ఈ మంత్రలకు సీటు దక్కితే అదే విజయమట..!
నియోజకవర్గాల్లో మంత్రులు నిర్వహిస్తున్న గడపగడపకు కార్యక్రమంలో ఎదురవుతున్న చిత్రమైన పరిస్థితులు
By: Tupaki Desk | 29 July 2023 2:30 AM GMTఔను.. ఇప్పుడు ఇదే టాక్ వైసీపీలో హల్చల్ చేస్తోంది. రాష్ట్రంలో 25 మంది మంత్రులు ఉన్నారు. అందరూ.. సీఎం జగన్‌కు కావాల్సిన వారే. కానీ, ప్రజలకే వారిలో చాలా మంది అవసరం లేదనే టాక్ వినిపిస్తోంది. కొన్నికొన్ని నియోజకవర్గాల్లో మంత్రులు నిర్వహిస్తున్న గడపగడపకు కార్యక్రమంలో ఎదురవుతున్న చిత్రమైన పరిస్థితులు.. ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. డిప్యూటీ సీఎంగా ఉన్న మంత్రి నారాయణ స్వామి.. ఇటీవల తననియోజకవర్గంలోపర్యటించినప్పుడు.. ప్రజలు తలుపులకు తాళాలు వేసుకున్నారు.
దీంతో ఆయన నిరాసగానే వెనుదిరిగారు. ఇక, మంత్రి గుమ్మనూరు జయరాం.. పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఆయన ఇంటిముందే.. ప్రజలు ధర్నా చేసేందుకు రెడీ కాగా.. వారిని అతి కష్టం మీద ప్రజ లు నిలువరించారు. ఆలూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న గుమ్మనూరుకు ఈ సారి ఓటమి తప్పదని సొంత పార్టీలోనే నాయకులు బహిరంగ విమర్శలు చేస్తున్నారు. ఇక, ధర్మాన ప్రసాదరావు పరిస్థితి కూడా ఇలానే ఉంది. ఆయనకు మంత్రి పదవి దక్కినా.. కేవలం మండల స్థాయిలో కూడా ఆయన పనిచేయలే క పోతున్నారనే టాక్ ఉంది.
దీనికితోడు ఆయన బెదిరింపులు కూడా ప్రజలపై యాంటి ప్రభావం చూపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఓటేయకపోతే.. అంటూ అనేక సందర్భాల్లో మంత్రి ధర్మాన ప్రసాదరావు బెదిరింపులకు దిగారు. దీంతో ఆయనపై వ్యతిరేకత పెరుగుతోందని అంతర్గత చర్చల్లో నాయకులు చెబుతున్నారు. ఇక, మరో కీలక మంత్రి, పలాస నేత, సీదిరి అప్పలరాజు గురించి మాట్లాడుతున్న నాయకులు.. రాష్ట్రంలో ఓడిపోయే తొలి సీటు ఇదేనని చెబుతుండడం కూడా విస్మయాన్ని కలిగిస్తోంది.
ఇదిలావుంటే.. ఉమ్మడి అనంతపురానికి చెందిన మహిళా మంత్రి, కళ్యాణదుర్గం నేత ఉష పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడిన చందంగా మారిపోయిందని అంటున్నారు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అంతో ఇంతో ఆదరణ ఉన్నా.. ఇప్పుడు మంత్రి అయ్యాక అసలు ఏమాత్రం ఆమెపై ప్రజలు సానుభూతి చూపించడం లేదని పార్టీలో చర్చ సాగుతోంది. ఇలా.. అనేక మంది మంత్రులు ప్రజల్లో గ్రాఫ్ పోగొట్టుకున్నారని చెబుతున్నారు. మరి వీరికి టికెట్ ఇస్తేనే పండగ అని.. వ్యంగ్యాస్త్రాలు వ్యక్తమవుతున్నాయి.