గీత దాటుతున్నా ఫర్లేదు.. వైసీపీలో ఉంటే చాలా...!
ఏపీ అధికార పార్టీ వైసీపీలో అప్రకటిత క్రమశిక్షణ అమలవుతుందనే విషయం తెలిసిందే
By: Tupaki Desk | 19 July 2023 7:20 AM GMTఏపీ అధికార పార్టీ వైసీపీలో అప్రకటిత క్రమశిక్షణ అమలవుతుందనే విషయం తెలిసిందే. ఎవరూ కూడా గీత దాటేందుకు ఎక్కడా స్వేచ్ఛ ఉండదు. అంతేకాదు.. ఎవరూ కూడా.. నోరు విప్పడానికి వీల్లేదు. అంతా జాగ్రత్తగా పకడ్బందీగా వ్యవహరించాలి. మరీ ముఖ్యంగా అధినేత సీఎం జగన్ ఒక మాట చెప్పినా.. ఒక గీత గీసినా.. దానిని దాటేందుకు ఎవరూ సాహసించే ప్రయత్నం కూడా చేయలేరు.
అయితే.. ఇది ఒకప్పటి మాట. కానీ..ఇప్పుడు పరిస్థితులు, రాజకీయాలు కూడా మారిపోయాయి. నేతలు గీత దాటుతున్నారు. అధినేత అంతరంగం తెలిసి కూడా కీలక నాయకులు హద్దులు దాటేస్తున్నారు.
అయితే.. గతంలో ఉన్న దూకుడు.. గతంలో తీసుకున్న నిర్ణయాలు.. చర్యలు వంటివి ఇప్పుడు అధిష్టానం కూడా తీసుకోవడం లేదనే టాక్ వినిపిస్తోంది. దీంతో నాయకులు ఎవరికి వారే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు.
ఒక జిల్లా రెండు జిల్లాల్లోనే కాదు.. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైసీపీలో అంతర్గత కుమ్ములాటలు.. రోడ్డున పడుతున్న నాయకులు చాలా మంది కనిపిస్తున్నారు. ఆధిపత్య పోరులో శ్రీకాకుళం జిల్లా ముందుందని పార్టీ అధిష్టానానికి కూడా తెలుసు. ఇక, ప్రకాశంలో నాయకులు పక్కదారి పట్టేస్తున్నారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోనూ ఎవరికి వారే అన్నట్టుగా నాయకులు వ్యవహరిస్తున్నారు.
మరి ఇంత జరుగుతున్నా.. పార్టీలో కుమ్ములాటలు వద్దు.. కలిసి ఉండి.. మరోసారి అధికారంలోకి వచ్చేందుకు అందరూ కృషి చేయాలని సీఎం జగన్ పదే పదే చెబుతున్నారు. అయినా.. ఇలా కుమ్ములాడుతున్న నాయకులపై మాత్రం ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదు. కనీసం పన్నెత్తి కూడా వారిని హెచ్చరించడం లేదు.
దీనికి కారణం.. వారు పార్టీలో ఉంటే చాలు. తానేమైనా అంటే.. పొరుగు పార్టీల్లోకి జంప్ చేస్తారనే ఒక ఆలోచన వైసీపీలో కనిపిస్తోందని అంటున్నారు. ఏదేమైనా.. ఇప్పుడు పరిస్థితి చక్కదిద్దకపోతే.. మరింత తీవ్రతరం అయ్యే అవకాశం ఉందని పరిశీలకులు చెబుతున్నారు.