Begin typing your search above and press return to search.

కారు కొనాలంటే ఇప్పుడే క‌రెక్టా..?

By:  Tupaki Desk   |   26 July 2015 10:36 AM GMT
కారు కొనాలంటే ఇప్పుడే క‌రెక్టా..?
X
కార్లు కొనాల‌నుకునే వారికి ఎప్పుడు మంచిద‌ని చాలామందిలో సందేహాలు ఉంటాయి. ఇందుకోసం చాలానే లెక్క‌లు వేస్తారు. ఏడాది మొద‌ట్లో కొంటే.. మ్యానుఫ్యాక్చ‌రింగ్ డేట్ మారుతుంద‌ని ఆశిస్తారు కానీ.. చాలా కార్ల మోడ‌ళ్లు ఫిబ్ర‌వ‌రి వ‌ర‌కూ మార‌వు. ఇక‌.. మార్చి వ‌చ్చేస‌రికి బ‌డ్జెట్ హ‌డావుడి ఉండ‌నే ఉంటుంది.

ఆ త‌ర్వాత ఆఫ‌ర్లు స‌రిగా లేవ‌ని.. పండుగ‌ల సీజ‌న్ అయిన ద‌స‌రాకు బ్ర‌హ్మాండ‌మైన ఆఫ‌ర్లు ఉంటాయ‌ని చెబుతున్నారు. నిజ‌మే.. ద‌స‌రా.. దీపావ‌ళి స‌మ‌యాల్లో ఆఫ‌ర్లు భారీగానే ఇస్తారు. కానీ.. ఆ స‌మ‌యానికి ఏడాదిలో ప‌ది నెల‌ల పుణ్య కాలం గ‌డిచిపోతుంద‌న్న విష‌యాన్ని చాలామంది ప‌ట్టించుకోరు.

ఒక ఏడాది గ‌డిస్తే.. (అమ్మేట‌ప్పుడు కారు కొన్న‌ది ఏ నెల‌లో అని చూడ‌రు. సంవ‌త్స‌రం మాత్ర‌మే చూస్తార‌ని మ‌ర్చిపోకూడ‌దు) దాని మీద విలువ త‌క్కువ‌లో త‌క్కువ రూ.30వేల నుంచి రూ.60 వేల వ‌ర‌కు త‌గ్గే అవ‌కాశం ఉంటుంది. ఈ లెక్క‌న షోరూం వాళ్లు ఎంత ఆఫ‌ర్ ఇచ్చినా ఇంత భారీగా ఉండ‌ద‌ని మ‌ర‌చిపోకూడ‌దు. అందుకే.. కార్ల‌ను ఎప్పుడు కొనాలంటే అప్పుడు కొనేయ‌టం ఒక మంచి ప‌ద్ధ‌తి. అయితే.. నెల మొద‌టి వారంతో పోలిస్తే.. చివ‌రి వారంలో కొనుగోలు లాభ‌దాయకంగా ఉంటుంద‌ని నిపుణులు చెబుతుంటారు.

తాజాగా ఆగ‌స్టు 1 నుంచి హుంద్యాయ్ త‌న తాజా మోడ‌ల్ క్రెడా త‌ప్పించి.. మిగిలిన అన్నీ మోడ‌ళ్ల‌కు రూ.30వేల వ‌ర‌కు ధ‌ర‌లు పెంచుతున్న‌ట్లు ప్ర‌క‌ట‌న చేసింది. విప‌రీతమైన పోటీ ఉన్న కార్ల మార్కెట్ లో హుందాయ్ ధ‌ర పెంచేందుకు సిద్ధం అవుతుందంటే.. మిగిలిన కంపెనీలు అదే బాట ప‌ట్ట‌టం ఖాయం. అందుకే.. కారు కొనాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్న వారు.. ఈ నెలాఖ‌రు.. లేదంటే ఆగ‌స్టు మొద‌టి వారంలోపు కొనుగోలు చేయ‌టం మంచిద‌ని మార్కెట్ వ‌ర్గాలు చెబుతున్నాయి. సో.. కొత్త కారు కొనాల‌నుకునే వారు ఏడాదిలో ఎప్ప‌డైనా (న‌వంబ‌రు.. డిసెంబ‌రు.. జ‌న‌వ‌రి.. ఫిబ్ర‌వ‌రి మిన‌హాయించి) ఎప్పుడైనా కొన‌టం మంచిద‌ని మార్కెట్ వ‌ర్గాలు సూచిస్తున్నాయి.