Begin typing your search above and press return to search.

జగన్ దెబ్బకు జాతకాలు మానేసిన వేణు స్వామి

ఏపీ ఎన్నికల్లో వైసీపీ విజయం సాధిస్తుందని, జగన్ మరోసారి సీఎం అవుతారని ఆస్ట్రాలజర్ వేణు స్వామి బల్లగుద్ది మరీ చెప్పిన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   4 Jun 2024 11:11 AM GMT
జగన్ దెబ్బకు జాతకాలు మానేసిన వేణు స్వామి
X

ఏపీ ఎన్నికల్లో వైసీపీ విజయం సాధిస్తుందని, జగన్ మరోసారి సీఎం అవుతారని ఆస్ట్రాలజర్ వేణు స్వామి బల్లగుద్ది మరీ చెప్పిన సంగతి తెలిసిందే. జాతకాల ప్రకారం ఆయన ముఖ్యమంత్రి కావడం ఖాయమని వేణు స్వామి ప్రిడిక్ట్ చేశారు. గతంలో నాగ చైతన్య, సమంత విడిపోతారని కూడా వేణు స్వామి చెప్పిన జోస్యం నిజం కావడంతో ఆయన చెప్పినట్లు జగన్ గెలుస్తారని వైసీపీ అభిమానులు అనుకున్నారు. కానీ, ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా దక్కుతుందో లేదో అన్న రీతిలో వైసీపీ ఘోర పరాజయం దిశగా వెళుతున్న నేపథ్యంలో వేణు స్వామి సంచలన ప్రకటన చేశారు. జగన్ విషయంలో తన ప్రిడిక్షన్ తప్పు కావడం వల్ల ఈ రోజు నుంచి రాజకీయ నాయకులు, సినీ రంగానికి, క్రికెట్ కు, సెలబ్రిటీలకు చెందిన వ్యక్తుల గురించిన వ్యక్తిగతమైన జాతకాలు విశ్లేషించబోతనని ప్రకటించారు.

జగన్ గెలుస్తారనన్న తన ప్రిడిక్షన్ తప్పయిందని, చంద్రబాబు జాతకం విషయంలో తన అంచనా తప్పయిందని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని వేణు స్వామి అన్నారు. ఇకపై, పబ్లిక్ ప్లాట్ ఫారమ్ లో క్రికెటర్లు, రాజకీయ నాయకులు, సెలబ్రిటీల వ్యక్తిగత జాతకాలు విశ్లేషించబోనని అన్నారు. తన ప్రిడిక్షన్ తప్పయినందు వల్ల తనను ట్రోల్ చేసేవారిని తాను ఆపబోనని, వారి ఇష్టమని అన్నారు. అయితే, తనకు అండగా నిలిచి తన జాతకాన్ని నమ్మేవారికి ఆయన థన్యవాదాలు తెలిపారు.

ఏది ఏమైనా ఎన్నికలకు ముందు చాలా కాన్ఫిడెంట్ గా జగన్ సీఎం అవుతారని జాతకం చెప్పిన వేణు స్వామి..జగన్ సీఎం కారని తెలిసిన వెంటనే జాతకాలు చెప్పడం నుంచి తప్పుకోవడం హాట్ టాపిక్ గా మారింది. ఇక, తాజా ఫలితాల నేపథ్యంలో వేణు స్వామిపై ఓ రేంజ్ లో ట్రోలింగ్ జరుగుతోంది. గతంలో వేణు స్వామి చేసిన వ్యాఖ్యల వీడియోలను నెటజన్లు పోస్ట్ చేసి మీమ్స్ తో సెటైర్లు వేస్తున్నారు. జగన్ గెలిచే అవకాశాలున్నాయని చెప్పడం వేరని, కానీ, జగన్ గెలుపు పక్కా అంటూ ఓవర్ కాన్ఫిడెన్స్ తో వేణు స్వామి మాట్లాడిన వైనం సరి కాదని ట్రోల్ చేస్తున్నారు. జగన్ సీఎం కావడం, ఆయన జాతకం ఏమో గానీ, వైసీపీ దెబ్బకు, జగన్ దెబ్బకు వేణు స్వామి జాతకం మారిపోయిందని చురకలంటిస్తున్నారు.