కుప్పంలో చంద్రబాబు పొలిటికల్ ఇంజనీరింగ్ హిట్టేనా...?
కుప్పం చంద్రబాబు సొంత సీటు
By: Tupaki Desk | 25 July 2023 1:30 AM GMTకుప్పం చంద్రబాబు సొంత సీటు. ఆయనను రాజకీయంగా పెంచి పోషించిన సీటు. ఒక సాధారణ ఎమ్మెల్యే నుంచి అసాధారణ రాజకీయ నేతగా మార్చిన సీటు. కుప్పంలో 2024 ఎన్నికల్లో చంద్రబాబు ఎనిమిదవసారి పోటీ చేయబోతున్నారు. ఈసారి కుప్పంలో బాబుని కూడా ఓడిస్తామని వైసీపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శపధమే చేశారు. ఆయన సొంత సీటు పుంగనూరు కంటే కూడా కుప్పంలోనే ఎక్కువ సార్లు మకాం వేసి మరీ అక్కడ రాజకీయాన్ని మొత్తం అనుకూలం చేసుకునే పనిలో ఉన్నారు.
వైసీపీలో ధైర్యం పెరగడానికి కారణం లోకల్ బాడీస్ ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడి కునారిల్లడం. అదే టైంలో కుప్పం మునిసిపాలిటీగా చేసి రెవిన్యూ డివిజన్ ఇచ్చి అభివృద్ధి తామే చేశామని వైసీపీ చెప్పుకుంటోంది. ఇవన్నీ పక్కన పెడితే ఎంత చెడ్డా చంద్రబాబే తమ ఎమ్మెల్యే అని కుప్పంలో ఈ రోజుకీ జనాలలో ఉంది అన్నది ఒక అభిప్రాయం.
దానికి తోడుగా కుప్పంలో టీడీపీకి కరడు కట్టిన అభిమానులు ఉన్నారు. ఇన్నాళ్ళూ కుప్పాన్ని నడిపించే సరైన నాయకత్వం లేకపోవడం, బాబు నమ్మి అక్కడ ఇంచార్జిగా చేసిన వాళ్ళు సరిగ్గా పనిచేయకపోవడం వల్లనే పార్టీ దెబ్బ తింది అన్నది టీడీపీ అధినాయకత్వం గుర్తించింది. దాంతో కుప్పంలో ఇపుడు బాబు ప్లాన్ మార్చేశారు. పొలిటికల్ ఇంజనీరింగ్ సరికొత్తగా స్టార్ట్ చేశారు.
ఈ దెబ్బతో కుప్పంలో ఏకంగా లక్ష దాటి మెజారిటీ రావాలని బాబు అండ్ కో ఫిక్స్ అయిపోయింది. ఈసారి కుప్పంలో చంద్రబాబుకు వచ్చే మెజారిటీకి ఏపీ అంతా రీ సౌండ్ వినిపించాలని, అదే విధంగా కుప్పంలో బాబుకు ఇది ఘనమైన బహుమానం కావాలని కూడా ఆ పార్టీ శ్రేణులు పరితపిస్తున్నాయి. ఒక విధంగా చెప్పాలీ అంటే 2024 ఎన్నికలు చంద్రబాబుకు దాదాపుగా చివరివి అని అంటున్నారు.
ఈసారి ఆయన గెలిచి సీఎం అయి తాను ఏపీకి చేయాల్సిన పనులు అన్నీ చేశాక పూర్తిగా పొలిటికల్ గా రిటైర్మెంట్ ప్రకటిస్తారు అని అంటునారు. దాంతో కుప్పం వాసులకు ఆ సెంటిమెంట్ ని ముందు పెట్టి పండించే పనిలో టీడీపీ పొలిటికల్ ఇంజనీర్స్ గట్టిగానే గ్రౌండ్ లెవెల్ లో వర్క్ చేస్తున్నారుట. ఈసారికి బాబుకే మొత్తం కుప్పం అంతా ఓటెత్తాలని ఆయనకు ఇదే అధ్బుతమైన గిఫ్ట్ కావాలని కూడా అంటున్నారుట.
ఇక చంద్రబాబు మాటలతో ఊరుకోవడంలేదు. కుప్పంలో తనతో పాటుగా గట్టిగా పనిచే ఒక కీలక నేతకు బాధ్యతలు అప్పగించారు. ఆయన ఎవరో కాదు ఈ మార్చిలో వైసీపీని ఎదిరించి మరీ రాయలసీమ పట్టభద్రుల ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కంచర్ల శ్రీకాంత్. ఆయన మెరికలాంటి వారు. పదునైన వ్యూహాలకు పెట్టింది పేరుగా చెబుతారు. అందుకే ఆయన్ని చంద్రబాబు ఏరి కోరి మరీ కుప్పం ఇంచార్జిగా నియమించారు.
ఇక పెద్దిరెడ్డి కుప్పంలో మకాం వేస్తే ఆయనకు పోటీగా ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ కూడా కుప్పంలోనే బస చేస్తున్నారు చంద్రబాబు కుప్పానికి అద్దె నాయకుడు అని ఇటీవల పెద్దిరెడ్డి సెటైర్లు వేస్తే అసలు మంత్రి పెద్దిరెడ్డికి కుప్పంతో పనేంటి అని కంచర్ల శ్రీకాంత్ రివర్స్ అటాక్ చేశారు. తాను ఎమ్మెల్సీని అని తన పట్టభద్రుల నియోజకవర్గం కుప్పంలో కూడా ఉందని ఆయన అంటున్నారు.
ఇక అంతటితో ఆగకుండా తాను కుప్పం మునిసిపాలిటీలో ఎక్స్ అఫీషియో మెంబర్ ని అని కూడా చెబుతున్నారు. ఇలా కుప్పం నా సొంతం అంటూ కంచర్ల శ్రీకాంత్ చేస్తున్న గర్జన టీడీపీ శ్రేణులలో కొత్త ఉత్సాహం కలిగిస్తోంది అని అంటున్నారు. ఈసారి ఎన్నికల్లో చంద్రబాబుకు లక్ష ఓట్ల మెజారిటీని తీసుకుని రావడమే తన లక్ష్యమని శ్రీకాంత్ అంటున్నారు.
ఆయన అదే పనిలో ఉన్నారు. మొత్తం మీద చూస్తే కుప్పంలో టీడీపీకి ఇన్నాళ్లకు సరైన నాయకుదు దొరికారు అని, ఆయన వ్యూహాల్తో పెద్దిరెడ్డికి ధీటుగానే ఎదుర్కొంటున్నారు అని అంటున్నారు. చూడాలి మరి పెద్దిరెడ్డి వర్సెస్ శ్రీకాంత్ గా మరిన కుప్పంలో లక్ష మెజారిటీ బాబుకు వస్తుందా. లేక వైసీపీ చెబుతున్నట్లుగా కుప్పంలో బాబు ఓడుతారా. వెయిట్ అండ్ సీ.