Begin typing your search above and press return to search.

చంద్రబాబుని గట్టిగా తగులుకున్న గొల్లపల్లి... రాజోలులో రీసౌండ్!

ఈ మేరకు వైఎస్ జగన్ సమక్షంలో తాడేపల్లి సీఎం క్యాంప్ ఆఫీసులో గొల్లపల్లిని పార్టీలోకి ఆహ్వానించారు

By:  Tupaki Desk   |   28 Feb 2024 10:28 AM GMT
చంద్రబాబుని గట్టిగా తగులుకున్న గొల్లపల్లి... రాజోలులో రీసౌండ్!
X

ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలుగుదేశం పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఇందులో భాగంగా మాజీమంత్రి, టీడీపీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గొల్లపల్లి సూర్యారావు టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో జాయిన్ అయ్యారు. ఈ మేరకు వైఎస్ జగన్ సమక్షంలో తాడేపల్లి సీఎం క్యాంప్ ఆఫీసులో గొల్లపల్లిని పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి!

అవును... కోనసీమలో టీడీపీకి గట్టి షాక్ తగిలింది. ఇప్పటికే బాబు విధానాలు నచ్చక పార్టీకి రాజీనామా చేసిన టీడీపీ నేతల జాబితాలో తాజాగా మాజీమంత్రి గొల్లపల్లి సూర్యారావు చేరారు. ఈ నేపథ్యంలో ఆయన బుధవారం మధ్యాహ్నం సీఎం జగన్ సమక్షంలో ఫ్యాన్ కిందకి చేరిపోయారు! ఇంతకాలం ఎండనక, వాననక సైకిల్ తొక్కి సేవ చేసిన పార్టీలో అవమానం జరగడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది.

ఈ సందర్భంగా మైకుల ముందుకు వచ్చిన మాజీమంత్రి, వైసీపీ నేత గొల్లపల్లి సూర్యారావు... తెలుగుదేశం పార్టీలో ఎంతో నిబద్ధతతో పనిచేసినట్లు తెలిపారు. అయినప్పటికీ తనను మెడపట్టి బయటకు గెంటివేశారని వాపోయారు. తన విషయంలో చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ లు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారని.. ఉండే ఉండు పోతే పో అన్నట్లుగా ప్రవరించారని తెలిపారు!

ఇదే క్రమంలో నారా లోకేష్ తనదైన జ్ఞానంతో దుర్మార్గపు రీతిలో ఆ పార్టీని నడిపిస్తున్నాడన్నట్లుగా చెప్పిన గొల్లపల్లి... ఆ బాధలో ఉన్న తనను సీఎం వైఎస్ జగన్ అక్కున చేర్చుకున్నారని తెలిపారు. పార్టీకోసం ఎంతో చేస్తే... విశ్వాసం లేకుండా చంద్రబాబు తనను మెడపట్టుకుని బయటకు గెంటారన్నట్లుగా గొల్లపల్లి ఫైర్ అయ్యారు. ఈ నేపథ్యంలో జగన్‌ నాయకత్వంలో వైసీపీ కోసం శాయశక్తుల పని చేస్తానని స్పష్టం చేశారు.

ఇక వైఎస్ జగన్ తో భేటీ కాకముందు చంద్రబాబుకు ఒక బహిరంగ లేఖ రాశారు గొల్లపల్లి. ఇందులో భాగంగా... తన ఆత్మగౌరవాన్ని చంద్రబాబు దెబ్బతీశారని.. అందువల్లే తాను పార్టీకి రాజీనామా చేస్తున్నానని.. తన రాజీనామాను వెంటనే ఆమొదించాలని తెలిపారు. దీంతో... కోనసీమ టీడీపీలో ప్రకంపనలు మొదలవ్వగా... ఆ ప్రకంపనలకు రాజోలులో గాజు గ్లాసుకు పగుళ్లు వస్తున్నాయనే కామెంట్లు వినిపిస్తున్నాయి!

కాగా... 2004లో తొలిసారి గెలిచి అసెంబ్లీలోకి అడుగుపెట్టిన గొల్లపల్లి సూర్యారావు వైఎస్ రాజశేఖర్ రెడ్డి కేబినెట్ లో చిన్నపరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేశారు. ఈ క్రమంలో 2014లో రాష్ట్ర విభజన అనంతరం టీడీపీ నుంచి 2014లో రాజోలులో గెలిచారు. 2019 ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు!