Begin typing your search above and press return to search.

టెస్లా కంటే ముందే వస్తున్న మస్క్ ప్రత్యర్థి

ఇలాంటివేళలో టెస్లా ప్రత్యర్థి విన్ ఫాస్ట్ అవకాశాన్ని అందిపుచ్చుకుంది. బారత్ లోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యింది

By:  Tupaki Desk   |   11 Feb 2024 2:30 PM GMT
టెస్లా కంటే ముందే వస్తున్న మస్క్ ప్రత్యర్థి
X

మొండితనంతో బంగారు అవకాశాల్నిమిస్ చేసుకుంటున్నాడు ఎలాన్ మస్క్. తన టెస్లా కంపెనీను భారత్ లోకి తీసుకొచ్చేందుకు అతగాడి ఆశపోతుతనానికి బ్రేకులు వేసింది మోడీ సర్కారు. మొండితనంతో.. తాను కోరుకున్నవి ఇవ్వాలన్నట్లుగా వ్యవహరించే మస్క్ ను లైట్ తీసుకుంది భారత సర్కార్. తాము చెప్పినట్లు వినాలే తప్పించి.. మస్క్ కండీషన్లకు తలాడించమని స్పష్టం చేయటం తెలిసిందే.

ఇలాంటివేళలో టెస్లా ప్రత్యర్థి విన్ ఫాస్ట్ అవకాశాన్ని అందిపుచ్చుకుంది. బారత్ లోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యింది. దీంతో.. టెస్లా కంటే భారత్ మార్కెట్ లోకి విన్ ఫాస్ట్ వచ్చేయనుంది. తమిళనాడులోని తూత్తుకుడిలో సుమారు రూ.16,600 కోట్ల పెట్టుబడితో (200 కోట్ల డాలర్లు) ఇంటిగ్రేటెడ్ ఎలక్ట్రిక్ వెహికిల్ యూనిట్ ను ఏర్పాటు చేయనుంది. దీనికి సంబంధించిన శంకుస్థాపనను ఈ నెల 25న చేయనుంది.

దేశ వ్యాప్తంగా నెట్ వర్కును ఏర్పాటు చేయటమే కాదు ప్రీమియం ఈవీల సెగ్మెంట్ లో టెస్లా మోడళ్ల కంటే చౌకగా వాహనాల్ని అందుబాటులోకి తీసుకురావాలన్నది ఈ కంపెనీ ఆలోచన. ఇందులో భాగంగా ఈ కంపెనీకి చెందిన కాంపాక్ట్ ఎస్ యూవీ క్రాసోవర్ వీఎఫ్ ఈ-34తో పాటు పెద్దవైన మరికొన్ని ఎస్ యూవీ మోడళ్లను భారత మార్కెట్ లోకి ప్రవేశ పెట్టాలన్న ప్లాన్ తో ఉంది.

తొలుత ఈ సంస్థకు చెందిన వీఎఫ్ ఈ -36, వీఎఫ్ 7లను మార్కెట్లోకి తీసుకు వస్తారని చెబుతున్నారు. టెస్లాతో పోలిస్తే విన్ ఫాస్ట్ చాలా చిన్న కంపెనీ. కానీ.. దీని ప్రభావం చాలా ఎక్కువ. అదెలానంటే.. అమెరికన్ మార్కెట్ లో 50 శాతానికి పైగా వాటా ఉన్న టెస్లా సైతం తన వ్యాపార ప్రత్యర్థిగా విన్ ఫాస్ట్ ను ప్రకటించింది. అదొక్కటి చాలు.. దాని సత్తా ఏమిటన్నది చెప్పటానికి.

2021లో ఈ సంస్థ ఈవీల తయారీలోకి అడుగు పెట్టింది. వియత్నాం కార్పొరేట్ దిగ్గజమైన ఈ సంస్థ 2017లో విన్ ఫాస్ట్ ఆటో కంపెనీని ప్రారంభించింది. 2021 నుంచి ఇప్పటివరకు విన్ ఫాస్ట్ ప్రపంచ వ్యాప్తంగా 42,291 ఈవీ యూనిట్లను అమ్మింది. అందులో 38,855 యూనిట్ల విక్రయాలు గత ఏడాదిలోనే జరగటం గమనార్హం. అంటే.. ఈ కంపెనీ అమ్మకాల్లో తన సత్తాను చాటుతోంది. ఇలాంటి వేళలోనే.. విన్ ఫాస్ట్ భారత్ లోకి అడుగు పెట్టనుంది. దీంతో.. ప్రీమియం సెగ్మెంట్ ను అందిపుచ్చుకునే అవకాశాన్ని సొంతం చేసుకోనుంది.