Begin typing your search above and press return to search.

జగన్ కు జోగయ్య మరో లేఖ... హిస్టరీ ఇదే!

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి

By:  Tupaki Desk   |   25 July 2023 11:26 AM GMT
జగన్ కు జోగయ్య మరో లేఖ... హిస్టరీ ఇదే!
X

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్ రెడ్డికి మరోలేఖ రాశారు మాజీ మంత్రి, కాపు నేత చేగొండి హరిరామజోగయ్య. జనసేన అధినేతకు సూచనలు చేయాలన్నా.. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ని ప్రశ్నించాలన్నా, విమర్శించాలన్నా లేఖలను ఆశ్రయిస్తున్న ఆయన తాజాగా మరోసారి జగన్ కు లేఖ రాశారు.

అవును... ఇప్పటికే పలు అంశాలను లేఖల ద్వారా సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లిన హరిరామ జోగయ్య.. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్‌ నియామకం విషయంపై లేఖ రాశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కాపు, తెలగ, బలిజ ఒంటరి కులస్తులు జనాభాను తెరపైకి తీసుకురావడం కొసమెరుపు.

ఏపీలో తిరుమల తిరుపతి దేవస్ధానం (టీటీడీ) బోర్డు ఛైర్మన్ గా ఉన్న వైవీ సుబ్బారెడ్డిని వైసీపీ సర్కార్ మార్చబోతోందంటూ ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ కీలక పదవి కోసం ఇప్పటికే వైసీపీలో ఉన్న పలువురు నేతలు పోటీ పడుతున్నారని అంటున్నారు. ఇందులో భాగంగా ఎవరి పైరవీలు వారు చేశారని సమాచారం.

అయితే ఈ విషయంలో సీఎం జగన్ మాత్రం బీసీ నేత, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తికి ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అత్యంత ప్రతిష్టాత్మకమైన తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవి ఈసారి ఓ బీసీ నాయకుడికి ఇవ్వాలని జగన్ నిర్ణయించారని అంటున్నారు. ఇందులో భగంగా... వైసీపీ ఎమ్మెల్సీ, అసెంబ్లీ బీసీ వెల్ఫేర్ కమిటీ అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తిని ఆ పదవి వరించనుందని తెలుస్తోంది.

ఈ సమయంలో జగన్ నిర్ణయం తీసేసుకున్నారంటూ వార్తలు వస్తోన్న తరుణంలో హరిరామజోగయ్య స్పందించారు. టీటీడీ ఛైర్మన్ పదవిని కాపుల్లో ఉపకులమైన బలిజలకు ఇవ్వాలని సీఎం జగన్ కు రాసిన లేఖలో కోరారు. రాయలసీమలోని బలిజలకు ఈ పదవి ఇవ్వాలని ఆయన సూచించారు.

రాయలసీమలో కాపుల జనాభా 20 లక్షలు ఉందని.. భవిష్యత్తులో కాపు కులస్తుల సహకారం అందుకోదలిస్తే తెలివైన మీరి ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటారని ఆశిస్తూ.. టీటీడీ ఛైర్మన్ పదవిని బలిజలకు కేటాయించాలని జోగయ్య సీఎం జగన్ ను కోరారు.

ఇదే క్రమంలో... రాష్ట్రంలో కాపులు, బలిజలు, తెలగ, ఒంటరి కులాల జనాభా 22 శాతంగా ఉన్న విషయాన్ని గుర్తిచేసిన జోగయ్య... మాజీ ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి నుంచి ఈరోజు వరకూ కాపుల్ని వాడుకోవడం తప్ప కనీసం రిజర్వేషన్ సౌకర్యం కూడా కలుగజేయడానికి ఏ ముఖ్యమంత్రి చిత్తశుద్ధితో పనిచేయలేదని చెప్పుకొచ్చారు.

అయితే టీడీపీ చైర్మన్ గా బీసీ సామాజికవర్గానికి చెందిన నేతను ఎంపిక చేస్తున్నారని ఆయన పేరుతో సహా కథనాలు పత్రికల్లో వచ్చిన చాలా రోజుల తర్వాత జోగయ్య ఈ లేఖ రాయడం గమనార్హం. దీంతో ఈ లేఖలో బలిజలపై చిత్తశుద్ధి కంటే జగన్ ను ఇరుకున పెట్టాలనే ఉద్దేశ్యమే స్పష్టంగా కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు.

కాగా... చేగొండి హరిరామ జోగయ్య కాంగ్రెస్ పార్టీ నుంచి 2004లో లోక్ సభకు ఎన్నికయ్యారు. ఎన్టీఆర్ పార్టీ పెట్టిన తర్వాత టీడీపీలో చేరారు. ఆ సమయంలో నరసాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ఎన్టీఆర్ కేబినెట్ లో హోమంత్రిగా పనిచేశారు. తిరిగి మరళా కాంగ్రెస్ పార్టీలో చేరారు.

ఈ నేపథ్యంలో 2008 కాంగ్రెస్ సభ్యత్వానికి రాజీనామా చేసి చిరంజీవి ప్రారంభించిన ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఆ తర్వతా వైసీపీలో జాయిన్ అయ్యారు. 2014 లో జనసేన స్థాపించిన సమయంలో వైసీపీకి రాజినామా చేశారు. అయితే జనసేనలో ఈయన చేరలేదో.. పవన్ చేర్చుకోలేదో తెలియదు కానీ... ప్రస్తుతం ప్రతక్ష రాజకీయాల్లో యాక్టివ్‌ గా లేరు! అప్పుడప్పుడూ పవన్ కు రాజకీయంగా సలహాలిస్తూ లేఖలు రాసుంటారు!