Begin typing your search above and press return to search.

'రాజ' గురువుకు కష్టాలు మొదలు!

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఆయనకు పెద్ద ఎత్తున రాజకీయ ప్రముఖులు భక్తులుగా మారిపోయారు.

By:  Tupaki Desk   |   17 Jun 2024 9:30 AM GMT
రాజ గురువుకు కష్టాలు మొదలు!
X

రాజశ్యామల యాగాలు నిర్వహించడం ద్వారా విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి పాపులర్‌ అయ్యారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఆయనకు పెద్ద ఎత్తున రాజకీయ ప్రముఖులు భక్తులుగా మారిపోయారు. వీరిలో బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రముఖులు.

ఆయా రాష్ట్రాల్లో గతంలో ఎన్నికల ముందు రాజశ్యామల యాగాలు నిర్వహించడం ద్వారా కేసీఆర్, జగన్‌ లను అధికారంలోకి తెచ్చారనే కీర్తిని స్వరూపానందేంద్ర స్వామి మూటగట్టుకున్నారు. దీంతో సహజంగానే ఆయనకు ప్రాధాన్యం పెరిగిపోయింది. తెలంగాణలో కేసీఆర్‌ ప్రభుత్వంలోనూ, ఆంధ్రాలో జగన్‌ ప్రభుత్వంలోనూ స్వరూపానందేంద్ర స్వామి మాటకు విశేష ప్రాధాన్యం ఇచ్చారు.

అంతేనా స్వరూపానందేంద్ర సిఫారసు చేసినవారికి అటు కేసీఆర్, ఇటు జగన్‌ పదవులు ఇచ్చారనే టాక్‌ కూడా నడిచింది. తమ అధినేతలే స్వయంగా స్వామి సేవలో ఉంటే ఇక తామెంత అనుకున్నారో బీఆర్‌ఎస్, వైసీపీ ముఖ్య నేతలు కూడా స్వామి అనుగ్రహం కోసం ఆయన పీఠం ముందు వాలిపోయేవారు. విశాఖ జిల్లా పెందుర్తిలో స్వరూపానంద దర్శనం కోసం రాజకీయ ప్రముఖులు క్యూ కట్టేవారు. గతంలో కేసీఆర్‌ కూడా స్వయంగా ఆంధ్రాకు వచ్చి స్వామిని దర్శించుకోవడం విశేషం.

అయితే ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్, ఆంధ్రాలో జగన్‌ ఇద్దరూ అధికారంలో లేరు. దీంతో సహజంగానే స్వరూపానందకు కూడా కష్టాలు మొదలయ్యాయని అంటున్నారు. అసలు సర్వసంగ పరిత్యాగులమని చెప్పుకునే స్వాములకు రాజకీయ నాయకులతో సంబంధాలు ఏంటని ప్రశ్నించేవారు కూడా ఉన్నారు. స్వాములు రాజకీయాల్లో వేలుపెట్టడం ఎందుకని నిలదీస్తున్నవారూ ఉన్నారు.

కాగా కేసీఆర్, జగన్‌ ప్రభుత్వాలు ఉన్నప్పుడు చక్రం తిప్పిన స్వరూపానందకు ఇప్పుడు కొత్త ప్రభుత్వం రావడంతో కష్టాలు మొదలయ్యాయని తెలుస్తోంది. ఆయనకు జగన్‌ ప్రభుత్వం కల్పించిన సెక్యూరిటీని కూటమి ప్రభుత్వం ఎత్తేసినట్టు సమాచారం. ప్రస్తుతం స్వరూపానంద పీఠం ముందు నలుగురు గన్‌ మెన్లు, ఆరుగురు సిబ్బందితో పోలీస్‌ పికెట్‌ ఉండగా.. దాన్ని లేపేశారని తెలుస్తోంది. అలాగే స్వరూపానందకు వై కేటగిరీ భద్రత ఉండగా దాన్ని కూడా తొలగించారని సమాచారం.

అలాగే స్వరూపకు జగన్‌ ప్రభుత్వం బుగ్గ కారును కూడా ప్రొటోకాల్‌ పేరుతో ఏర్పాటు చేసిందని అంటున్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆ కారును కూడా తొలగిస్తోందని తెలుస్తోంది.

వాస్తవానికి ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే స్వరూప కూడా ప్లేటు ఫిరాయించేశారు. చంద్రబాబు ప్రభుత్వాన్ని పొగిడారు. అయినప్పటికీ ఇలాంటి స్వాములకు వీలైనంత దూరం పాటించాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.