Begin typing your search above and press return to search.

విశాఖ బీజేపీ ఎంపీ అభ్యర్ధిగా జీవీఎల్...?

By:  Tupaki Desk   |   19 July 2023 11:06 AM GMT
విశాఖ బీజేపీ ఎంపీ అభ్యర్ధిగా జీవీఎల్...?
X

భారతీయ జనతా పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు జీవీల్ నరసింహారావు ఇపుడు విశాఖ వాసిగా మారిపోయారు. ఇటీవల ఆయన పుట్టిన రోజు వేడుకలను కూడా విశాఖలో ఘనంగా చేసుకున్నారు. విశాఖలో ఆయన ఇల్లు కొనుక్కుని విశాఖ ఓటరుగా మారిపోయారు. విశాఖలోనే అన్ని పండగలను చేసుకుంటూ విశాఖ ప్రజానీకంలో తానూ ఒకరని చెప్పేసుకున్నారు.

నిజానికి ప్రకాశం జిల్లాకు చెందిన జీవీఎల్ 2024 ఎన్నికల్లో విశాఖ నుంచి లోక్ సభకు పోటీ చేయాలని చూస్తున్నారు. ఆయన రాజ్యసభ సభ్యత్వం 2024 మార్చితో ముగుస్తుంది. ఈసారి ఏపీ నుంచి ఎంపీగా పోటీ చేయమని జీవీఎల్ ని హై కమాండ్ పంపించింది. అలా రెండేళ్ల క్రితం జీవీఎల్ ఏపీలో కలియతిరిగి విశాఖను ఎంపిక చేసుకున్నారు. నాటి నుంచి విశాఖ సమస్యల మీద ఆయన పోరాడుతున్నారు.

విశాఖకు సంబంధించిన అంశాలనే పార్లమెంట్ లో ప్రస్తావిస్తున్నారు. అదే సమయంలో విశాఖాలో తరచూ ప్రెస్ మీట్లు పెడుతున్నారు. కేంద్రం అమలు చేస్తున్న కార్యక్రమాలు కూడా పరిశీలిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు వెళ్ళి అక్కడ వారితో మాట్లాడి అన్ని విషయాలు ఆరా తీస్తున్నారు. జీవీఎల్ ఢిల్లీలో ఉంటారు. లేకపోతే విశాఖలోనే ఉంటున్నారు. విశాఖ తన సొంత ప్రాంతం అని ఆయన చెప్పేసుకున్నారు.

అలాంటి జీవీఎల్ కి ఒక కీలకమైన పదవిని కేంద్రం ఇస్తూ నామినేట్ చేసింది. ఆ విధంగా ఆయన్ని విశాఖ లోకల్ ఎంపీగా గుర్తించింది. ఆయనను తూర్పు కోస్తా ఈస్ట్ కోస్ట్ రైల్వే యూజర్స్ కన్సల్టేటివ్ కమిటీ మెంబర్ గా కేంద్రం నామినేట్ చేసింది. ఈ పదవిలో జీవీఎల్ ఉత్తరాంధ్రాకు సంబంధించి రైల్వే సమస్యల మీద వినియోగదారుల వైపు నుంచి చూసి పరిష్కారం సూచించారు. నిజానికి ఈ పదవిని లోకల్ గా ఉండే ఎంపీకే ఇస్తారు. జీవీఎల్ కి ఇవ్వడం అంటే ఆయనను లోకల్ గానే బీజేపీ హై కమాండ్ చూసింది అని అంటున్నారు.

అదే టైం లో ఆయనకే వచ్చే ఎన్నికల్లో విశాఖ నుంచి బీజేపీ టికెట్ ఇస్తారని కూడా అంటున్నారు. నిజానికి విశాఖ సీటు విషయంలో ప్రస్తుత బీజేపీ ఏపీ ప్రెసిడెంట్ దగ్గుబాటి పురంధేశ్వరి కూడా పోటీ పడుతున్నారు. ఆమె 2009లో విశాఖ ఎంపీగా కాంగ్రెస్ నుంచి గెలిచారు. 2019లో బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేసి ఓడారు. ఆమె 2024లో ఇక్కడ నుంచే పోటీ అని అంటున్నట్లుగా ప్రచారం సాగుతోంది.

అలాంటి సమయంలో జీవీఎల్ కే కీలకమైన బాధ్యతలను కేంద్రం అప్పగించడం ద్వారా జీవీఎల్ కే హై కమాండ్ ఓటు అని చెప్పినట్లు అయిందని అంటున్నారు. ఇక జీవీఎల్ కి హై కమాండ్ తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని అంటున్నారు. ఆయనను విశాఖ ఎంపీగా పోటీ చేయించేందుకే రెండేళ్ళ క్రితమే విశాఖకు పంపించి ఆయన కార్యక్రమాలకు మద్దతు ఇస్తూ వస్తున్న హై కమాండ్ ఆయన్ని కాదని వేరెవరికో టికెట్ ఇచ్చే చాన్స్ లేదని అంటున్నారు.

ఇక జీవీఎల్ సొంత సామాజికవర్గం ఓటర్లు విశాఖలో రెండు లక్షల మంది దాకా ఉన్నారు. గతంలో ఆయన సామాజికవర్గం నుంచి చాలా మంది ఎంపీలుగా గెలిచారు. ఇటీవల కాలంలో ఆ సామాజికవర్గానికి టికెట్ దక్కలేదు. దాంతో జీవీఎల్ కి టికెట్ ఇవ్వడం ద్వారా వారిని ఆకట్టుకుంటే గెలుపు ఖాయమని హై కమండ్ లెక్కలు వేస్తోంది అని అంటున్నారు. మొత్తం మీద చూసుకుంటే బీజేపీ ఎంపీ అభ్యర్ధిగా జీవీఎల్ కన్ ఫర్మ్ అని అంటున్నారు.