జనసేన వైపుగా పిల్లి అడుగులు...?
దాంతో పిల్లి అడుగులు జనసేన వైపు పడుతున్నాయని అంటున్నారు. అయితే పిల్లి గెలుపు రామచంద్రాపురంలో 2009 తోనే ఆగిందని అంటున్నారు
By: Tupaki Desk | 24 July 2023 6:34 AM GMTఉమ్మడి తూపు గోదావరి జిల్లాలో పెద్ద నాయకుడు, మాజీ మంత్రి ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు అయిన పిల్లి సుభాష్ చంద్రబోస్ ఏడున్నర పదుల వయసులో జూలు విదిల్చారు. తన కుమారుడు సూర్య ప్రకాష్ రాజకీయ భవిష్యత్తు కోసం తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో మరో పోరాటానికి ఆయన సిద్ధపడుతున్నారు. నిజానికి పిల్లి సుభాష్ చంద్రబోస్ కి రామచంద్రాపురంలో పట్టు ఉందా అంటే సందేహమే అని చెబుతారు.
ఎందుకంటే ఆయన 1989లో తొలిసారి ఎమ్మెల్యేగా రామచంద్రాపురం నుంచి గెలిచారు. ఆ తరువాత మళ్లీ పదిహేనేళ్లకు అంటే 2004లో గెలిచారు. అది కూడా అప్పట్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్ గా నెగ్గారు. ఆయన వైఎస్సార్ వర్గం కాబట్టి ఆ విధంగా వైఎస్సార్ అభిమానులు అంత సాయం చేశారని అంటారు. 2009లో మూడవసారి గెలిచారు.
ఆ తరువాత 2012ఓ వైసీపీ తరఫున ఉప ఎన్నికల్లో పోటీ చేసి పిల్లి ఓటమి పాలు అయ్యారు. 2014లో మరోసారి జగన్ టికెట్ ఇస్తే కూడా భారీ తేడాతో ఓడారు. దాంతోనే 2019 నాటికి క్యాండిడేట్ ని మార్చి మంత్రి చెల్లుబోయిన వేణు గోపాలక్రిష్ణను జగన్ పోటీకి పెట్టారు. ఆయన తొలిసారి అలా రామచంద్రాపురంలో గెలిచి వైసీపీ జెండా ఎగురవేశారు. ఇక పిల్లికి జగన్ ఎమ్మెల్సీ పోస్టు ఇచ్చి తొలి విడతలో రెవిన్యూ వంటి కీలకమైన శాఖను ఇచ్చారు.
ఆ తరువాత శాసనమండలి రద్దు ప్రతిపాదనతో ఆయనను 2021లో రాజ్యసభకు పంపించారు. అలా పెద్దల సభలో పిల్లికి అరుదైన గౌరవం దక్కింది. వైసీపీలో పిల్లికి రెండు సార్లు ఎమ్మెల్యే టికెట్, ఒకసారి ఎమ్మెల్సీ, మంత్రి పదవి, ఇపుడు రాజ్యసభ ఇచ్చి గౌరవం ఇచ్చారని ఆ పార్టీ వారు చెబుతున్నారు.
ఇక గోదావరి జిల్లాలో బలమైన శెట్టి బలిజ సామాజిక వర్గానికి చెందిన పిల్లికి పెద్దాయన అని అంతా అంటారు. ఆయన శిష్యుడిగా ఉన్న వేణు ఎదిగి మంత్రి అయ్యారు. మరి ఎక్కడ చెడిందో తెలియదు కానీ పిల్లి ఆయన్ని పూర్తిగా కాదంటున్నారు.
అయితే ఇదంతా తన కొడుకుని రాజకీయంగా ముందుకు తేవడం కోసమే తప్ప మరోటి కాదని మంత్రి వర్గీయులు చెబుతున్నారు. మంత్రి వేణు కూడా ఆదివారం రామచంద్రాపురంలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో మాట్లాడుతూ పిల్లి తనకు ఎప్పటికీ రాజకీయ గురువే అని మాట్లాడారు. ఇక వేణుకు టికెట్ ఇస్తే తాను ఇండిపెండెంట్ గా పోటీ చేస్తాను అని పిల్లి మీడియాకు చెప్పారు.
తెలుగుదేశం నుంచి పోటీ చేస్తారా అని మీడియా ప్రశ్నిస్తే అప్పటి పరిస్థితులను బట్టి అని పిల్లి చెబుతూ సమాధానం దాటవేశారు. దీంతో వైసీపీలో కొత్త అనుమానాలు కలుగుతున్నాయి. అయితే పిల్లి టీడీపీకి వెళ్లరని తాజా వార్తల బట్టి తెలుస్తోంది. ఆయన జనసేన తరఫున వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారు అని అంటున్నారు.
పవన్ వారాహి యాత్ర తరువాత జనసేన గోదావరి జిల్లాలలో బలపడింది అని సంకేతాలు వస్తున్నాయి. గ్రాఫ్ కూడా పెరిగింది అని అంటున్నారు. దాంతో పిల్లి అడుగులు జనసేన వైపు పడుతున్నాయని అంటున్నారు. అయితే పిల్లి గెలుపు రామచంద్రాపురంలో 2009 తోనే ఆగిందని అంటున్నారు. అలాగే సుదీర్ఘ జీవితంలో ఆయన గెలిచింది మూడు సార్లే అని గుర్తు చేస్తున్నారు.
ఇంకో వైపు చూస్తే పిల్లి కనుక జనసేన తరఫున బరిలోకి దిగితే వైసీపీలో ఉన్న రామచంద్రాపురం కీలక నేత, ఎమ్మెల్సీ అయిన తోట త్రిమూర్తులుని వైసీపీ బరిలోకి దింపుతుందని చర్చకు వస్తోంది. ఆ విధంగా బలమైన కాపు ఓటుని తమ వైపునకు తిప్పుకుంటూ త్రిమూర్తులుతో కలసి వైసీపీ పిల్లిని కట్టడి చేసి మరోసారి విజయం అందుకుంటుందని అంటున్నారు.
ఇదిలా ఉంటే జగన్ తనకు పూర్తి న్యాయం చేశారని, తాను ఆశించిన దాని కంటే ఎక్కువగానే ఇచ్చారని ఆయన్ని అంటే పాపం అని పిల్లి చెబుతున్నారు. మరి ఈ తిరుగుబాటు ఏంటి పెద్దాయన అని వైసీపీ నేతలు అంటున్నారు. పిల్లి కుమారుడు సూర్యప్రకాశరావుకు ఎమ్మెల్సీ పోస్ట్ ఇస్తామని జగన్ హామీ ఇచ్చినా ఆయన ఇపుడు మంత్రి వేణుని అడ్డం పెట్టుకుని అధినాయకత్వం మీదనే తిరుగుబాటు జెండా ఎగరేశారని, దాంతో వైసీపీ హై కమాండ్ ఈ పరిణామాల పట్ల పూర్తిగా ఆగ్రహంగా ఉంది అని అంటున్నారు. రానున్న రోజుల్లో రామచంద్రాపురంలో పరిణామాలు హీటెక్కే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.