వైసీపీలో భోగి మంటలు.. అన్ని పార్టీలకూ గుణపాఠమే..!
By: Tupaki Desk | 25 July 2023 10:51 AM GMTఏపీ అధికార పార్టీ వైసీపీలో రగులుతున్న రాజకీయ భోగి మంటలను అన్ని వర్గాల వారు నిశితంగా గమనిస్తున్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో అయితే.. చాలా తీవ్రంగా ఈ మంటలు ఎగిసి పడుతున్నాయి. అంతర్గత కుమ్ములాటలు ఇప్పుడు రోడ్డున పడి తీవ్రస్థాయిలో సాగుతున్నాయి. వీటిని గమనిస్తున్నవారు.. వైసీపీ నేతలను ఓడించేందుకు ప్రత్యేకంగా ప్రతిపక్షాలు చేయాల్సిన పని అంటూ ఏమీలేదని కూడా వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.
తాజాగా తెరమీదికి వచ్చింది రామచంద్రపురం మాత్రమే. కానీ, వీటికి భిన్నంగా.. శ్రీకాకుళం జిల్లాలోని పలాస, ఉమ్మడి కడపలోని రాజంపేట, మైదుకూరు, ప్రొద్దుటూరు, నెల్లూరు జిల్లాలోని సిటీ, రూరల్, ఆత్మకూరు, వెంకటగిరి, ఉమ్మడి కృష్ణాలోని తిరువూరు, నందిగామ, మచిలీపట్నం, పెనమలూరు, మైలవరం.. ఇలా.. చెప్పుకొంటూ పోతే.. 50 నియోజకవర్గాల్లో నాయకులకు భారీ సెగ తగులుతోంది. ఇలా సెగ పెడుతున్నవారంతా కూడా సొంత పార్టీ నాయకులే కావడం గమనార్హం.
ఆయా నియోజకవర్గాల్లో ఇప్పటికిప్పుడు పార్టీ అధిష్టానం జోక్యం చేసుకుని సరిదిద్దే ప్రయత్నం చేస్తే.. తప్ప.. కనీసం సగం నియోజకవర్గాల్లో అయినా.. పార్టీ గెలిచే పరిస్థితి లేదని సీనియర్లు అంచనాకు వచ్చారు.
అయితే.. ఇలా సొంత వర్గంలోనే ఇంత అసమ్మతి రేగడానికి ప్రధాన కారణం.. నాయకుల మధ్య ఆధిపత్య ధోరణి.. పైగా.. ఒక నియోజకవర్గం వారిని వేరే నియోజకవర్గానికి పంపించడం(గత ఎన్నికల్లో) వంటివి ప్రధానంగా సమస్యలు అయి కూర్చున్నాయి.
ఇదే సమస్య రామచంద్రపురంలో కాకరేపుతోంది. స్థానికేతరుడు అంటూ.. ప్రస్తుతం మంత్రిగా ఉన్న చెల్లుబోయినకు యాంటీ సెగ తగులుతోంది. ఇతర నియోజకవర్గాల్లో ఆధిపత్య ధోరణి అంటూ.. నాయకులు తిరుగు బాటు బావుటా ఎగుర వేస్తున్నారు.
అయితే.. ఈ పరిణామాలు వైసీపీని కుదేలు చేస్తున్నా.. ఇవి ఇతర ప్రధాన పార్టీలకు కూడా గుణపాఠాలేనని అంటున్నారు పరిశీలకులు. వచ్చే ఎన్నికల్లో ముందు జాగ్రత్తపడేందుకు వైసీపీ ఒక ఉదాహరణగా వారు పేర్కొంటున్నారు.