మాజీ మంత్రులంతా వైసీపీ ఎంపీలేనా...?
వైసీపీలో కొత్త ఎంపికలకు తెర లేస్తోంది
By: Tupaki Desk | 26 July 2023 4:27 AM GMTవైసీపీలో కొత్త ఎంపికలకు తెర లేస్తోంది. అంతే కాదు సరికొత్త సమీకరణలకు దారులు తెరచుకుంటున్నాయి. ఇప్పటిదాకా అసెంబ్లీకి వచ్చిన వారు రేపటి రోజున పార్లమెంట్ గడప తొక్కనున్నారా అలా వారిని అధినాయకత్వం నడిపించనుందా అంటే అవును అనే ప్రచారం బట్టి తెలుస్తోంది.
వైసీపీలో ఉన్న కొందరు మాజీ మంత్రులు బలమైన మంత్రులు కీలక నేతలను ఎంపీలుగా ఈసారి ఎన్నికల్లో నిలబెట్టాలని వైసీపీ హై కమాండ్ సీరియస్ గానే ఆలోచిస్తోంది అని అంటున్నారు. ముందుగా ఉత్తరాంధ్రా నుంచి చూసుకుంటే విజయనగరం నుంచి మంత్రి బొత్స సత్యనారాయణ ఎంపీగా పోటీ చేయాలని అధినాయకత్వం సూచించనుంది అంటున్నారు.
అదే విధంగా అనకాపల్లి నుంచి కానీ విశాఖ నుంచి కానీ ఎంపీగా అవంతి శ్రీనివాసరావు పేరు వినిపిస్తోంది. ఇక గోదావరి జిల్లాల విషయానికి వస్తే కాకినాడ రూరల్ కి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే మాజీ మంత్రి కురసాల కన్నబాబుకు కాకినాడ లోక్ సభ స్థానం నుంచి ఎంపీగా పోటీ చేయమని కోరుతున్నట్లుగా చెబుతున్నారు. ఏల్లూరు నుంచి ఎంపీగా మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ళ నానికి రెడీ చేస్తున్నారు.
నెల్లూరు సిటీకి చెందిన మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ని నెల్లూరు నుంచి ఎంపీగా పోటీ చేయిస్తారు అని అంటున్నారు. వీరే కాకుండా రాయలసీమ నుంచి చూసుకుంటే హిందూపురం ఎంపీగా వైసీపీ ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ ని పోటీ చేయడానికి సిద్ధంగా ఉండమని కోరుతున్నారని తెలుస్తోంది.
ప్రస్తుతం ఎంపీలుగా ఉన్న చాలా మంది తిరిగి పోటీ చేసేందుకు విముఖంగా ఉన్నారట. వారు ఈసారి అసెంబ్లీకి రావాలని చూస్తున్నారు. అలాంటి వారిలో గెలుపు అవకాశాలు. అన్ని సమీకరణలు సరిపోతే తెచ్చి వారు కోరుకున్న సీట్లలో ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వాలని అలా వారిని అసెంబ్లీకి తేవాలని వైసీపీ ఆలోచిన్స్తోంది.
ఇప్పటికే నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకరరెడ్డిని నెల్లూరు రూరల్ టికెట్ ఇచ్చి అసెంబ్లీకి దారి చూపిస్తున్నారు. ఇదే విధంగా మరి కొందరు కూడా ఉన్నారని అంటున్నారు. హిందూపురం నుంచి ఎంపీగా ఉన్న గోరంట్ల మాధవ్ ని కర్నూల్ జిల్లాలో ఆయన సామాజికవర్గం అధికంగా ఉన్న సీటు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయిస్తారు అని తెలుస్తోంది.
విజయనగరం జిల్లా ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ ని ఎచ్చర్ల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయిస్తారు అని అంటున్నారు. అది కాకపోతే బొత్స సత్యనారాయణ సీటు అయిన చీపురుపల్లి నుంచి పోటీకి టికెట్ ఇవ్వవచ్చు అని తెలుస్తోంది. అనకాపల్లి ఎంపీగా ఉన్న భీశెట్టి సత్యవతి అనకాపల్లి ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నారు. అక్కడ మంత్రిగా ఉన్న గుడివాడ అమరనాధ్ కి గాజువాక టికెట్ ఇచ్చి షిఫ్ట్ చేస్తే ఆమెకు చాన్స్ ఉంటుంది అని అంటున్నారు.
మొత్తానికి వారిని వీరుగా వీరిని వారుగా మార్చి వచ్చే ఎన్నికల్లో ఎంపీ సీట్లను అధికంగా గెలుచుకోవడంతో పాటు మరోసారి ఏపీలో అధికారానికి రావడానికి వైసీపీ హై కమాండ్ స్కెచ్ గీస్తోంది.