Begin typing your search above and press return to search.

దేశం ఒకటే.. పెట్రోల్ ధరలే వేర్వేరు

By:  Tupaki Desk   |   4 Aug 2015 4:06 PM GMT
దేశం ఒకటే.. పెట్రోల్ ధరలే వేర్వేరు
X
ఒక దేశానికి మరో దేశానికి మధ్య ధరల తేడా మామూలే. కానీ.. ఒకే దేశంలోని వివిధ రాష్ట్ర రాజధానుల్లో లీటరు పెట్రోల్ ధరల తీరు చూస్తే విస్మయం కలగక మానదు. ఒక దేశానికి.. మరో దేశానికి మధ్య సవాలచ్చ యవ్వారాలు ఉంటాయి. అందువల్ల.. కొన్ని దేశాల్లో రేటు తక్కువ.. మరికొన్ని రాష్ట్రాల్లో రేటు ఎక్కువ అన్న బేధ భావం ఉందని సర్దుకోవచ్చు.

కానీ.. ఒకే దేశంలోని వివిద రాష్ట్రాల్లో వేర్వేరు ధరలు ఉండటం.. అది కూడా భారీ వ్యత్యాసం ఉండటం చూసినప్పుడు ముక్కున వేలేసుకునే పరిస్థితి. సింఫుల్ గా ఒక్క ఉదాహరణతో ఈ తేడా ఎంత భారీగా ఉంటుందన్న విషయాన్ని తెలుసుకోవాలంటే.. తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా భాసిల్లుతున్న హైదరాబాద్ మహా నగరంలో లీటరు పెట్రోల్ ధర రూ.69.82. మరి.. అదే విధంగా దేశానికి ఒక మూలగా ఉండే.. అండమాన్ నికోబార్ దీవుల రాజధాని నగరంగా భాసిల్లే పోర్ట్ బ్లెయిర్ నగరంలో లీటర్ పెట్రోల్ ధర ఎంతో తెలుసా.. అక్షరాల రూ.55.32 మాత్రమే. కాసేపు చిల్లరను పక్కన పెట్టేసి లెక్కేస్తే.. ఈ రెండు రాజధానుల మధ్య ఒక లీటరు పెట్రోల్ ధర వ్యత్యాసం 14 రూపాయిలు.

ఒక లీటరుకు పద్నాలుగు రూపాయిలు అంటే.. ఒక్కో సగటు మనిషి నెలసరి వాడకం.. దానిపై వసూలు చేస్తున్న మొత్తం చూస్తే ఎంత భారీగా ఉంటుందోఇట్టే అర్థం అవుతుంది.

అక్కడెక్కడో మారు మూలన ఉన్న పోర్ట్ బ్లెయిర్ లో ఇంత తక్కువగా ఉండి.. హైదరాబాద్ లో అంత ఎక్కువ ధర పలకానికి కారణం.. రాష్ట్ర ప్రభుత్వాల పుణ్యమే. కేంద్రం విధించే పన్నులు కాకుండా.. ఆయా రాష్ట్రాలు తమ అవసరాలకు తగినట్లుగా.. వివిధ రకాల పన్నుల్ని బాదేస్తుంటాయి. వాటన్నింటిని కలిపితే.. తాజాగా చెల్లిస్తున్న ధర వచ్చే పరిస్థితి.

తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రమని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తరచూ బీరాలు పలుకుతుంటారు. మరి.. ధనిక రాష్ట్రం తన ప్రజల వీపు మీద పన్నుల భారం మోపకుండా.. వీలైనంత జనరంజకంగా నిర్ణయాలు తీసుకోవాలి. కానీ.. అందుకు భిన్నంగా.. పెట్రోల్.. డీజిల్ లాంటి ఇంధనాల మీద భారీగా పన్నులు వడ్డిస్తూ.. ముక్కు పిండి ఎందుకు వసూలు చేస్తున్నట్లు? పెట్రోల్ ధరలు కానీ తగ్గితే.. ద్రవ్యోల్బణం తగ్గిపోవటంతోపాటు.. వివిధ వస్తు సేవల ధరలు తగ్గు ముఖం పడతాయి.

ప్రజల జీవితాల్ని ప్రభావితం చేసే పెట్రోల్ లాంటి కీలకమైన ఇంధనం విషయంలో ఇంత భారీగా ధరలు వ్యత్యాసం ఉండేలా ఉండటం చూస్తే.. జనాల గురించి ప్రభుత్వాలకు ఉన్నసానుకూలత ఏమిటో అర్థం అవుతుంది. హైదరాబాద్ పైన అత్యధికంగా ధర ఉన్న రాష్ట్ర రాజధానులు మూడు మాత్రమే ఉండటం గమనార్హం. చివరకు పేద రాష్ట్రంగా భావించే పాట్నాలోనూ లీటర్ పెట్రోల్ ధర రూ.68.90 మాత్రమే. ఇక.. మెట్రో నగరాలైన కోల్ కతా (రూ.69.15).. చెన్నై (రూ.64.77).. ఢిల్లీ (రూ.64.47) మాత్రమే కావటం గమనార్హం. అనునిత్యం ప్రజల వీపుల మీద బాదేస్తున్న పెట్రోల్ పన్ను బాదుడుపై ప్రభుత్వాలను ప్రజలు ప్రశ్నించాల్సిన సమయం ఆన్నమైంది.

వివిధ రాష్ట్ర రాజధానుల్లో ఆగస్టు 1 నుంచి అమల్లో ఉన్న లీటర్ పెట్రోల్ ధరల వివరాలు

లక్నో 71.68

జలంధర్ 70.61

శ్రీనగర్ 70.40

హైదరాబాద్ 69.82

ముంబయి 69.51

త్రివేండ్రం 69.45

కోల్ కతా 69.15

పాట్నా 68.90

భోపాల్ 68.24

బెంగళూరు 68.05

గ్యాంగ్ టాక్ 67.76

జమ్మూ 67.72

జైపూర్ 67.41

సిమ్లా 66.63

అంబలా 65.62

డెహ్రాడూన్ 65.38

గాంధీనగర్ 65.30

చెన్నై 64.77

ఢిల్లీ 64.47

గౌహతి 64.42

రాయ్ పూర్ 63.90

కోహిమా 63.71

భువనేశ్వర్ 63.63

రాంచీ 63.45

ఛండీగఢ్ 63.42

షిల్లాంగ్ 62.67

ఇటానగర్ 61.50

పాండిచ్చేరి 61.36

ఇంఫాల్ 61.07

అగర్తల 60.82

పన్ జిమ్ 59.12 (గోవా రాజధాని)

పోర్ట్ బ్లెయిర్ 55.32

= లీటరు పెట్రోల్ ధరలు.. రూపాయిల్లో. ఆగస్టు ఒకటి నాటి ధరలు