన్లు ట్యాప్ చేయిస్తున్నారని తెలిసే కావాలనే ఎక్కువగా తిడుతున్నామని ఆయన అన్నారు.
పేర్ని నాని వైసీపీలో కీలక నేత. మాజీ మంత్రి ఫైర్ బ్రాండ్. ఇటీవల కాలంలో ఆయన మీడియా ముందుకు రావడం బాగా తగ్గించేశారు. అంతే కాదు సైలెంట్ అయ్యారు. ఆయన మీద సతీమణి మీద కేసులు ఫైల్ కావడంతో నాని కొంత తగ్గారు అని అంతా అనుకున్నారు.
అయితే అనూహ్యంగా ఆయన మీడియా ముందుకు వచ్చి తనదైన భాషతో కూటమి నేతల మీద హాట్ కామెంట్స్ చేశారు. నన్ను అరెస్టు చేసుకుంటే చేసుకోండి అంటూ సవాల్ చేశారు. నా అరెస్ట్ గురించి నవంబర్ నెల నుంచి చెబుతున్న మంత్రి కొల్లు రవీంద్రకు చెబుతున్నా అరెస్టు చేసుకోండి నాకు ఏమీ కాదు అని పేర్ని నాని హాట్ కామెంట్స్ చేశారు.
అంతే కాదు నారా లోకేష్ కి ఇదే తీరున ఆయన సవాల్ విసిరారు. ఇక విజయవాడ నుంచి కొందరు పోలీసు అధికారులను ఉపయోగించి మచిలీపట్నంలోని వైసీపీ నాయకులు కార్యకర్తల ఫోన్లను టాప్ చేస్తున్నారు అని ఆయన సంచలన ఆరోపణలు చేశారు.
క్రియాశీలకంగా ఉన్న వైసీపీ నాయకుల ఫోన్లను ట్యాప్ చేయడమే కాకుండా వాళ్ళ సతీమణుల పిల్లల ఫోన్లు కూడా ట్యాప్ చేస్తున్నారు అని నాని అన్నారు. ఇందంతా ఎందుకు చేస్తున్నారు అని ఆయన ప్రశ్నించారు. కుటుంబాలను బెదిరించడానికా అని నిలదీశారు.
ఈ రకమైన రాజకీయ విధానాలు మంచివి కావని అన్నారు. తాము ఏ తప్పూ చేయలేదని కాబట్టే బయటే ఉన్నామని ఆయన అన్నారు. అరెస్టు చేసుకోమని కూడా తాము అడుగుతున్నామంటేనే తమ నిజాయతీ గురించి ఆలోచించాలని అన్నారు.
తాము అరెస్టులకు భయపడే రకం కాదని ఆయన అన్నారు. నా ఫోన్లు ట్యాప్ చేయిస్తున్నారని తెలిసే కావాలనే ఎక్కువగా తిడుతున్నామని ఆయన అన్నారు. మొత్తానికి పేర్ని నాని చాలా కాలం తరువాత మీడియా ముందుకు వచ్చారు. ఆయన విజయవాడ జైలులో ఉన్న వల్లభనేని వంశీని ములాఖత్ ద్వారా పరామర్శించారు.
ఇక చూస్తే వంశీ అరెస్టుతో పేర్ని నాని కొడాలి నానిలలో ఎక్కడ లేని ధైర్యం వచ్చిందా అన్న చర్చ సాగుతోంది. కొడాలి నాని అయితే మీడియాతో మాట్లాడుతూ అరెస్టులు అన్నవి చాలా చిన్న విషయాలుగా చెప్పారు వారిష్టం వచ్చినట్లుగా చేసుకోవచ్చు అని కూడా అన్నారు.
పేర్ని నాని కూడా మీరు అరెస్ట్ చేసుకున్నా ఏమీ కాదని కూటమి నేతలకు సవాల్ చేస్తున్నారు. మరి ఈ అరెస్టులు కూటమి ప్రభుత్వం మీద రాజకీయ యుద్ధానికి ఆయుధంగా పనికి వస్తాయన్న ఆలోచనతోనే ఈ విధంగా చేస్తున్నారా అన్న చర్చ సాగుతోంది. అంతే కాదు అరెస్టు అయితే వచ్చే పొలిటికల్ మైలేజ్ కూడా వేరే లెవెల్ లో ఉంటుందని కూడా చాలా మంది వైసీపీ నేతలు భావిస్తున్నారా అన్నది కూడా చర్చించుకుంటున్నారు. మొత్తానికి కూటమి ప్రభుత్వానికి తొమ్మిది నెలలు గడుస్తున్న నేపథ్యంలో పేర్ని నాని సహా చాలా మంది వైసీపీ నేతలకు టన్నుల కొద్దీ ధైర్యం అయితే వచ్చిందా అన్న చర్చ సాగుతోంది.