Begin typing your search above and press return to search.

ఎంపీగా ధర్మాన తనయుడు...?

ఆయన యంగ్ లీడర్ గా ఉన్నారు

By:  Tupaki Desk   |   26 July 2023 12:30 AM GMT
ఎంపీగా ధర్మాన తనయుడు...?
X

శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో వైసీపీకి కొరుకుడు పడని ఒకే ఒక సీటు లోక్ సభ సీటు. పార్టీ పెట్టి పోటీ చేసిన రెండు ఎన్నికల్లోనూ వైసీపీకి ఈ సీటు అందని పండే అయింది. అదే విధంగా చూస్తే రెండు సార్లూ దివంగత నేత కింజరాపు ఎర్రన్నాయుడు తనయుడు రామ్మోహననాయుడే విజయపధంలో దూసుకెళ్లారు.

ఆయన యంగ్ లీడర్ గా ఉన్నారు. పైగా సామాజిక బలం ఉంది. టీడీపీ పటిష్టంగా జిల్లాలో ఉంది. ఇవన్నీ కలసి రామ్మోహన్ విజయాన్ని ఖరారు చేస్తున్నయి. 2014 ఎన్నికల్లో సీనియర్ నేత అయిన పాలవలస రాజశేఖరం కుమార్తె రెడ్డి శాంతిని తెచ్చి వైసీపీ ఎంపీగా పోటీ పెట్టారు. ఆమె బలమైన కాపు సామాజికవర్గానికి చెందిన వారు కావడంతో విజయం దక్కుతుందని వైసీపీ అంచనా వేసింది.

కానీ టీడీపీ వేవ్ పొత్తుల ఎత్తులతో మొత్తానికి మొత్తం శ్రీకాకుళం టీడీపీకి టర్న్ అయింది. అలా ఎంపీ సీటు పోయింది. 2019లో జగన్ వేవ్ పెద్ద ఎత్తున సాగింది. ఈ వేవ్ లో శ్రీకాకుళం ఎంపీ సీటు గెలుచుకోవడం ఖాయమని ఆ పార్టీ తలచింది. జిల్లాలో మరో బలమైన సామాజికవర్గంగా ఉన్న కాళింగుల నుంచి ప్రస్తుత ఎమ్మెల్సీ అయిన దువ్వాడ శ్రీనివాస్ ని తెచ్చి పోటీకి పెట్టారు. దువ్వాడ రామ్మోహన్ మెజారిటీని ఎంతో కొంత తగ్గించగలిగారు కానీ గెలుపుని మాత్రం ఆపలేకపోయారు.

ఇక ఇపుడు ముచ్చటగా మూడవసారి 2024లో జరిగే లోక్ సభ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ శ్రీకాకుళం సీటుని వైసీపీ గెలుచుకోవాలని చూస్తోంది. దాంతో ఈసారి వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి అన్న సూత్రం మేరకు వెలమ సామాజిక వర్గానికి చెందిన రామ్మోహన్ కి వెలమల ముంచే ప్రత్యర్ధిని డిసైడ్ చేయాలని అనుకుంటోందని టాక్.

అందుకోసం రెవిన్యూ మంత్రిగా ఉన్న సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు వైపే వైసీపీ అధినాయకత్వం మొగ్గు చూపుస్తోందని అంటున్నారు. అయితే ధర్మాన తనకు ఈ దఫాతో చాలు రాజకీయం అనేస్తున్నారు. తన కుమారుడు ధర్మాన రామ మనోహర్ నాయుడుకి శ్రీకాకుళం ఎమ్మెల్యే టికెట్ ని అడుగుతున్నారు.

కానీ వైసీపీ మాత్రం ఎంపీగా మంత్రిని వెళ్లమంటోందని టాక్. అంతే కాదు శ్రీకాకుళం ఎంపీ సీటులో ఎవరు అభ్యర్ధి అన్నది మీ ముగ్గురూ నిర్ణయించుకోండి అని స్పీకర్ తమ్మినేని సీతారాం తో పాటు మాజీ మంత్రి నరసన్నపేట ఎమ్మెల్యే అయిన ధర్మాన క్రిష్ణదాస్ లకు చెప్పినట్లుగా టాక్ నడుస్తోంది. దాంతో ఈ ముగ్గురూ మల్లగుల్లాలు పడుతున్నారని అంటున్నారు.

ఇక ఎంపీగా తన కుమారుడు తమ్మినేని చిరంజీవి నాగ్ కి టికెట్ ఇప్పించుకోవాలని తాను తిరిగి ఆముదాల వలస నుంచి పోటీ చేయాలని సీతారాం భావిస్తున్నారు అని అంటున్నారు. అయితే హై కమాండ్ దాన్ని ఎంతవరకూ ఆమోదిస్తుంది అన్నది తెలియడంలేదు. ఇక మంత్రి ధర్మాన అయితే తన కుమారుడి రాజకీయ భవిష్యత్తు కోసం హై కమాండ్ సూచనలు మన్నించి శ్రీకాకుళం ఎంపీ క్యాండిడేట్ గా నిలపాలని అనుకుంటున్నారు అంటున్నారు.

అదే సమయంలో తాను అసెంబ్లీకి పోటీ చేయడానికి వీలు కల్పిస్తేనే ఇది సాధ్యం అని అంటున్నారు. శ్రీకాకుళంలో మంత్రి తరఫున ఇప్పటికే చురుకుగా తిరుగుతూ రాజకీయంగా దూకుడు చేస్తున్న మనోహర నాయుడు వైసీపీ ఎంపీ అభ్యర్ధి అయితే ఢీ అంటే ఢీ గా కధ సాగుతుంది అని అంటున్నారు. ఇద్దరూ యువకులు కావడం ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడం రాజకీయంగా బలమైన కుటుంబ చరిత్ర ఉండడంతో సిక్కోలు ఎంపీ పోరు రసవత్తరంగా ఉంటుంది అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.