విశాఖ హాట్ ఫేవరేట్ సీటు మీద బీజేపీ కర్చీఫ్...?
భారతీయ జనతా పార్టీకి కాస్తా కూస్తో పట్టు ఉన్నది
By: Tupaki Desk | 24 July 2023 9:42 AM GMTభారతీయ జనతా పార్టీకి కాస్తా కూస్తో పట్టు ఉన్నది విశాఖ జిల్లాలోనే. ఇక్కడే ఆ పార్టీ తొలిసారి విశాఖ కార్పొరేషన్ గెలిచింది. ఇక్కడే ఎంపీ సీటుతో పాటు రెండు ఎమ్మెల్యే సీట్లను గెలుచుకుంది. ఇపుడు బీజేపీ తన పట్టుని మరింతగా విస్తరించాలని చూస్తోంది. విశాఖలో బ్రాహ్మణులు ఇతర అగ్ర వర్ణాలు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉత్తరాది జనాభా పెద్ద ఎత్తున ఉన్నారు.
అదే బీజేపీకి పెట్టుబడిగా మారుతోంది అని అంటున్నారు. బీజేపీ విశాఖ సౌత్, నార్త్ తో పాటు మరో సీటు మీద ఇపుడు ఫోకస్ పెట్టింది అని అంటున్నారు. ఆ సీటే అందరికీ హాట్ ఫేవరేట్ అయిన గాజువాక. 2009లో జరిగిన బైఫరికేషన్ లో గాజువాక పెందుర్తి నుంచి విడిపోయి కొత్తగా ఏర్పడింది. తొలి ఎన్నికల్లో ప్రజారాజ్యం గెలిచింది. 2014లో టీడీపీ గెలిస్తే, 2019లో వైసీపీ గెలిచింది.
ఇక 2024లో బీజేపీ ఇక్కడ నుంచి గెలవాలి అన్నది ఆ పార్టీ నేతల అభిప్రాయంగా కనిపిస్తోంది. గాజువాక స్వరూప స్వభావాలను తీసుకుంటే పారిశ్రామికవాడ అని చెప్పాలి. ఇక్కడే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు పెద్ద ఎత్తున ఉన్నాయి. అలాగే ఉత్తరాది వారు కూడా ఎక్కువగా ఉంటారు వారికి తెలిసిన జాతీయ పార్టీగా బీజేపీ మాత్రమే ఉంది.
దాంతో రెండు లక్షల ఓట్ల జనాభా కలిగిన గాజువాకలో పాగా వేయగలిగితే విశాఖ ఎంపీ సీటుని సులువుగా గెలుచుకోవచ్చు అన్న లెక్కలు ఆ పార్టీ పెద్దలకు ఉన్నాయి. బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఇటీవల గాజువాకలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ సమావేశంలో చేసిన కామెంట్స్ గాజువాక వైపు ఆ పార్టీ చూపు పడింది అనడానికి అవకాశం కల్పిస్తున్నాయి.
గాజువాకలో బీజేపీ పటిష్టంగా ఉంది అని జీవీఎల్ అంటున్నారు. ఇక్కడ పార్టీ బలంగా ఉండడం ఇతర నియోజకవర్గాలకు ఆదర్శంగా ఉందని అన్నారు. గాజువకలో క్రమ పద్ధతిలో బీజేపీ ఎదిగిందని జీవీఎల్ అంటున్నారు. దీంతో రానున్న ఎన్నికల్లో గాజువాక నుంచి బీజేపీ పొత్తులో అయినా సరే పోటీ పడడం తధ్యమని భావన ఉంది.
ఇక గాజువాలలో 2019 ఎన్నికల్లో సినీ నటుడు పవన్ కళ్యాణ్ పోటీ చేసి 56 వేల ఓట్లను సాధించారు. ఆయన ఈసారి పోటీ చేయవచ్చు అన్న ప్రచారం అయితే ఉంది. ఒకవేళ పవన్ గోదావరి జిల్లాలకు పరిమితం అయినా జనసేనకే పొత్తులో భాగంగా ఈ సీటుని పట్టుబట్టే అవకాశం ఉంది అని అంటున్నారు. జనసేన తరఫున ఇద్దరు ముగ్గురు నాయకులు పోటీలో ఉన్నారు.
అదే విధంగా తెలుగుదేశానికి కూడా ఈ సీటు కంచుకోట కిందనే లెక్క అంటున్నారు. విశాఖ జిల్లా టీడీపీ ప్రెసిడెంట్ పల్లా శ్రీనివాసరావు 2014లో గెలిచారు. 2019లో ఓడినా 54 వేల ఓట్లను సాధించారు. 2024లో తానే మళ్లీ పోటీ చేస్తాను అని ఆయన అనుచరులకు చెబుతున్నారు. మరి టీడీపీ బీజేపీ జనసేనల మధ్యన పొత్తు ఉంటే ఈ హాట్ సీటు కోసం మూడు పార్టీల మధ్యనే పేచీ వచ్చేలా ఉంది అని అంటున్నారు. ఇక పొత్తులు లేకపోతే మాత్రం మూడు పార్టీలు వేటికవే గాజువాకలో పోటీ చేసి లెక్క తేల్చుకుంటాయని అంటున్నారు. మొత్తంగా చూస్తే గాజువాకను ఏ ఒక్క పార్టీ వదులుకోవడానికి సిద్ధంగా లేదని అంటున్నారు.