పాతపట్నంలో కొత్త పోరు..
ఇప్పడు శ్రీకాకుళం జిల్లాలోని కీలకమైన పాతపట్నం నియోజకవర్గంలోనూ ఇలాంటి రాజకీయాలే సాగుతున్నాయి
By: Tupaki Desk | 27 July 2023 2:30 PM GMTరాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవని అంటారు. ఏ నిముషానికి ఏమి జరుగునో.. అన్నట్టుగా ఉండే రాజ కీయాలు.. ఎప్పుడు ఎవరి ఫేట్‌ను మారుస్తాయో..ఎప్పుడు ఎవరి ప్లేట్‌ను తిరగబడేలా చేస్తాయో చెప్పడం కష్టం. ఇప్పడు శ్రీకాకుళం జిల్లాలోని కీలకమైన పాతపట్నం నియోజకవర్గంలోనూ ఇలాంటి రాజకీయాలే సాగుతున్నాయి. ''మాకు ఇక్కడ తిరుగులేదు. టీడీపీని ఎవరూ నమ్మరు. అయిపోయింది.. ఆ పార్టీ పరిస్థితి దారుణంగా ఉంది'' అని వ్యాఖ్యానించిన.. కొందరు నాయకులు.. ఇప్పుడు అదే టీడీపీ జెండా మోస్తున్నారు.
అంతేకాదు.. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి రెడ్డి శాంతిని గెలిపించేందుకు.. శాయశక్తులా కృషి చేసిన వారు కూడా ఇప్పుడు ఆమెకు దూరంగా ఉంటున్నారు. అంతేకాదు.. కొందరైతే.. రెడ్డిశాంతికి వ్యతిరేకంగా అనేక కార్యక్రమాలు కూడా చేస్తున్నారు.
బహిరంగ ఆందోళనలకు పిలుపునిస్తున్నారు. వాస్తవానికి ఎక్కడైనా.. ప్రభుత్వంపై వ్యతిరేకత ఎమ్మెల్యేలపై పడుతుంది. కానీ, ఇక్కడ అంతా రివర్స్‌లో సాగుతోంది. రాజకీయాల్లో కొత్త పోరు ప్రారంభమైంది.
ఎన్నికలకు 8 మాసాలు ఉండగానే.. సొంత పార్టీ ఎమ్మెల్యేపై వైసీపీ నాయకులు.. రివర్స్ జెండా ఎగరేస్తు న్నారు. ఆమెకు టికెట్ ఇవ్వొద్దంటూ.. సంతకాల సేకరణతోపాటు.. బహిరంగ ధర్నాలు నిరసనలకు కూడా సాహసిస్తున్నారంటే.. పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. గత ఎన్నికల్లో ఇక్కడ రెడ్డి శాంతి వైసీపీ తరఫున అతి కష్టం మీద విజయం దక్కించుకున్నారు. ఆమెకు కేవలం 1700 ఓట్లు మాత్రమే మెజారిటీ లభించింది. అలాంటి నియోజకవర్గంలో ఇప్పుడు మరింత అసమ్మతి నెలకొంది.
ఈ పరిణామాలతో టీడీపీ బలపడుతుండడం గమనార్హం. అయితే.. ఇక్కడ టీడీపీలోనూ ఒక చిత్రమైన డిమాండ్ తెరమీదికి వచ్చింది. జంపింగ్ జఫాంగ్‌గా పేరు తెచ్చుకున్న కలమట వెంకట రమణమూర్తికి టికెట్ ఇవ్వొద్దని.. పార్టీలో నేతలు డిమాండ్ చేస్తున్నారు. గత ఎన్నికల్లో కేవలం 1700 ఓట్ల తేడాతో ఓడిపోవడం వెనుక.. రమణ మూర్తిపై వ్యతిరేకతే కారణమని అంటున్నారు.
ఈ నేపథ్యంలో కొత్త అభ్యర్థికి అవకాశం ఇవ్వాలనే డిమాండ్ వస్తోంది. ఇదే జరిగితే.. గెలుపు టీడీపీ వైపు ఏకపక్షం అవుతుందని అంటున్నారు. మొత్తానికి పాతపట్నంలో తెరమీదికి.. వచ్చిన ఈ కొత్త రాజకీయంతో వైసీపీకి ఇబ్బందులు తప్పేలా లేవని అంటున్నారు. మరి వైసీపీ అధిష్టానం దీనిని సెట్ చేసి సరిచేస్తుందా అన్నది వేచి చూడాలి.