గార్డెన్ సిటీలో మరీ ఇంత ఘోరమా?

Update: 2016-02-04 05:26 GMT
తాలిబన్ల ఆరాచకాల్ని చదివినప్పుడు ఎక్కడికి పోతున్నామనిపించకమానదు. అక్కడి ప్రజల గురించి తలుచుకొని బాధపడతాం. వారి పరిస్థితి ఎంత దయనీయంగా ఉంటుందని ఫీలవుతాం. కానీ.. తాజాగా ఘటన వింటే ఎక్కడో ఉన్న తాలిబన్ల సంగతి తర్వాత.. భారత సిలికాన్ వ్యాలీగా చెప్పుకునే గార్డెన్ సిటీ బెంగళూరులో ఇంత దారుణమా? అని ముక్కున వేలేసుకోవటం ఖాయం. మన దగ్గరా మరీ ఇంతలా చేస్తారా? అన్న సందేహం కలగటం ఖాయం. వినేందుకే ఒళ్లు జలదరించే ఈ ఘటన కాస్త ఆలస్యంగా బయటకు వచ్చింది. ఆ ఘటన వివరాల్లోకి వెళితే..

బెంగళూరు పట్టణ పొలిమేరల్లో ఆదివారం ఒక రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సూడాన్ కు చెందిన ఒక యువకుడు కారులో వెళుతూ.. ఒక మహిళను ఢీ కొన్నాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. దురదృష్టవశాత్తు.. అదే సమయానికి టాంజానియాకు చెందిన ఒక యువతి కారులో అక్కడికి వచ్చింది. అప్పటికే ఆగ్రహంతో ఉన్న అక్కడి స్థానికులు.. యాక్సిడెంట్ చేసింది సదరు యువతేనని భావించి ఆమెను కారు నుంచి బయటకు లాగారు. అనంతరం వివస్త్రను చేశారు. ఒంటి మీద నూలుపోగు లేకుండా చేసి  చాలాసేపు నగ్నంగా వీధుల్లో తిప్పారు.

అదే సమయంలో ఆమె కారును దహనం చేశారు. ఆమె పరిస్థితిని గుర్తించిన ఒక యువకుడు తన టీ షర్ట్ ఇచ్చే ప్రయత్నం చేస్తే.. అతడి మీదా దాడికి పాల్పడ్డారు. దీంతో.. అటుగా వెళుతున్న బస్సులో పారిపోయేందుకు ఆ యువతి బస్సు ఎక్కితే.. అందులోని ప్రయాణికులు ఆమెను బస్సు నుంచి దించేసి.. అక్కడి ఆందోళనకారులకు అప్పగించారు. అలా ఆమెకు ప్రత్యక్ష నరకం చూపించారు. తనకేమాత్రం సంబంధం లేని ఉదంతంలో ఇరుక్కున్న సదరు యువతికి చోటు చేసుకున్న అవమానం చూస్తే షాకింగ్ గా అనిపించక మానదు. ఇదంతా కాస్మో నగరంగా పేర్కొనే బెంగళూరు మహానగరంలో చోటు చేసుకోవటం గమనార్హం.
Tags:    

Similar News