ఓటర్ల జాబితాపై రఘురామ ఫిర్యాదు
ఏపీలో ఓట్ల తొలగింపు, దొంగ ఓట్ల నమోదు వ్యవహారాలపై కేంద్ర ఎన్నికల సంఘానికి రఘురామ ఫిర్యాదు చేశారు.
By: Tupaki Desk | 18 July 2023 5:04 AM GMTజూలై 21 నుంచి ఆంధ్రప్రదేశ్ లో ఓటర్ల జాబితాలో సవరణలు, తొలగింపుల ప్రక్రియ మొదలుకాబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అధికార పార్టీపై ప్రతిపక్ష పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ ప్రక్రియ పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈ రోజే పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంపై నిఘా ఉంచాలని జనసేన కార్యకర్తలకు కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొండి హరిరామ జోగయ్య పిలుపునిచ్చారు. జనసేన అనుకూల ఓట్లను వాలంటీర్లు తొలగించే అవకాశం ఉందని, అలా చేసే వాలంటీర్లను అడ్డుకోవాలని ఆయన లేఖ రాశారు.
ఈ క్రమంలోనే మరో నాలుగు రోజుల్లో ఈ ప్రక్రియ మొదలు కాబోతున్న నేపథ్యంలో తాజాగా ఈ వ్యవహారంపై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు స్పందించారు. ఏపీలో ఓట్ల తొలగింపు, దొంగ ఓట్ల నమోదు వ్యవహారాలపై కేంద్ర ఎన్నికల సంఘానికి రఘురామ ఫిర్యాదు చేశారు.
కేంద్ర ఎన్నికల సంఘం డిప్యూటీ ఛైర్మన్ ధర్మేంద్ర శర్మను కలిసిన రఘురామ ఆయనకు ఈ వ్యవహారంపై ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై సానుకూలంగా స్పందించిన ధర్మేంద్ర శర్మ... ఆగస్టు తొలి వారంలో విశాఖలో పర్యటించి రాష్ట్ర ఎన్నికల అధికారులతో సమావేశం అవుతానని చెప్పారు.
దొంగ ఓట్ల నమోదు తొలగింపు పై మరింత సమాచారం ఇవ్వాలని ధర్మేంద్ర శర్మ తనను కోరినట్టు రఘురామ వెల్లడించారు. ఓట్ల నమోదు, తొలగింపు ప్రక్రియలో ఎటువంటి తప్పులు జరిగినా కఠినమైన చర్యలు తీసుకుంటామని ఎన్నికల సంఘం అధికారులు తనకు హామీ ఇచ్చారని చెప్పారు.
మరోవైపు, ఓటర్ల జాబితా వ్యవహారంలో వాలంటీర్ల పాత్ర ఉండకూడదని పలువురు ప్రతిపక్ష పార్టీల నేతలు కూడా డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అదికార పార్టీ ఈ జాబితాను ప్రభావితం చేయకుండా చూడాలని వారంతా డిమాండ్ చేస్తున్నారు.