అదే తూర్పు.. మరో ఎంపీ వర్సెస్ మంత్రి స్టోరీ స్టార్ట్
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో వైసీపీకి ఎన్నికల వేళ
By: Tupaki Desk | 25 July 2023 3:59 AM GMTఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో వైసీపీకి ఎన్నికల వేళ ఏమిటి ఇలా జరుగుతోంది అన్నదే పార్టీ పెద్దలకు పట్టుకుంది. ఇప్పటికే రామచంద్రాపురంలో రాజ్యసభ ఎంపీ వర్సెస్ మంత్రి వేణుగా అగ్గి రాజుకుంది. అది ఆరలేదు, ఆ సమస్య తీరనే లేదు. ఇపుడు అదే జిల్లాలో అమలాపురంలో ఎంపీ వర్సెస్ మంత్రి స్టోరీ స్టార్ట్ అయింది ఇది కూడా అచ్చం రామచంద్రాపురం స్టోరీగానే ఉండడం విశేషం.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అమలాపురంలో ఈ నెల 26న పర్యటించాల్సి ఉంది. అక్కడ ఆయన డ్వాక్రా సంఘాలకు సున్నా వడ్డీ రాయితీ నిధులను బటన్ నొక్కి జగన్ జమ చేయాల్సి ఉంది. అయితే భారీ వర్షాల నేపధ్యంలో సీఎం పర్యటన రద్దు అయింది. కానీ రచ్చకు మాత్రం ఈ పర్యటన ప్రకటన తావిచ్చింది అంటున్నారు. అమలాపురంలో సీఎం టూర్ అనగానే మంత్రి పినిపె విశ్వరూప్ హడావుడి మొదలైంది. ఆయన వర్గీయులు అంతా కలసి అమలాపురం అంతటా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.
ఎక్కడ చూసినా మంత్రి ఫోటో, ఆయన తనయుడు పినిపె శ్రీకాంత్ ఫోటోలు తప్ప అమలాపురం ఎంపీ చింతా అనూరాధ ఫోటోలు కనిపించలేదు. సీఎం దిగాల్సిన హెలిపాడ్ నుంచి మీటింగ్ వేదిక వరకూ అన్ని ఫ్లెక్సీలలో మంత్రి ఆయన కుమారుడే తప్ప ఎంపీ ఎక్కడా ఒక్క ఫోటో కూడా లేకుండా పోయారు. దాంతో ఎంపీ వర్గీయులు మంత్రి మీద మండిపడుతున్నారు. అసలే ఎంపీకి మంత్రికి మధ్య విభేదాలు ఉన్నాయని ఇద్దరి మధ్యన పొసగడంలేదని, ఎడముఖం పెడముఖంగానే ఉంటున్నారు అని ప్రచారంలో ఉంది.
ఇపుడు అది కాస్తా అగ్గి రాజుకునేలా మారింది అంటున్నారు. ఇతర జిల్లాల నాయకుల ఫోటోలు కూడా ఫ్లెక్సీలో పెట్టారే లోకల్ ఎంపీ ఫోటో మాత్రం పెట్టలేకపోయారు ఎందుకు అంటూ అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు అనూరాధ మద్దతుదారులు. ఇదిలా ఉంటే ఎంపీ వర్సెస్ మంత్రి గొడవలో మంత్రి కొడుకు రావడం బిగ్ ట్విస్ట్. ఇది కూడా అచ్చం రామచంద్రాపురం కథ లాగానే ఉంది అంటున్నారు.
అక్కడ కూడా రాజకీయ వారసత్వం కోసమే మంత్రి వర్సెస్ ఎంపీగా కధ సాగింది. ఇక్కడ మార్పు ఏంటి అంటే మంత్రి కొడుకే వారసుడు. అక్కడ ఎంపీ పిల్లి కొడుకు వారసత్వం కోసం రగడ సాగింది. ఇక మంత్రి పినిపె విశ్వరూప్ కొడుకు శ్రీకాంత్ ని వచ్చే ఎన్నికల్లో అమలాపురం నుంచి లోక్ సభకు పోటీ చేయించాలని తాను యధాప్రకారం ఎమ్మెల్యేగా పోటీ చేసి పార్టీ అధికారంలోకి వస్తే మళ్లీ మంత్రి కావాలని పినిపె విశ్వరూప్ భావిస్తున్నారు అని అంటున్నారు.
దీంతో ఏకంగా సిట్టింగ్ ఎంపీ అనూరాధ సీటుకే ఎసరు పెడుతూ ఆమెను పొమ్మనలేక పొగ పెడుతూ సొంత పార్టీలోనే ఇలా చేస్తున్న తీరు మీద అనూరాధ వర్గం అగ్గి మీద గుగ్గిలం అవుతోందిట. మరో వైపు చూస్తే సీఎం అమలాపురం పర్యటన నేపధ్యంలో మంత్రి స్థానిక నేతలతో నిర్వహించిన సమావేశానికి కూడా ఎంపీ అనూరాధకు కబురు కానీ పిలుపు కానీ రాలేదని అంటున్నారు. దీంతో అమలాపురంలో ఎంపీ వర్సెస్ మంత్రి చిచ్చి రాజుకుంది. దీన్ని ఎలా ఆపాలో వైసీపీ హై కమాండ్ ఆలోచించాల్సిందే అంటున్నారు.