శబరి బైరెడ్డి సమస్యలు తీరేనా? ప్రాధాన్యం దక్కేనా..?
పార్టీలో యాక్టివ్‌గా ఉంటూ
By: Tupaki Desk | 24 July 2023 6:48 AM GMTబైరెడ్డి శబరి.. ఈ పేరు రాష్ట్ర వ్యాప్తంగా పెద్దగా పరిచయం లేకపోయినా.. సీమ ప్రాంత ప్రజలకు మాత్రం పరిచయమే. ముఖ్యంగా కర్నూలు వాసులకు .. ఆమెకు చేరువ అయ్యారు. రాష్ట్ర విభజన సమయంలో ప్రత్యేక సీమ రాష్ట్రాన్ని కోరుతూ.. సీనియర్ నాయకుడు బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి ఉద్యమం చేశారు. అయితే.. ఆ సమయంలో ఉన్న కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం ఆయనపై కేసులు పెట్టి.. జైలుకు పంపించింది.
ఈ సమయంలోనే శబరి తెరమీదికి వచ్చారు. తండ్రికి అనుకూలంగా ఉద్యమాలు చేసి.. ఆయనను జైలు నుంచి బయటకు వచ్చేలా కృషి చేశారు. ఈ క్రమంలోనే తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో శబరి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. యువ నాయకురాలిగా.. మంచి గళం ఉన్న నేతగా స్థానికంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఉన్నత విద్యను అభ్యసించిన శబరి.. డాక్టర్‌గా కూడా సేవలు అందిస్తున్నారు.
అయితే, ఈమెపై గత బీజేపీ అధ్యక్షుడు వైసీపీకి అనుకూల నాయకురాలుగా ముద్ర వేసి.. ఎలాంటి గుర్తింపు లేకుండా చేశారనేది శబరి ఆవేదన. స్థానికంగా బలంగా ఉన్నానని.. బీజేపీని అన్నివిధాలా ముందుకు తీసుకువెళ్తున్నానని చెప్పే శబరి.. తాజాగా తన గళాన్ని మరింత ఎలుగెత్తి వినిపించారు. తాను ఎంతో చేస్తున్నా.. తనకు ఎలాంటి గుర్తింపు లేకుండా పోయిందని ప్రస్తుతం పార్టీ అధ్యక్షురాలు.. దగ్గుబాటి పురందేశ్వరి ముందు ఆవేదన వ్యక్తం చేశారు.
దీంతో పురందేశ్వరి ఆమెను రాష్ట్ర కమిటీలోకి తీసుకునే యోచన చేస్తున్నారని పార్టీ సీనియర్లు చెబుతు న్నారు. రాయల సీమలో కనీసం 4 - 5 స్థానాల్లో బీజేపీని గెలిపించుకునే లక్ష్యంతో ఉన్న పురందేశ్వరికి శబరి వంటి యువ నాయకులు అవసరం ఉందనే టాక్ వినిపిస్తోంది.
పార్టీలో యాక్టివ్‌గా ఉంటూ.. యువతను ముందుకు నడిపించడంలోనూ.. మహిళా సమస్యలపై పోరాటం చేయడంలోనూ ముందున్నారనే టాక్ ఉంది. ఈ క్రమంలో శబరికి గుర్తింపు ఖాయమని చెబుతున్నారు. మరి పురందేశ్వరి ఏం చేస్తారో చూడాలి.