Begin typing your search above and press return to search.

వందే భారత్ స్లీపర్ రైలు రెడీ... స్పెషలిటీలివే!

ప్రధాని మోడీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వందే భారత్ రైల్వే ప్రాజెక్ట్ సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   16 Sep 2023 9:50 AM GMT
వందే భారత్ స్లీపర్ రైలు రెడీ... స్పెషలిటీలివే!
X

ప్రధాని మోడీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వందే భారత్ రైల్వే ప్రాజెక్ట్ సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం దేశంలోని వివిధ ప్రాంతాల్లో వందే భారత్ రైలు నడుస్తోంది. అయితే ఇప్పటివరకూ భారతీయ రైల్వే వందే భారత్ ఎక్స్‌ ప్రెస్ చైర్ కార్ రైలును మాత్రమే నడుపుతోంది. అయితే ఇప్పుడు దాని కొత్త వెర్షన్ "స్లీపర్ వందే భారత్ ఎక్స్‌ ప్రెస్" త్వరలో నడపబోతోంది.

అవును... 2019లో మొదలైన వందే భారత్ లో ఇప్పుడు స్లీపర్ ట్రైన్లు, మెట్రో ట్రైన్లూ రాబోతున్నాయి. ప్రస్తుతం 25 వందేభారత్ రైళ్లు వివిధ రూట్లలో పరుగులు తీస్తున్నాయి. త్వరలో వీటికి మరో 9 జతకాబోతున్నాయి. ఇదే సమయంలో... వందేభారత్ స్లీపర్ రైళ్లను కూడా ప్రవేశపెట్టబోతున్నారు. దీనికి సంబంధించి ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ జనరల్ మేనేజర్ బీజీ మాల్యా ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

ఇందులో భాగంగా... వందే భారత్ స్లీపర్ కోచ్ ల తయారీ మొదలైందని తెలిపిన బీజీ మాల్యా.. వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తిగా స్లీపర్ కోచ్ లతో వందే భారత్ ప్రయాణం ప్రారంభమవుతుందని తెలిపారు. దూరప్రయాణం చేసేవారికి మరింత సౌకర్యవంతంగా ఉండేందుకే స్లీపర్ కోచ్ లను అందుబాటులోకి తెస్తున్నట్టు పేర్కొన్నారు. ఇదే క్రమంలో నాన్ ఏసీ ప్రయాణికుల కోసం అక్టోబర్ 31న నాన్ ఏసీ పుష్ పుల్ రైలును ప్రారంభించనున్నట్లు మాల్యా తెలిపారు.

అదే విధంగా... పదకొండు 3 టైర్ కోచ్‌ లు, నాలుగు 2 టైర్ కోచ్‌ లు, ఒక ఫస్ట్ టైర్ కోచ్‌ లతో కలిపి మొత్తం 16 కోచ్‌ లను స్లీపర్ రైలుకు చేర్చనున్నట్లు మాల్యా తెలిపారు. ఈ రైలు వెయ్యి లేదా అంతకంటే ఎక్కువ కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుందని.. మార్చి 31, 2024 లోపు ఈ రైలు ప్రారంభిస్తామని చెప్పారు.

ఇదే క్రమంలో త్వరలో రాబోయే 9 కొత్త ట్రైన్లకు సంబంధించి ఇప్పటి వరకు కొన్ని రూట్స్ కన్ ఫాం అయ్యయని తెలుస్తుంది. ఇందులో భాగంగా... ఇండోర్ - జైపూర్, జైపూర్ - ఉదయ్‌ పూర్, జైపూర్ - చండీగఢ్, పూరి - రౌర్కెలా, పాట్నా - హౌరా రూట్స్‌ లో త్వరలోనే వందే భారత్ రైళ్లు పరుగులు తీయబోతున్నాయి.