ఆర్.సి.పురంలో హాట్ టాపిక్... జగన్ తో పిల్లి సుభాష్ కీలక భేటీ!
వైసీపీలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని రామచంద్రపురం నియోజకవర్గం హాట్ టాపిక్ గా మారిందంటూ కథనాలొస్తున్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 18 July 2023 10:35 AM GMTఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార వైసీపీలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని రామచంద్రపురం నియోజకవర్గం హాట్ టాపిక్ గా మారిందంటూ కథనాలొస్తున్న సంగతి తెలిసిందే. దీంతో వ్యవహారం చినికి చినికి గాలివాన కాకముందే జగన్ ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారని తెలుస్తుంది.
అవును.. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ విషయంలో ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ వర్సెస్ మంత్రి వేణుగోపాల కృష్ణ లాగా పరిస్థితి ఉందని కథనాలొస్తున్నాయి. ఇందులో భాగంగా... రాబోయే ఎన్నికల్లో రామచంద్రపురం నుంచి తన కుమారుడు పోటీచేస్తారని పిల్లి సుభాష్ చంద్రబోస్ వ్యాఖ్యానించినట్లు కథనాలొచ్చినప్పటినుంచి వ్యవహారం ముదురుతుందని అంటున్నారు.
ఇదే సమయంలో మంత్రి వేణుగోపాలకృష్ణపై సీఎంకు ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ ఫిర్యాదు చేశారని అంటున్నారు. ఈ సందర్భంగా... తన అనుచరుడు శివాజీపై మంత్రి అనుచరుడి దాడి చేశారంటూ జగన్ దృష్టికి తీసుకెళ్లారని అంటున్నారు. దీంతో సుమారు అరగంట పాటు వీరిద్దరి భేటీ కొనసాగిందని తెలుస్తుంది.
కాగా... రామచంద్రపురం పట్టణ పరిధిలోని ముచ్చుమిల్లి సచివాలయం వద్ద సోమవారం నిర్వహించిన జగనన్న సురక్ష కార్యక్రమంలో మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ పాల్గొన్నారని తెలుస్తుంది. ఈ సమయంలో ఈ కార్యక్రమం జరుగుతుండగా వార్డు కౌన్సిలర్, మున్సిపల్ వైస్ ఛైర్మన్ కోలమూరి శివాజీని మంత్రి వేణు ప్రధాన అనుచరుడు జుత్తుక ఉదయ్ కాంత్ నిలదీశాడట.
ఇదే సమయంలో "నీకు వైస్ ఛైర్ పర్సన్ పదవి ఇచ్చిన మంత్రి వేణుకు వ్యతిరేకంగా వ్యవహరిస్తావా.. " అని గట్టిగా అరుస్తూ శివాజీని దూషిస్తూ కాలర్ పట్టుకుని చేయిచేసుకున్నాడని అంటున్నారు. దీంతో మనస్తాపానికి గురైన శివాజీ కాసేపటి తర్వాత చీమల మందు నీటిలో కలిపి తాగి ఆత్మహత్యకు యత్నించారని తెలుస్తుంది. ఈ పరిణామాల నేపథ్యంలో సీఎం జగన్ ను పిల్లి సుభాష్ కలిసి మంత్రి వేణుపై ఫిర్యాదు చేశారని సమాచారం.
మరోపక్క ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ వర్గీయులు ద్రాక్షారామలో సమావేశమై మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణపై అసమ్మతి గళం వినిపించారని తెలుస్తుంది. ఈ సందర్భంగా... బోస్ తనయుడు సూర్యప్రకాష్ కు కాకుండా వేణుకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తే ఆయనను ఓడించి తీరతామని హెచ్చరించారని కథనాలొస్తున్నాయి.