ఆ నియోజకవర్గం చంద్రబాబుకు పెద్ద తలనొప్పిగా మారిందే..!
నాలుగు దశాబ్దాల రాజకీయ యోధుడు
By: Tupaki Desk | 19 July 2023 8:13 AM GMTనాలుగు దశాబ్దాల రాజకీయ యోధుడు టీడీపీ అధినేత చంద్రబాబుకు సైతం అంతుపట్టని రాజకీయం ఉంటుందా? ఆయనకు తెలియని మర్మం ఉంటుందా? అంటే.. ఉందనే అంటున్నారు పార్టీ సీనియర్ నాయకులు. చంద్రబాబుసైతం అంతు చిక్కని విధంగా క్షేత్రస్థాయిలో తమ్ముళ్లు చేస్తున్న రాజకీయం అలా ఉందని చెబుతున్నారు. దీంతో ఆయా నియోజకవర్గాల పరిస్థితిని తేల్చేందుకు చంద్రబాబు స్టీరింగ్ కమిటీలను నియమించడం గమనార్హం. విషయంలోకి వెళ్తే.. వచ్చే ఎన్నికలకు సంబంధించి చంద్రబాబు నియోజకవర్గాలపై భూతద్దం పెట్టి మరీ పరిశీలిస్తున్నారు.
గెలుపు గుర్రాలకు మాత్రమే ఆయన టికెట్లు ఇస్తున్నారు. ఇవ్వాలని నిర్ణయించుకున్నారు కూడా. ఇప్పటి వరకు సుమారు 60 నియోజకవర్గాలపై ఒక క్లారిటీకి వచ్చారు. అయితే.. తాజాగా ఉమ్మడి విశాఖ జిల్లాలోని రంపచోడవరం ఎస్టీ నియోజకవర్గంపైనా చంద్రబాబు సమీక్షించారు.
ఇక్కడ ఎవరికి టికెట్ ఇవ్వాలనే విషయాన్ని ఆయన తేల్చాలని భావించారు. 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి వచ్చి టీడీపీ తీర్థం పుచ్చుకున్న వంతల రాజేశ్వరికి చంద్రబాబు టికెట్ ఇచ్చారు. అయితే.. ఆమె ఓడిపోయారు. ఇక, 2014లో వైసీపీ తరఫున ఆమె గెలిచింది.
అంటే.. మొత్తంగా రంప చోడవరంలో టీడీపీ వరుసగా రెండు సార్లు గెలుపు గుర్రం ఎక్కలేక పోయింది. ఇలాంటి పరిస్థితిలో వచ్చే ఎన్నికల్లో అయినా.. గెలుపు గుర్రం ఎక్కాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే నియోజకవర్గంపై తాజాగా సమీక్షించారు. అయితే.. ఈ సమీక్షకు వచ్చిన నాయకులు.. వంతల రాజేశ్వరిపై పెద్ద చిట్టానే విప్పారని తెలిసింది. ఆమె అసలు నియోజకవర్గంలోనే తిరగడం లేదని, పట్టు తగ్గుతోందని నేతలు ఫిర్యాదు చేశారు.
అయితే.. రాజేశ్వరి మాత్రం తాను యాక్టివ్‌గానే ఉన్నానని చెప్పుకొచ్చారు. కొందరు కావాలనే తనపై బురద జల్లుతున్నారని.. పేర్కొంటూ.. కొన్ని వీడియోలను కూడా పార్టీ ముఖ్యులకు చూపించించారు. పార్టీ తరఫున బాదుడే బాదుడు కార్యక్రమం సహా అనేక కార్యక్రమాలు చేసినట్టు వంతల వివరించారు. ఇంకో వైపు.. ఆమెకు వ్యతిరేక వర్గం కూడా కొన్ని వీడియోలను ప్రదర్శించి మార్ఫింగ్ చేసి చూపిస్తున్నట్టు ఫిర్యాదు చేశారు.
రాజేశ్వరి పాల్గొనక పోయినా..పాల్గొన్నట్టు చూపిస్తున్నారని చెప్పుకొచ్చారు. దీంతో తలపట్టుకున్న చంద్రబాబు అసలు నియోజక వర్గంలో ఏం జరుగుతోందో తెలుసుకోవాలంటూ.. ముగ్గురు సభ్యులతో కూడిన స్టీరింగ్ కమిటీని నియమించారు. ఈ కమిటీ నివేదిక ఆధారంగానే టికెట్ ఇవ్వనున్నట్టు చంద్రబాబుప్రకటించారు. ఇదీ సంగతి!