Begin typing your search above and press return to search.

వాలంటీర్ల పై లోక్ సత్తా అభిప్రాయం ఇది!

తాజాగా ఏపీ విషయాలపై స్పందించిన జేపీ... ఏపీలో ఏ రంగాల్లో ప్రభుత్వాన్ని పెంచాల్సి అవసరం ఉందో అక్కడ ఎక్కువ శ్రద్ధ తీసుకోలేదని అన్నారు

By:  Tupaki Desk   |   20 July 2023 7:55 AM GMT
వాలంటీర్ల పై లోక్ సత్తా అభిప్రాయం ఇది!
X

గతవారం నుంచీ ఏపీలో వాలంటీర్ల వ్యవస్థపై తీవ్ర చర్చ నడుస్తున్న సంగతి తెలిసిందే. మెజారిటీ ప్రజలు ఈ వ్యవస్థ కావాలని కోరుకుంటుంటే.. విపక్షాలు మాత్రం వద్దని కొంతమంది, ఉండాలి కానీ మార్పులు అవసారం అని మరికొంతమంది వ్యాఖ్యానిస్తున్నారని కథనాలొస్తున్నాయి. ఈ సమయంలో వాలంటీర్ వ్యవస్థపై జేపీ స్పందించారు.

గతవారంలో వారాహి యాత్ర రెండో దశలో భాగంగా ఏలూరు లో పవన్ కల్యాణ్... వాలంటీర్లపై కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఏపీలో మహిళల అక్రమ రవాణాకు వాలంటీర్లు సహకరిస్తున్నారని, అసాంఘిక శక్తులకు ఒంటరి మహిళల వివరాలు ఇస్తున్నారని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. పవన్ కల్యాణ్ వివాదాస్పద వ్యాఖ్యల అనంతరం వారు రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. పవన్ పై పలు పోలీస్ స్టేషన్ లలో కేసులు పెట్టారు.

అయితే తాజాగా ఈ విషయాలపై లోక్ సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ స్పందించారు. వాలంటీర్ వ్యవస్థపై కీలక వ్యాఖ్యలు చేశారు. అవును... తాజాగా ఏపీ విషయాలపై స్పందించిన జేపీ... ఏపీలో ఏ రంగాల్లో ప్రభుత్వాన్ని పెంచాల్సి అవసరం ఉందో అక్కడ ఎక్కువ శ్రద్ధ తీసుకోలేదని అన్నారు. అయితే గతంలో కూడా ఏ ప్రభుత్వమైనా ఇలానే వ్యవహరించిందని స్పష్టం చేశారు.

ఏపీలో ప్రతీ ఏడాది 25లక్షల మంది అనారోగ్య కారణాలతో పేదలవుతున్నారని జేపీ వ్యాఖ్యానించడం గమనార్హం. ఈ రంగంపై ప్రభుత్వం ఎక్కువ శ్రద్ధపెట్టకుండా... సంక్షేమంపైనే ప్రధానంగా శ్రద్ధ పెట్టడం, వాటిని ప్రజలకు అందించడం కోసం వాలటీర్లను పెట్టడం వల్ల ప్రభుత్వంలో సమతుల్యత దెబ్బతిన్నదని చెప్పుకొచ్చారు.

ఇదే సమయంలో ప్రజలను మరింతగా పరాధీనులను చేస్తున్నామని.. ప్రజల ఆత్మాభిమానం పెంచి వాళ్ల కాళ్లమీద వాళ్లు నిలబడేలా చేయాలని అన్నారు. ఇదే సమయంలో రేషన్ ఇంటికి పట్టుకొచ్చి ఇవ్వడాన్ని తప్పుపట్టిన జేపీ... అది విజ్ఞత గల పని కాదని అభిప్రాయపడ్డారు. దానికోసం ఈ యంత్రాంగాన్ని పెట్టాల్సిన పనిలేదని స్పష్టం చేశారు.

ముఖ్యంగా ప్రజల హక్కులు కాపాడటానికి ఎక్కడ యంత్రాంగం అవసరమో అక్కడ సరైన యంత్రాంగం లేని దేశంలో... ఇలాంటి విషయాలపై దృష్టి పెట్టడం అంటే... అది కేవలం రాజకీయాలు - ఓట్లు అంశంపైనే దృష్టిలా కనిపిస్తుందని జేపీ వ్యాఖ్యానించారు.

ఇదే సమయంలో ప్రభుత్వం డబ్బుతో పార్టీ పనులు చేయించుకునే భాగంలోనే వాలంటీర్ల వ్యవస్థ ఏర్పాటయ్యిందనే విమర్శ కూడా ఉందని జేపీ వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో మౌళిక సదుపాయాలు బాగుచేయకుండా.. చెయ్యాల్సిన పనులు చేయకుండా.. విద్యా, ఆరోగ్య రంగాలను భాగుచేయకుండా... కేవలం ఓట్ల వేటలో సంక్షేమానికే పెద్ద పీట వేసే యంత్రాంగాన్ని పెంచితే అనుకున్నమంచి జరగదని అన్నారు.

దీంతో... వాలంటీర్ల వ్యవస్థపై జేపీకి కూడా అయిష్టత ఉందని... కాకపోతే పవన్ ఒకలా చెప్పారు, చంద్రబాబు మరోలా అన్నారు, జేపీ ఇలా వివరించారని అంటున్నారు పరిశీలకులు!

కాగా.. గతంలో కూడా వాలంటీర్ల వ్యవస్థపై జేపీ కీలక వ్యాఖ్యలే చేశారు. ఓ పార్టీకి అనుకూలంగా పనిచేసే వాలంటీర్లు ఎన్నికల విధుల్లో పాలుపంచుకోవడం సరికాదన్నారు. అతి తక్కువ జీతాలతో ఒక పార్టీ తాత్కాలికంగా నియమించి, వాళ్లను ఎన్నికల ప్రక్రియలో ఉపయోగించుకున్నట్లయితే అది పక్షపాతాలకు దారితీస్తుందన్నారు.