తాడేపల్లికి వినతుల వెల్లువ.. ఎక్కడ నుంచి ఎందుకు?
వైసీపీ అధినేత సీఎం జగన్‌కు వినతులు వెల్లువెత్తుతున్నాయని తాడేపల్లి వర్గాలు చెబుతున్నాయి
By: Tupaki Desk | 28 July 2023 4:10 AM GMTవైసీపీ అధినేత, సీఎం జగన్‌కు వినతులు వెల్లువెత్తుతున్నాయని తాడేపల్లి వర్గాలు చెబుతున్నాయి. అవన్నీ కూడా వచ్చే ఎన్నికలకు సంబంధించిన వినతులేనని ఆ వర్గాలు అంటున్నాయి. ''వచ్చే ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే కొన్ని వందల వినతులు వచ్చాయి. వీటిని పరిష్కరించే బాధ్యత ఇప్పుడు తలకు మించిన భారంగా మారింది'' అని గుంటూరుకు చెందిన కీలక నాయకుడు, తాడేపల్లిలోనే ఉండి.. పార్టీ కార్యక్రమాలపై దృష్టి పెట్టే నేత ఒకరు చెప్పుకొచ్చారు.
అయితే.. ఈ వినతుల్లో సాధారణంగా.. టికెట్లు ఆశించేవారు ఉంటారని.. వచ్చే ఎన్నికల్లో తమకు టికెట్ ఇవ్వాలని కోరుకునేవారు ఇలా.. ఏదో ఒక రూపంలో అధినేతను ఆశ్రయిస్తారని అనుకుంటే పొరపాటే. ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఉన్నవారికి టికెట్లు ఇవ్వొద్దని.. కొందరు, అవినీతి జరుగుతోందని మరికొందరు.. ఇలా.. నేరుగా సాక్ష్యాలు, ఆధారాలతో సహా.. తాడేపల్లికి వర్తమానం చేరవేస్తున్నారు. వీటిలో కీలకమైన 8 నియోజకవర్గాలు ఉన్నాయని తాడేపల్లి వర్గాలు చెబుతున్నాయి.
పత్తికొండ, గన్నవరం, పాతపట్నం, విశాఖ ఉత్తరం(ఇక్కడ టీడీపీ గెలిచింది), గురజాల, మచిలీపట్నం, పెడన, మైలవరం, చిలకలూరి పేట(మహిళా మంత్రి ప్రాతినిథ్యం), ప్రత్తిపాడు, రాజమండ్రి సిటీ(ఇక్కడ టీడీపీ విజయం సాధించింది), తుని, టెక్కలి(ఇక్కడ టీడీపీ విజయం దక్కించుకుంది), రాజంపేట వంటి అత్యంత కీలకమైన నియోజకవర్గాలు ఉన్నాయి.
ఆయా నియోజకవర్గాల్లో ప్రస్తుతం ఉన్నవారికి లేదా.. టికెట్‌లు ఆశిస్తున్నవారికి ఉన్న వ్యతిరేకతపై నివేదికలతో కూడిన వినతులు వచ్చాయనేది తాడేపల్లి వర్గాల మాట. ఒకవైపు.. వచ్చే ఎన్నికలను సీరియస్‌గా తీసుకున్న పార్టీ అధిష్టానానికి క్షేత్రస్థాయిలో అంతా పరిస్థితి బాగుందని అనుకున్నా.. ఇప్పుడు వెల్లువెత్తుతున్న సొంత నేతల విమర్శలు.. క్షేత్రస్థాయిలో వస్తున్న ఆరోపణలు వంటివి మింగుడుపడడం లేదు. అలాగని ఇప్పుడున్న వారిని మార్చే పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉందని తెలుస్తోంది. మరి ఏం చేస్తారో చూడాలి.