పెళ్లాలూ పార్టీలూ... పవన్ మీద వైసీపీ మంత్రి హాట్ హాట్ గానే...?
పవన్ కళ్యాణ్ ఏది వద్దు అని అంటారో అదే వైసీపీ టచ్ చేస్తోంది
By: Tupaki Desk | 24 July 2023 10:00 AM GMTపవన్ కళ్యాణ్ ఏది వద్దు అని అంటారో అదే వైసీపీ టచ్ చేస్తోంది. పవన్ సున్నితమైన అంశంగా భావించే ఆయన వైవాహిక జీవితంలోకి తొంగి చూస్తోంది. ఆయన మూడు పెళ్ళిళ్ళను అదే పనిగా విమర్శలు చేస్తూ ఆయన ఇమేజ్ ని డ్యామేజ్ చేసే ప్రయత్నం చేస్తోంది. అమరావతి పేదలకు యాభై వేల ఇళ్ళ పట్టాలను ఇచ్చే కార్యక్రమంలో భాగంగా వెంకటాయపాలెంలో జరిగిన సభలో గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ అయితే పవన్ మీద తీవ్ర వ్యాఖ్యలే చేశారు.
ఒక దశలో పవన్ని ఏకవచనంతో సంభోదిస్తూ ఘాటైన కామెంట్స్ చేశారు. ఈ పవన్ కళ్యాణ్ పెళ్లాలను మార్చినట్లుగా రాజకీయాల్లోనూ పార్టీలను మారుస్తున్నారు అంటూ జోగి రమేష్ చేసిన కామెంట్స్ జనసేనకు మంట పుట్టించేవే అంటున్నారు. పవన్ కళ్యాణ్ బీఎస్పీ, బీజేపీ, టీడీపీ, సీపీఐ, సీపీఎం ఇలా అనేక పార్టీలను మార్చారని ఆయన విమర్శల జల్లు కురిపించారు.
ఏ పార్టీని కలపాలి, ఏ పార్టీతో బంధం వేయాలి అన్నది పవన్ కి వెన్నతో పెట్టిన విద్య అని అంటున్నారు పవన్ ఇలాంటి పనులు చేయడానికి ఒక సంస్థను పెట్టుకుంటే బాగుంటుందని సలహా ఇచ్చారు. పవన్ కళ్యాణ్ మీద జోగి రమేష్ చేస్తున్న నేపధ్యంలో ముఖ్యమంత్రి జగన్ సైతం ఒక దశలో చేతులు చూపించి వారించే ప్రయత్నం చేశారు.
అయినా సరే తన మాటల ధాటిని ఎక్కడా ఆపకుండా పవన్ మీద జోగి రమేష్ ఒక రేంజిలో ఫైర్ అయ్యారు. ఏమయ్యా పవన్ కళ్యాణ్ అంటూ మంత్రి మాట్లాడిన మాటలు ఇపుడు రాజకీయంగా హీటెక్కిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ తన భార్యల విషయంలో మాట్లాడవద్దు అని అనేక సందర్భాలలో చెప్పారు. ఇటీవల వారాహి యాత్రలో కూడా ఆయన అదే చెబుతూ ఆవేశంతో ఊగిపోయారు మీ సీక్రెట్స్ కూడా బట్టబయలు చేస్తాను అని అన్నారు.
పైగా పెళ్లాలు అనడమేంటి అని కూడా పవన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పెళ్లాం అన్నది నిజానికి అసభ్యమైన పదం కాదు, అది వాడుక భాషలో అనేదే. కానీ ఎందుకో ఆ మాటకు కూడా పవన్ ఒప్పుకోవడంలేదు. అలాంటిది పదే పదే పెళ్లాలను మారుస్తాడు అంటూ పవన్ మీద వైసీపీ చేస్తున్న విమర్శలు జనసేనలో ఆగ్రహం రగిలిస్తున్నాయి.
ఇక జోగి రమేష్ తాజాగా చేసిన వ్యాఖ్యలు అయితే హైలెట్ గానే ఉన్నాయి. ఆయన పెళ్ళాలను మార్చడం పార్టీలను మార్చడం అంటూ రాజకీయాల్లోనూ నిజ జీవితంలోనూ నిలకడలేనితనాన్ని ఎత్తి చూపే విధంగా మంత్రి కామెంట్స్ ఉన్నాయని అంటున్నారు ముఖ్యంగా మహిళా లోకం పవన్ కళ్యాణ్ తీరు మీద వ్యతిరేకంగా మారాలన్న అజెండాతో వైసీపీ ఈ కామెంట్స్ ని తరచూ చేస్తోంది అని అంటున్నారు. మరి దీని మీద జనసేన ఎలా రియాక్ట్ అవుతుందో చూడాల్సిందే.