Begin typing your search above and press return to search.

తాడేపల్లి టూ విశాఖ... తోట రాజకీయం...?

ఉమ్మడి గోదావరి జిల్లాలలో సీనియర్ నేత

By:  Tupaki Desk   |   25 July 2023 9:48 AM GMT
తాడేపల్లి టూ విశాఖ... తోట రాజకీయం...?
X

ఉమ్మడి గోదావరి జిల్లాలలో సీనియర్ నేత, వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు రాజకీయంగా దిట్టగానే చూడాలి. ఆయన 1994 నుంచి రామచంద్రాపురంలో మొదలెట్టి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన్ని 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి మంత్రి చెల్లుబోయిన వేణు గోపాల క్రిష్ణ ఓడించారు. ఆ తరువాత జరిగిన పరిణామాలలో ఆయన వైసీపీలో చేరారు.

ఆయన సీనియారిటీని గౌరవించి జగన్ ఎమ్మెల్సీని చేసారు. అయితే తోట మరోమారు ఎమ్మెల్యేగా పోటీ చేయాలని చూస్తున్నారు. కానీ మంత్రి వేణుకు వైసీపీ అధినాయకత్వం టికెట్ ని ఖరారు చేసినట్లుగా వార్తలు వచ్చాయి. దాంతో రాజ్యసభ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ మంత్రి వేణు మీద తిరుగుబాటు చేశారు. ఆఖరుకు పార్టీని ఎంపీ పదవిని కూడా వదులుకుంటాను అని హెచ్చరించారు.

ఈ గొడవ ఇలా ఉండగానే అధినాయకత్వం తోట త్రిమూర్తులుని పిలిచి ఆయనతో మంతనాలు జరిపింది. ఆయన సైతం మంత్రి వేణు పోకడల మీద ఆరోపణలు చేసినట్లుగా ప్రచారం సాగింది. ఈ నేపధ్యంలో రామచంద్రాపురం పాలిటిక్స్ కి వర్గ పోరుకు చెక్ పెట్టాలని వైసీపీ హై కమాండ్ భావిస్తోంది.

వచ్చే ఎన్నికల్లో తోట త్రిమూర్తులుకు టికెట్ ఇవ్వడం ద్వారా రెండు వర్గాలను శాంతింపచేయవచ్చు అన్న రాజీ ఫార్ములా ఒకటి కూడా ఆలోచిస్తున్నారు అని అంటున్నారు. దీని మీద ఒక డెసిషన్ అయితే ఇంకా తీసుకోవడంలేదని టాక్.

ఇదిలా ఉంటే వైసీపీ పెద్దల పిలుపుతో తాడేపల్లికి వెళ్ళిన తోట మంగళవారం విశాఖలో మెరిసారు. ఆయన సింహాచలం అప్పన్నస్వామి దర్శనం చేసుకున్నారు. మరి ఆయన ఆధ్యాత్మిక పని మీదనే విశాఖ వచ్చారా లేక దాంతో పాటు రాజకీయ మంతనాలు ఏమైనా విశాఖలో చేస్తారా అన్నది కూడా ఆసక్తిని కలిగిస్తోంది.

ఇవన్నీ పక్కన పెడితే తోట త్రిమూరులు జనసేనలోకి వెళ్తారు అని కూడా ప్రచారం ఇటీవల కాలంలో జరుగుతోంది. ఆయన 2009లో ప్రజారాజ్యం నుంచి రామచంద్రాపురం నుంచి పోటీ చేసి తక్కువ ఓట్లతో ఓడారు. గోదావరి జిల్లాల్లో జనసేన గ్రాఫ్ పెరిగింది అని వార్తలు వస్తున నేపధ్యంలో తోట ఏమైనా రూటు మారుస్తారా అన్న చర్చ కూడా సాగుతోంది.

ఇక రామచంద్రాపురంలో కాపులు శెట్టి బలిజలు ప్రధాన సామాజిక వర్గంగా ఉంటూ వస్తున్నారు. అయితే ఇపుడు శెట్టి బలిజల్లో చీలిక వచ్చింది. మంత్రి వేణు, ఎంపీ పిల్లి ఇద్దరూ ఆ సామాజికవర్గానికి చెందిన వారే. ఇక పిల్లి అయితే పక్క చూపులు చూస్తున్నారు అని అంటున్నారు. దీంతో వైసీపీ రాజకీయంగా కొంత ఇబ్బంది పడుతోంది. దీంతో తోట త్రిమూర్తులు వైసీపీ నుంచి పోటీ చేస్తారా లేక ప్రచారంలో ఉన్నట్లుగా జనసేనలోకి వెళ్తారా అన్నది కూడా చర్చనీయాంశంగా ఉంది అంటున్నారు.

తోట త్రిమూర్తులుకు టీడీపీలో ఎంతో మంది స్నేహితులు ఉన్నారు. విశాఖలో కూడా ఒక మాజీ మంత్రి ఆయనకు అత్యంత సన్నిహితులు అని చెబుతారు. బహుశా ఆయన సలహాలు కూడా తీసుకుంటారా. అసలు రామచంద్రాపురంలో ఏమి జరుగుతోంది. ఎన్నికల కంటే ముందే వైసీపీ ఎందుకు ఇలా వీక్ అయ్యే పరిస్థితులు వచ్చాయి. దీని వెనక ఎవరి వ్యూహాలు ఉన్నాయి. ఏ పార్టీ రాజకీయం ఉంది అన్నది చూడాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే అని అంటున్నారు.