భారత మార్కెట్ లోకి ఎంజీ విండ్ సోర్ ఈవీ... ప్రత్యేకతలు ఇవి!
దేశీయ మార్కెట్ లో ఎంజీ ఇప్పటికే జెడ్ ఎస్ ఈవీ, కోమెట్ ఈవీలను విక్రయిస్తున్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 14 Sep 2024 9:12 AM GMTదేశీయ మార్కెట్ లో ఎంజీ ఇప్పటికే జెడ్ ఎస్ ఈవీ, కోమెట్ ఈవీలను విక్రయిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తన మూడో ఎలక్ట్రికల్ వెహికల్ విండ్ సోర్ ను విడుదల చేసింది. ఈ సందర్భంగా ఈ కారు ధర, ప్రత్యేకతలను వెల్లడించింది. ఈ కారు బుకింగ్స్ అక్టోబర్ 3న ప్రారంభించి.. 12 నుంచి డెలివరీలను అందించనుంది.
అవును... భారత మార్కెట్ లోకి ఎంజీ తన సరికొత్త ఎలక్ట్రిక్ వెహికల్ విండ్ సోర్ ను విడుదల చేసింది. ఈ సందర్భంగా కారు ఎక్స్ షోరుం ధరను రూ.9.99 లక్షల నుంచి మొదలవుతుందని తెలిపింది. విండ్ సోర్ తో పాటు బ్యాటరీ యూజ్ ఏ సర్వీస్ ప్రోగ్రాంను ప్రారంభించింది. దీని కింద కిలోమీటరుకు రూ.3.5 చెల్లించి బ్యాటరీని అద్దెకు తీసుకోవచ్చు.
ఇప్పటికే విడుదల చేసిన జెడ్ ఎస్ ఈవీ, కోమెట్ ఈవీలకు భిన్నంగా ఈ మిడ్ సైజ్ ను తయారు చేశారు. ఈ కార్లలో ప్రయాణికులకు విశాలమైన స్పేస్ తో పాటు అత్యధునిక ఫీచర్లను అందచేసినట్లు సంస్థ ప్రకటించింది. ప్రస్తుతం భారత మార్కెట్లో ఉన్న ఎలక్ట్రికల్ కార్లతో పోలిస్తే.. ఈ విండ్ సోర్ డిజైన్ విభిన్నంగా ఉంది.
ఇక ఈ వాహనం పొడవు 4,295 ఎంఎం, వెడల్పు 1,850 ఎంఎం కాగా ఎత్తు 1,652 ఎంఎంగా ఉంది. ఇక దీని వీల్ బేస్ 2,700 ఎంఎం గా ఉండటం వల్ల వెనుక సీట్లు మరింత సౌకర్యవంతంగా ఉండనున్నాయి. ఇదే సమయంలో ఈ కారు ముందు సీట్లను విమానాల్లో ఫస్ట్ క్లాస్ సెక్షన్ లో లా 135 డిగ్రీల్లో వాల్చుకొవచ్చు.
ఇదే క్రమంలో... ఈ విండ్ సోర్ ఈవీ 18 అంగుళాల అలాయ్ వీల్స్, ఎల్.ఈ.డీ. డీఆరెల్స్ , ఫ్రంట్ ఛార్జింగ్ ఇంటెల్ లైట్స్ వంటి ప్రత్యేకతలు కలిగి ఉండగా.. వెనుక వైపు ఎల్.ఈ.డీ. టెయిల్ లైట్ యూనిట్లను ఇచ్చారు. వీటితో పాటు ప్రధానంగా 8.8 అంగుళాల డ్రైవర్ డిస్ ప్లే, పనోరమిక్ సన్ రూఫ్, ఎయిర్ ప్యూరిఫికేషన్ సిస్టం లు ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి.
ఇందులోని సింగిల్ ఎలక్ట్రిక్ మోటార్ 38 కిలో వాట్స్ బ్యాటరీ ప్యాక్ ఆధారంగా పనిచేస్తుంది. 134 బీ.హెచ్.పీ ఎనర్జీని, 200 ఎన్.ఎం. పిక్ టార్క్ ను విడుదల చేస్తుంది. ఈ బ్యాటరీని ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే సుమారు 331 కిలోమీటర్లు ప్రయాణించగలదు.