20 సెకన్లలో బస్సు ఛార్జింగ్.. త్వరలోనే రానున్న కొత్త టెక్నాలజీ
పర్యావరణానికి మేలు చేసేలా ఈ వాహనాలు అందుబాటులోకి వస్తున్నప్పటికీ.. వీటికి ఛార్జింగ్ అన్నదే పెద్ద సమస్యగా మారింది.
By: Tupaki Desk | 8 Oct 2023 5:12 AM GMTపర్యావరణానికి మేలు చేసేలా ఈ వాహనాలు అందుబాటులోకి వస్తున్నప్పటికీ.. వీటికి ఛార్జింగ్ అన్నదే పెద్ద సమస్యగా మారింది. పెట్రోల్.. డీజిల్ మాదిరి నిమిషాల వ్యవధిలో పూర్తయ్యేందుకు భిన్నంగా.. ఎక్కువ సమయాన్ని ఛార్జింగ్ కోసం వినియోగించాల్సి రావటంతో పెద్ద తలనొప్పిగా మారుతోంది. ఈ-వెహికిల్స్ ను కొనే విషయంలో వెనుకడుగు వేసేందుకు కారణమవుతోంది. కార్లను తక్కువలో తక్కువ ఐదారు గంటల పాటు ఛార్జింగ్ చేయాల్సిన పరిస్థితి. ఇక.. బస్సుల్లాంటి భారీ వాహనాల గురించి చెప్పాల్సిన అవసరం లేదు.
ఇలాంటి వేళ.. ఛార్జింగ్ ను మెరుపు వేగంతో పూర్తి అయ్యే సాంకేతికత మీద పలు సంస్థలు పని చేస్తున్నాయి. ఈ విషయంలో స్విట్జర్లాండ్ కు చెందిన భారీ విద్యుత్ ఉపకరణాల దిగ్గజం హిటాచీ ఎనర్జీ.. మన దేశంలోని అశోక్ లేలాండ్ సంస్థలు కలిసి ఫ్లాష్ ఛార్జింగ్ వ్యవస్థను డెవలప్ చేసేందుకు పని చేస్తున్నాయి. వీరు చేస్తున్న ప్రయోగాలు తుది దశకు చేరాయి.
వీరు అనుకున్నట్లుగా కొత్త ఛార్జింగ్ విధానంలో కేవలం 20 సెకన్ల వ్యవధిలో బస్సుల్ని ఛార్జింగ్ చేసే టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా చెన్నై ఐఐటీ మద్రాస్ క్యాంప్ లో రెండు ఛార్జింగ్ స్టేషన్ లో ఆఫరేషనల్ టెస్టింగ్ చేపడుతున్నారు. ఈ టెక్నాలజీని డెవలప్ చేసే ప్రాజెక్టు తుదిదశకు చేరుకున్నట్లుగా చెబుతున్నారు. అదే పూర్తి అయితే.. ఈ వాహనాలకున్న ఛార్జింగ్ సమస్య ఇట్టే తీరిపోనుంది.
తాజా ప్రాజెక్టులో భాగంగా.. తాము అనుకున్న రీతిలో సాంకేతికతను రూపొందించిన తర్వాత.. పలు బస్టాప్ లలో ఈ ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తారు. విద్యుత్ లోడ్ తగ్గిన పక్షంలో.. ప్రయాణికులు ఎక్కే సమయంలోనే.. బస్టాప్ లలో ఏర్పాటు చేసిన ఛార్జింగ్ స్టేషన్ లో ఛార్జింగ్ చేస్తారు. దీని కారణంగా సమయం వేస్టు కాదు. తాము డెవలప్ చేస్తున్న టెక్నాలజీ తుది దశకు చేరుకుందని.. మరికొద్ది నెలల్లోనే దీన్ని కార్యరూపంలోకి తీసుకొస్తామని చెబుతున్నారు. అదే జరిగితే ఈవీ వాహనాలకు మరింత క్రేజ్ పెరగటం ఖాయమని చెప్పక తప్పదు.