ఎవరీ రుద్రకరం ప్రతాప్.. చెప్పింది చెప్పినట్టు!
దేశంలో ఇప్పుడు పార్లమెంటు ఎన్నికల కోలాహలం నడుస్తోంది. ఇక ఆంధ్రప్రదేశ్ లో అయితే అసెంబ్లీ ఎన్నికల హడావుడి ఉంది.
By: Tupaki Desk | 22 March 2024 7:58 AM GMTదేశంలో ఇప్పుడు పార్లమెంటు ఎన్నికల కోలాహలం నడుస్తోంది. ఇక ఆంధ్రప్రదేశ్ లో అయితే అసెంబ్లీ ఎన్నికల హడావుడి ఉంది. ఈ నేపథ్యంలో పలువురు జ్యోతిష్కులు చెబుతున్న జోష్యాలకు విపరీతమైన క్రేజు ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఇలాగే వేణు స్వామి తన జోష్యాలతో బాగా పాపులర్ అయ్యారు. సెలబ్రిటీలు, హీరోయిన్లు కూడా వేణు స్వామితో తమ బంగారు భవిష్యత్తు కోసం పూజలు చేయించుకుంటున్నారు.
ఇక్కడ వేణు స్వామిలానే ఉత్తర భారతదేశంలో రుద్రకరణ్ ప్రతాప్ కూడా చాలా పాపులర్. ఇప్పటివరకు ఆయన చెప్పినవన్నీ చెప్పినట్టు జరిగాయని అంటున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సమస్యలు ఎదుర్కొంటారని 2022 మార్చిలోనే ఆయన చెప్పారు. అంతేకాకుండా మార్చి 2024 లో అరవింద్ కేజ్రీవాల్ అనేక ఇబ్బందుల్లో చిక్కుకుంటారని అప్పట్లోనే రుద్రకరణ్ ప్రతాప్ జోష్యం చెప్పారు. ఆయన చెప్పినట్టే ఇప్పుడు ఢిల్లీ మద్యం కుంభకోణంలో కేజ్రీవాల్ ను ఈడీ అరెస్టు చేసింది.
ఈ నేపథ్యంలో రుద్రకరణ్ ప్రతాప్ అప్పట్లో చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. అలాగే పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచే పార్టీల గురించి ఆయన చెప్పినవి చెప్పినట్టు జరిగాయి. ఇవన్నీ ఒక ఎత్తయితే.. ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చే పార్టీ గురించి కూడా రుద్రకరణ్ ప్రతాప్ అంచనా వేశారు.
ఈ విషయాన్ని ఆయన గతేడాది జూన్ లోనే అంచనా వేశారు. ఆంధ్రప్రదేశ్ లో మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తుందని వెల్లడించారు. అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు విషయంలో ఆయన చెప్పింది చెప్పినట్టు జరగడంతో వచ్చే ఎన్నికల్లో జగన్ మళ్లీ అధికారంలోకి వస్తారని ఆయన చెప్పిన విషయం హాట్ టాపిక్ గా మారింది.
ఏపీ ఎన్నికల ఫలితాల పైన ఆయన చెప్పిందే నిజం అవుతుందా అని అంతా ఆరా తీస్తున్నారు. అయితే కేజ్రీవాల్ విషయంలో రుద్రకరణ్ ప్రతాప్ చెప్పింది నిజం కావడంతో వైసీపీ గెలుస్తుందో లేదో తెలియాలంటే జూన్ 4 వరకు ఆగాల్సిందే.
ఆంధ్రప్రదేశ్ లో అధికార వైసీపీ ఒంటరిగా బరిలోకి దిగుతుండగా, టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తున్నాయి. ఇంకోవైపు కాంగ్రెస్ పార్టీ, సీపీఐ, సీపీఎం కలిసి బరిలోకి దిగుతున్నాయి. ఇవి కాకుండా చిన్నాచితకా పార్టీలు కూడా బరిలో ఉన్నాయి.