Begin typing your search above and press return to search.

రామచంద్రాపురం పంచాయతీ తేల్చేసిన మిథున్ రెడ్డి?

అసెంబ్లీ ఎన్నికల్లో రామచంద్రపురం టికెట్ ఇచ్చే అవకాశాలున్నాయంటూ మిథున్ రెడ్డి అభిప్రాయపడ్డారు.

By:  Tupaki Desk   |   25 July 2023 1:41 PM GMT
రామచంద్రాపురం పంచాయతీ తేల్చేసిన మిథున్ రెడ్డి?
X

రామచంద్రపురం వైసీపీలో వర్గపోరు పార్టీ అధిష్టానానికి కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోన్న సంగతి తెలిసిందే. ఎన్నికలు సమీపిస్తున్న వేళ కలిసికట్టుగా ప్రతిపక్షాలపూ పోరాడాల్సిన వైసీపీ నేతలు...ఒకరిపై ఒకరు పోటాపోటీగా విమర్శలు గుప్పించుకుంటున్న వైనం వైసీపీ పెద్దలకు చికాకు తెప్పిస్తోంది.

మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ వర్సెస్ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నరీతిలో మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. ఈ క్రమంలోనే ఇద్దరికీ జగన్ క్లాస్ పీకినా...మరో ఎంపీ మిథున్ రెడ్డి మధ్యవర్తిత్వం చేసినా సమస్య సద్దుమణగలేదు.

వేణు గోపాల్ కు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో రామచంద్రపురం టికెట్ ఇచ్చే అవకాశాలున్నాయంటూ మిథున్ రెడ్డి అభిప్రాయపడ్డారు. అదే జరిగితే, స్వతంత్ర అభ్యర్థిగా అయినా పోటీ చేస్తానంటూ పిల్లి సుభాష్ ప్రకటించడం సంచలనం రేపింది.

ఈ క్రమంలోనే తాజాగా పిల్లి సుభాష్ చంద్రబోస్ టీడీపీలో చేరబోతున్నారంటూ ప్రచారం మొదలైంది. ఆ ప్రచారానికి తగ్గట్లుగానే తాజాగా నేడు పిల్లి సుభాష్‌ ఇంటికి స్థానిక టీడీపీ నేతలు వెళ్లి సమావేశం కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే, ఇది రాజకీయ భేటీ కాదని, ఇటీవల గుండెకు స్టెంట్ వేయించుకున్న సుభాష్ పెద్ద కుమారుడిని పరామర్శించేందుకు వారు వచ్చారని అంటున్నారు.

అంతకుముందు, పిల్లి సుభాష్ చంద్రబోస్ జనసేనలో చేరతారంటూ ప్రచారం జరిగింది. ఈ ఘటనలతో ఖంగుతిన్న వైసీపీ పెద్దలు సుభాష్ కు కబురు పంపారట. ఈ క్రమంలోనే కుమారుడితో కలిసి తాడేపల్లిలోని క్యాంప్‌ ఆఫీసుకు బోసు వెళ్లారు. ఎంపీ మిథున్ రెడ్డితో వేణు వివాదంపై చర్చించారు. ఈ భేటీ తర్వాత సుభాష్ కాస్త వెనక్కు తగ్గారట. రేపటి నుంచి పార్లమెంటు సమావేశాలకు వెళ్తానని చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో, 'పిల్లి' మెడలో గంట కట్టిన మిథున్ రెడ్డి? అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి.