మహీంద్ర థార్ ఎలక్ట్రిక్ వెర్షన్... లుక్ నుంచి అన్నీ పీక్సే!
మహీంద్రా అండ్ మహీంద్ర పాపులర్ ఎస్.యూ.వీ థార్ ఎలక్ట్రిక్ ఆఫ్ రోడర్ ఫ్యాన్స్ కు విపరీతంగా నచ్చేస్తోంది.
By: Tupaki Desk | 18 Aug 2023 10:30 AM GMTమహీంద్రా అండ్ మహీంద్ర పాపులర్ ఎస్.యూ.వీ థార్ ఎలక్ట్రిక్ ఆఫ్ రోడర్ ఫ్యాన్స్ కు విపరీతంగా నచ్చేస్తోంది. "థార్-ఇ" పేరుతో రూపొందించిన ఈ ఎలక్ట్రిక్ కారు ఫస్ట్ లుక్ ను దక్షిణాఫ్రికాలో జరిగిన ఫ్యూచర్ స్కేప్ ఈవెంట్ లో మహీంద్ర రివీల్ చేసింది. ప్రస్తుతం ఈ కారుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.
ఇతర ఆటో కంపెనీల మాదిరిగానే.. మహీంద్రా కూడా భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేయాలని చూస్తోంది. ప్రస్తుతం మహీంద్రా బ్రాండ్ నుండి విక్రయించబడుతున్న ఏకైక ఎలక్ట్రిక్ కారు ఎక్స్.యు.వి 400. ఇది ఎక్స్.యు.వి 300 కాంపాక్ట్ ఎస్.యు.వి. ఎలక్ట్రిక్ వెర్షన్.
అదేవిధంగా.. భవిష్యత్తులో ఎక్స్.యు.వి 700, ఎక్స్.యు.వి 500 వంటి ఇతర ఎక్స్.యు.వి కార్ల ఎలక్ట్రిక్ వెర్షన్ లను పరిచయం చేయాలని మహీంద్రా యోచిస్తోంది. మహీంద్రా విజన్ థార్ ఇ అనేది మహీంద్రా కంపెనీ నుంచి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎస్.యు.వి.
మహీంద్రా విజన్ థార్ ఎలక్ట్రిక్ కారును ఆవిష్కరించిన తర్వాత మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ చీఫ్ డిజైన్ ఆఫీసర్ ప్రతాప్ బోస్ మాట్లాడారు. విజన్ థార్ ఇని రూపొందించడం అనేది సాహసోపేతమైన, వినూత్నమైన భవిష్యత్తును స్వీకరించడమే అని పేర్కొన్నారు. ఈ డిజైన్ కొత్త పుంతలు తొక్కుతుందన్నారు.
అదిరిపోయే మిలిటరీ-గ్రేడ్ లుక్, ఫీచర్స్ తో సరికొత్తగా భారీ క్రేజ్ సంపాదిస్తోంది. దీని ఫీచర్స్ స్పెషాలిటీస్, లుక్ మాత్రం ప్రస్తుత థార్ కి భిన్నంగా బాక్సీ లుక్ లో చాలా స్టయిలిష్ గా ఉంది. "థార్-ఇ" ఆకట్టుకంటోంది. ఈ వెహికల్ లో 400 కిమీ కంటే ఎక్కువ పరిధిని అందించే పెద్ద బ్యాటరీ ప్యాక్ ని అమర్చనుంది.
ఇదే సమయంలో హార్డ్ కోర్ ఆఫ్-రోడర్ కి అనుకూలంగా ఆల్ వీల్ డ్రైవ్, డబుల్ మోటార్ లేఅవుట్ తో వస్తుంది. కొత్త ఎల్.ఇ.డి. లైటింగ్ ఎలిమెంట్స్, గ్రిల్ డిఫరెంట్ గా ఉన్నాయి. ఫ్రంట్ అండ్ రియర్ ప్రొఫైల్ లు గ్రే-కలర్ స్కిడ్ ప్లేట్స్ ఇచ్చింది.
ఇక ఇంటీరియర్ ఫీచర్లను పరిశీలిస్తే.. అద్భుతమైన టచ్ స్క్రీన్ తో రెండు స్క్రీన్ లను అందిస్తోంది. థార్-ఇ ఉత్పత్తిని 2026లో తీసుకురావాలని కంపెనీ భావిస్తోంది. ఇక ధర విషయానికి వస్తే 20-25 లక్షల వరకు ఉండవచ్చని అంచనా!