నిన్న రామచంద్రపురం.. ఇప్పుడు సత్తెనపల్లి.. వైసీపీలో కాక రేగుతోందిగా!
ఆయన ఇంట్లో తాజాగా సత్తెనపల్లి నియోజకవర్గం వైసీపీ నేతలు భేటీ అయ్యారు.
By: Tupaki Desk | 20 July 2023 4:21 AM GMT"ఏపీ అధికార పార్టీ వైసీపీని ఓడించేందుకు ప్రతిపక్షాలు ఎందుకు తొందరపడుతున్నాయి. వారు మౌనంగా ఉండి. వారి పనివా రు చేసుకుంటే చాలు. ఎందుకంటే.. వైసీపీ నేతలను వైసీపీ నాయకులే ఓడించుకుంటారు. అలా ఉంది రాష్ట్రంలో పరిస్థితి"- ఇది ఓ వారం కిందట జాతీయ ఆంగ్ల దినపత్రికలో ఒక సీనియర్ ఢిల్లీ జర్నలిస్టు రాసిన వ్యాసంలో పెద్ద పెద్ద అక్షరాలతో రాసిన మాట.
ఇప్పుడు నిజమే అవుతోంది. రెండురోజులుగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని రామచంద్రపురం నియోజకవర్గంలో మంత్రి చెల్లుబోయిన వేణుపై.. రాజ్యసభ సభ్యుడు, సీనియర్ నాయకుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ నిప్పులు చెరిగారు.
మంత్రి వేణు వ్యతిరేక వర్గాన్ని కూడగట్టుకుని మరీ సమావేశాలు పెట్టారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ తమదేనని ప్రకటించుకున్నా రు. ఇక, మంత్రి కూడా తన అనుచర వర్గంతో పిల్లి వర్గంపై నిప్పులు చెరిగించారు.
మొత్తానికి రామచంద్రపురం నియోజకవర్గంలో అధికార పార్టీ నేతల మధ్య అగ్గి రాజుకుని..రోజురోజుకు సెగలు..పొగలు కక్కుతోంది. దీనిని చల్లార్చేందుకు వైసీపీ అధిష్టానం ప్రయత్నిస్తున్నా.. అవి ఎక్కడా చల్లారేలా కనిపించడం లేదు. సీఎం జగన్ స్వయంగా జోక్యం చేసుకున్నా.. మంత్రి అక్రమాలు.. పోలీసులతో కేసులు పెట్టించడాన్ని పిల్లి వర్గం తీవ్రంగా భావిస్తోంది.
కట్ చేస్తే.. రామచంద్రపురం నుంచి ఆ సీన్ ఇప్పుడు ఉమ్మడి గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లి నియోజకవర్గంలో కనిపించింది. తాజాగా మంత్రి అంబటి రాంబాబుకు వ్యతిరేకంగా ఇక్కడ వైసీపీ నాయకులు కూటములు కట్టారు.
వైసీపీ ముఖ్యనాయకుడు.. పొరుగు నియోజకవర్గం ఎమ్మెల్యేకు సన్నిహితంగా ఉండే.. రెడ్డి నేత చిట్టా విజయ బాస్కర్ రెడ్డి ఈ కూటమికి సారథ్యం వహిస్తున్నారు. ఆయన ఇంట్లో తాజాగా సత్తెనపల్లి నియోజకవర్గం వైసీపీ నేతలు భేటీ అయ్యారు. వీరంతా కూడా మంత్రి అంబటి వ్యతిరేకవర్గం కావడం గమనార్హం.
ఈ సమయంలో మంత్రి అంబటి వ్యవహార శైలిపై వారు చర్చించారు. ముఖ్యంగా సొంత నేతలకు ఆయన అప్పాయింట్‌మెంట్ ఇవ్వకపోవడం.. తమకు కనీసం కనిపించకపోవడం.. వంటివి చర్చించారు.
అదే సమయంలో నియోజకవర్గంలోనూ ఏ కార్యక్రమానికీ తమను ఆహ్వానించకపోవడం కూడా చర్చకు వచ్చింది. అంబటి అనుచరుల పెత్తనంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్పంచ్‌లు కూడా అంబటిని కలిసే అవకాశం ఉండటం లేదని తమ ఆవేదనను వెలుబుచ్చారు. రెండు రోజుల్లో భవిష్యత్ కార్యాచరణ ప్రకటించాలని నేతలు నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశానికి సత్తెనపల్లి నియోజకవర్గంలోని పలు గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు హాజరయ్యారు.వీరంతా కూడా గత ఎన్నికల్లో అంబటి గెలుపునకు కృషి చేసిన వారే కావడం గమనార్హం.