బొత్స కొడుకు ఆ సీటు నుంచి పొలిటికల్ ఎంట్రీ...?
రాజకీయ వారసులకు జగన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు అని అంటున్నారు
By: Tupaki Desk | 28 July 2023 3:30 PM GMTరాజకీయ వారసులకు జగన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు అని అంటున్నారు. అది కీలకమైన చోట్ల అవసరం ఉన్న నాయకులకు మాత్రమే అని కండిషన్ పెట్టుకోవాలి. ఆ లెక్కలోనే చూసుకుంటే విజయనగరం జిల్లా వైసీపీకి చాలా ముఖ్యమైనది. 2019 ఎన్నికల్లో ఈ జిల్లాలో మొత్తానికి మొత్తం 9 ఎమ్మెల్యే, ఒక ఎంపీ సీటుని క్లీన్ స్వీప్ చేసి పారేసింది వైసీపీ.
ఈసారి కూడా ఆ మ్యాజిక్ కంటిన్యూ చేయాలని అనుకుంటోంది. దాంతో జిల్లాలో పెద్ద నాయకుడు, సీనియర్ మంత్రి అయిన బొత్స సత్యానారాయణకు జిల్లాలో ఎక్కువ ప్రయారిటీ ఇవ్వవచ్చు అని అంటున్నారు. ఇప్పటికే బొత్స కుటుంబంతో ఆయన సన్నిహితులతో వైసీపీ జిల్లాలో నిండిపోయింది.
ఇపుడు ఆయన వారసుడు కూడా 2024 ఎన్నికలతో ఎంట్రీ ఇవ్వబోతున్నారు అని అంటున్నారు. డాక్టర్ చదివిన బొత్స సందీప్ రాజకీయ అరంగేట్రానికి రంగం సిద్ధం అయింది అని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో బొత్స సత్యనారాయణను విజయనగరం నుంచి ఎంపీగా పోటీ చేయమని హై కమాండ్ కోరుతోంది. అయితే బొత్స దానికి ఒక కండిషన్ పెట్టారని అంటున్నారు.
తనకు ఎంపీ టికెట్ ఇస్తే తన సొంత సీటు చీపురుపల్లి నుంచి తన కుమారుడు బొత్స సందీప్ కి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని. దానికి హై కమాండ్ ఒకే చెప్పిందని అంటున్నారు. దాంతో బొత్స సందీప్ ఈ ఎన్నికలలో పోటీ చేయడం డ్యాం ష్యూర్ గా కనిపిస్తోంది. బొత్స సందీప్ వైసీపీ నుంచి బరిలో ఉంటే చీపురుపల్లి నుంచి టీడీపీ తరఫున కిమిడి నాగార్జున రంగంలో ఉంటారు.
ఈ ఇద్దరూ మంచి మిత్రులు. అయితే ఇపుడు రెండు పార్టీల నుంచి ఈ యువతరం 2024 ఎన్నికల్లో తలపడుతుంది అన్న మాట. మరో వైపు చూస్తే బొత్స ఝాన్సీరాణికే విజయనగరం ఎంపీ సీటు ఇచ్చి బొత్సను చీపురుపల్లి నుంచి పోటీ చేయించాలని అనుకున్నారు. కానే ఆమె ఆనారోగ్య సమస్యలతో పోటీకి నో చెప్పారని అంటున్నారు.
పైగా ఈ ఎన్నికలలోనే తన కుమారుడిని రాజకీయంగా ముందుకు తేవాలని బొత్స భావిస్తున్నారు అని అంటున్నారు. దీంతో బొత్స వారసుడు ఈసారి ఎమ్మెల్యేగా పోటీకి దిగడం ఖాయమని అంటున్నారు. అదే విధంగా బొత్స తమ్ముడు అప్పలనరసయ్యకు మరోసారి గజపతి నగరం సీటు ఫిక్స్ చేస్తున్నారు అని అంటున్నారు.
విజయనగరం జిల్లా బాధ్యతలను మళ్లీ బొత్సకే వైసీపీ అప్పగించింది అని అంటున్నారు. బొత్స ఈసారి కూడా ఉమ్మడి విజయనగరంలో ఉన్న మొత్తం 9 సీట్లను ఒక ఎంపీ సీటుని గెలిపించుకుని వస్తారా అన్నది చూడాల్సి ఉంది. ఇక బొత్స సందీప్ తండ్రి మూడు సార్లు గెలిచి అనేక ఏళ్ళ పాటు మంత్రిగా పనిచేసిన సీటు నుంచి గెలిచి రికార్డు క్రియేట్ చేస్తారా అన్నది కూడా చూడాల్సి ఉంది.