Begin typing your search above and press return to search.

హాట్ టాపిక్: మూడో ప్రపంచ యుద్ధానికి రంగం సిద్ధమవుతోందా?

ఇజ్రాయెల్ - హమస్ ఘర్షణకు ఇరాన్ ఎంట్రీ ఇవ్వటంతో మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీసే పరిస్థితి దాపురించిందని చెప్పాలి.

By:  Tupaki Desk   |   5 Aug 2024 8:30 AM GMT
హాట్ టాపిక్: మూడో ప్రపంచ యుద్ధానికి రంగం సిద్ధమవుతోందా?
X

ఒకటి తర్వాత మరొకటి చొప్పున చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో మూడో ప్రపంచ యుద్ధం ముంచుకొస్తుందా? అన్నదిప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పశ్చిమాసియాలో ఒక దేశం ప్రదర్శించిన అత్యుత్సాహం చిలికి చిలికి గాలివానలా మారటం.. అగ్రరాజ్యం.. సంపన్న దేశాలు ఎవరికి వారు తమ ప్రయోజనాలు.. స్వార్థాలు.. రాజకీయాలు మాత్రమే చూసుకోవటమే తప్పించి.. పెద్దరికాన్ని ప్రదర్శించనితనం ఇప్పుడు ప్రపంచ మానవాళికి నష్టం వాలిట్లేలా చేస్తుందా? అన్నది ప్రశ్నగా మారింది. ఇది సరిపోదన్నట్లు మతం కూడా దేశాల మధ్య రంగ ప్రవేశం చేయటంతో పరిస్థితి అంతకంతకూ సీరియస్ గా మారుతోంది.

ఇజ్రాయెల్ - హమస్ ఘర్షణకు ఇరాన్ ఎంట్రీ ఇవ్వటంతో మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీసే పరిస్థితి దాపురించిందని చెప్పాలి. ఇజ్రాయెల్ కు అండగా రంగంలోకి దిగేందుకు అమెరికా ఇప్పటికే రెఢీ కాగా.. అటు ఇరాన్ కు సైనిక సాయం అందించేందుకు రష్యా సిద్ధమైపోతోంది. దీంతో.. ఎప్పుడేం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. తాజా పరిణామాలతో స్టాక్ మార్కెట్లు దారుణంగా దెబ్బ తిన్న పరిస్థితి.

ఈ మొత్తానికి ఆరంభం కొన్ని నెలల క్రితం ఇజ్రాయెల్ మీద హమస్ దాడి చేయటం.. పెద్ద ఎత్తున ఇజ్రాయెల్ పౌరుల్ని (ఆడ,మగ, పెద్దా పిల్లా అన్న తేడా లేకుండా చంపేయటంతో మొదలైన రచ్చ అంతకంతకూ ముదురుతోంది. తాజాగా హమస్ అగ్రనేత ఇస్మాయిల్ హనియాను ఇరాన్ లో ఉన్న వేళలో ఇజ్రాయెల్ సీక్రెట్ సంస్థ లేపేయటంతో పరిస్థితి మరింత అదుపుతప్పింది. తమ దేశానికి వచ్చిన అతిధిని మట్టుబెట్టిన ఇజ్రాయెల్ కు తగిన గుణపాఠం నేర్పాలని ఇరాన్ తపిస్తోంది.

ఇలాంటి పరిస్థితుల్లో ఏ నిమిషాన అయినా తమపై యుద్ధానికి ఇరాన్ దిగుతుందని ఇజ్రాయెల్ అంచనా వేస్తోంది. అలాంటి దాడిని ఎదుర్కోవటానికి ఇజ్రాయెల్ సమాయుత్తమవుతోంది. ఈ ఏడాది ఏప్రిల్ లో ఇరాన్ తమపై దాడి చేసిన సమయంలో అమెరికా.. బ్రిటన్.. ఫ్రాన్స్.. జోర్డాన్ దేశాలు ఏ రీతిలో అయితే సాయం చేశాయో.. అదే తీరులో అమెరికా.. యూకే తో కలిపి నాటో తరహాలో ఒక కూటమిగా ఏర్పడి ఇరాన్ ను ఎదుర్కోవాలని ఇజ్రాయెల్ ప్రధాని భావిస్తున్నారు. ఆయన దీన్ని అబ్రహామ్ కూటమిగా వ్యవహరిస్తుండటం గమనార్హం.

ఇదిలా ఉంటె.. గల్ఫ్ దేశాల్లో ఉన్న తమ సేనల సంఖ్యనను అమెరికా అంతకంతకూ పెంచుతోంది. మరిన్ని విమాన వాహన యుద్ధ నౌకలు.. యుద్ధ విమానాలను ఆ ప్రాంతాలకు పంపుతున్నట్లుగా పెంటగాన్ మూడు రోజుల క్రితమే ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ వాస్తవ పరిస్థితులు ఇలా ఉంటే.. మరోవైపు మూడో ప్రపంచ యుద్ధానికి సంబంధించి జ్యోతిష్యుల మాటల్ని పలువురు పరిగణలోకి తీసుకుంటున్నారు.

భారత నోస్ట్రడామస్ గా పేరున్న కుశాల్ కుమార్ అనే జ్యోతిష్యుడు సోమవారం కానీ మంగళవారం నుంచి కానీ మూడో ప్రపంచ యుద్ధం మొదలవుతుందని ప్రకటించటం ఈ ఆందోళనల్ని మరింత పెంచుతోంది. అయితే.. ఆయన మూడోప్రపంచ యుద్ధానికి సంబంధించి డేట్స్ చెప్పటం ఇదే మొదటిసారి కాదు. మొదట 2024 జూన్ 18న మొదలవుతుందని ఒకసారి.. జులై 26 లేదంటే 28 కానీ మొదలవుతుందని లెక్కలు కట్టారు.కానీ.. రెండుసార్లు ఆయన మాట ఫలించలేదు. తాజాగా సోమ.. మంగళవారాల్లో యుద్ధం మొదలవుతుందని పేర్కొన్నారు. ఆయన జోస్యం పలు అంతర్జాతీయ మ్యాగజైన్లలోనూ ప్రచురితం కావటం గమనార్హం. హర్యానాకు చెందిన ఆయన జ్యోతిష్యాలు చెప్పటంలో చాలా పాపులర్. ఆయన మాటకు అంతర్జాతీయ ప్రముఖ మీడియా సంస్థలు ప్రాధాన్యత ఇవ్వటం విశేషం. మరేం జరుగుతుందో చూడాలి.