Begin typing your search above and press return to search.

స్థానిక ఉపపోరు లో హవా చూపించిన వైసీపీ

ఏపీ వ్యాప్తంగా ఖాళీగా ఉన్న పలు పట్టణ.. స్థానిక సంస్థల కు జరిగిన ఉప ఎన్నికల్లో అధికార వైసీపీ జయకేతనాన్ని ఎగురవేసింది

By:  Tupaki Desk   |   14 July 2023 5:29 AM GMT
స్థానిక ఉపపోరు లో హవా చూపించిన వైసీపీ
X

ఏపీ వ్యాప్తంగా ఖాళీగా ఉన్న పలు పట్టణ.. స్థానిక సంస్థల కు జరిగిన ఉప ఎన్నికల్లో అధికార వైసీపీ జయకేతనాన్ని ఎగురవేసింది. విపక్షాలు దరిదాపుల్లోకి రాని ఈ ఎన్నికల ఫలితాలు.. అధికార పార్టీకి తిరుగులేని అధిక్యత ను చాటి చెప్పినట్లుగా చెప్పాలి. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఎన్నికల్లో ఒక మండలాధ్యక్ష పదవితో పాటు మూడు మండల ఉపాధ్యక్ష పదవులకు వాయిదా పడగా.. మిగిలిన చోట్ల జరిగిన ఎన్నికల్లో వైసీపీ సంపూర్ణ అధిక్యతను ప్రదర్శించింది.

మచిలీపట్నం నగర పాలక సంస్థలో జరిగిన రెండు డిప్యూటీ మేయర్ పదవుల కు ఎన్నికలు జరగ్గా..వైసీపీకి చెందిన కార్పొరేటర్లు మాడపాటి విజయలక్ష్మి.. సీలం భారతీ నాగకుసుమలు ఆ పదవుల్ని సొంతం చేసుకున్నారు. పెడన మున్సిపాలిటీ ఛైర్ పర్సన్ గా వైసీపీకి చెందిన కటకం నాగకుమారి ని వరించింది. మాచర్ల మున్సిపాలిటీ లో వైస్ ఛైర్మన్ పదవి ని మాచర్ల ఏసోబు ఎన్నికయ్యారు.

ఉమ్మడి అనంతపురం జిల్లా లోని ధర్మవరం మున్సిపాలిటీ వైస్ ఛైర్మన్లుగా వేముల జయరామిరెడ్డి.. షేక్ షంసద్ బేగంలు విజయం సాధించారు. కాకినాడ జిల్లా లోని తొండంగి ఎన్టీఆర్ జిల్లా పరిధి లోని వత్సవాయి.. నెల్లూరు జిల్లాకు చెందిన చేజర్ల మందలాధ్యక్షులుగా వైపీపీ అభ్యర్థులే గెలిచారు. ఇక.. కర్నూలు జిల్లా పెదకడబూరు.. అన్నమయ్య జిల్లాకు చెందిన గాలివీడు.. నెల్లూరు జిల్లాకు చెందిన రావూరు.. పార్వతీపురం మన్యం జిల్లా లోని పార్వతీపురం మండల ఉపాధ్యక్షులుగా వైసీపీ అభ్యర్థులు విజయం సాధించారు.

చిత్తూరు జిల్లా చిత్తూరు.. అన్నమయ్య జిల్లాలోని రాజంపేట.. వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన బి.మఠం మండలాల్లో కో ఆప్షన్ సభ్యుల ఎన్నికల్లోనూ వైసీపీ అభ్యర్థులదే పైచేయిగా మారింది. ఇదిలా ఉండగా.. చిత్తూరు జిల్లా లోని రామకుప్పం మండలాధ్యక్ష పదవితో పాటు ఉపాధ్యక్ష పదవుల కు జరగాల్సిన ఎన్నిక వాయిదా పడింది. అదే క్రమంలో చిత్తూరు జిల్లాలోని విజయాపురం.. అనంతపురం జిల్లాలోని రాయదుర్గం మండలాల ఉపాధ్యక్ష పదవులకు జరగాల్సిన ఎన్నికలు వాయిదా పడ్డాయి.