భారత్ లోకి ఫోర్డ్ రీ ఎంట్రీ... ఎన్ని ఉద్యోగాలు అంటే..?
అమెరికాకు చెందిన ఆటోమొబైల్ కంపెనీ ఫోర్డ్ భారత మార్కెట్ లోకి మరోసారి ఎంట్రీ ఇవ్వనుంది.
By: Tupaki Desk | 14 Sep 2024 10:30 AM GMTఅమెరికాకు చెందిన ఆటోమొబైల్ కంపెనీ ఫోర్డ్ భారత మార్కెట్ లోకి మరోసారి ఎంట్రీ ఇవ్వనుంది. 2021లో భారత్ లో కార్ల ప్రొడెక్షన్ ను నిలిపివేసిన ఫోర్డ్... కార్ల అమ్మకాల్లో పెరుగుదల లేని కారణంతో 2022లో ఎగుమతులను ఉపసంహరించుకుంది. ఈ సమయంలో ప్రపంచంలోనే మూడో అతిపెద్ద కార్ల మార్కెట్ గా ఉన్న భారత్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది!
అవును... అమెరికాకు చెందిన ఆటోమొబైల్ కంపెనీ ఫోర్డ్ దేశీయ మార్కెట్ లోకి మరోసారి ఎంట్రీ ఇవ్వనుంది. ఇందులో భాగంగా... తమిళనాడులోని చెన్నై ప్లాంట్ లో వాహన తయారీ చెపట్టనుంది. ఇక్కడ తయారైన వాహనాలను విదేశాలకు ఎగుమతి చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు తమిళనాడు ప్రభుత్వానికి ఈ సంస్థ తాజాగా వెల్లడించింది.
కంపెనీ గ్రోత్ ప్లాన్ లో భాగంగా చెన్నైలోని తయారీ కేంద్రాన్ని వినియోగించుకోవాలని ఫోర్డ్ భావిస్తోంది. అయితే... ప్రస్తుతం ఏ తరహా వాహనాల తయారీ చేయట్టనున్నారనేది మాత్రం వెళ్లడించలేదు. ఈ వ్యవహారంపై త్వరలో సంస్థ ప్రతినిధుల నుంచి క్లారిటీ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.
ఇక.. గ్లోబల్ బిజినెస్ ఆపరేషన్స్ లో భాగంగా తమిళనాడులో 12,000 మంది ఉద్యోగులు పనిచేస్తుండగా.. ఫోర్డ్ తాజా నిర్ణయంతో రాబోయే మూడేళ్లలో 2,500 నుంచి 3,000 వరకూ పెరిగే వకాశం ఉందని అంటున్నారు.
కాగా... 2021లోనే దేశీయంగా ఫోర్డ్ సంస్థ తయారీని నిలిపివేసింది. ఆ సమయంలో దిగుమతి చేసుకున్న వాహనాలను మాత్రమే విక్రయించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో గుజరాత్ లో ఉన్న సనంద్ ప్లాంట్ ను టాటా మోటార్స్ కు విక్రయించేసింది. ఇదే క్రమంలో... చెన్నైలోని ప్లాంట్ ను విక్రయించాలని భావించినా ఆ ప్రయత్నాలు ఫలించ లేదు.
ఈ నేపథ్యంలో ఇటీవల తమిళనాడు సీఎం స్టాలిన్ అమెరికాలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ఫోర్డ్ యాజమాన్యంతో ఆయన చర్చలు జరిపారు. ఈ క్రమంలోనే తాజా ప్రకటన వెలువడింది.