Begin typing your search above and press return to search.

ఐకానిక్ బైక్ రీఎంట్రీ... త్వరలో మార్కెట్ లోకి ఆర్.ఎక్స్100!

ఒకప్పటి యమహా ఆర్.ఎక్స్100 చాలా మందికి గుర్తుండే ఉంటుంది. అప్పట్లో యువతకు ఈ బైక్ పై ఉండే మోజు అంతా ఇంతా కాదు

By:  Tupaki Desk   |   23 Feb 2024 12:30 AM GMT
ఐకానిక్ బైక్ రీఎంట్రీ... త్వరలో మార్కెట్ లోకి ఆర్.ఎక్స్100!
X

ఒకప్పటి యమహా ఆర్.ఎక్స్100 చాలా మందికి గుర్తుండే ఉంటుంది. అప్పట్లో యువతకు ఈ బైక్ పై ఉండే మోజు అంతా ఇంతా కాదు. ఒక్కసారి ఈ బైక్ అలవాటు పడిన వారు మరో బైక్ ని రైడ్ చేయడానికి ఇష్టపడరన్నా అతిశయోక్తి కాదేమో! ఇప్పటికీ చాలా మంది ఈ బైక్ ని మెయింటైన్ చేస్తుంటారు. ఈ కొంతమంది ఎంత ప్రయత్నించినా ఈ బైక్ కొనడానికి దొరకదని వాపోతుంటారు. అలాంటి వారికి తాజాగా యమహా కంపెనీ నుంచి గుడ్ న్యూస్ రాబోతుందని అంటున్నారు.

అవును... ఒకప్పుడు ఫుల్ హల్ చల్ చేసిన యమహా ఆర్.ఎక్స్100 బైక్ కొన్ని అనివార్య కారణాలతో మార్కెట్లో అదృశ్యమైపోయిన సంగతి తెలిసిందే. అయితే ఆర్.ఎక్స్100 రీఎంట్రీ ఇస్తుందంటూ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ప్రస్తుతం వైరల్ అవుతున్న వివరాలు కొత్త జనరేషన్ రైడర్‌ లకు అనుకూలంగా రూపొందించబడినట్లు అనిపిస్తున్నాయి. ఇందులో భాగంగా... 225.9సీసి ఇంజిన్ కలిగి ఉండొచ్చని తెలుస్తుంది.

ఇదే సమయంలో... 20.1 బీహెచ్పీ, 19.93 ఎన్ఎమ్ మ్యాగ్జిమమ్ టార్క్ విడుదల చేస్తుందని తెలుస్తుంది. ఇదే క్రమంలో... బీఎస్ 6 ఫేజ్ 2 హార్ష్ ఎమీషన్స్ కు తగ్గట్లుగానే ఈ న్యూ వెర్షన్ డిజైన్ చేసినట్టు నివేదికలు చెబుతున్నాయి. ఇక ఈ కొత్త యమహా బైక్ ధర విషయానికొస్తే... రూ.1.25 లక్షల నుంచి రూ.1.50 లక్షల మధ్య ఉండే అవకాశం ఉందని అంటున్నారు.

కాగా... యమహా ఆర్‌.ఎక్స్‌ బైకులను ఆపేసి సుమారు 25 సంవత్సరాలు దాటిన సంగతి తెలిసిందే! అయినప్పటికీ ఈ బైక్ లు అప్పుడప్పుడూ రోడ్డుపై కనిపిస్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే యమహా ఆర్.ఎక్స్100 రీలాంచ్ కావాలని చాలా మంది కోరుకుంటున్నారు. ఈ బైక్ 1985 నుంచి 1996 వరకు మార్కెట్ లో కొనసాగింది.

ప్రస్తుతం ఈ విషయంపై కంపెనీ నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటన లేదు. ఇదే సమయంలో ఇలాంటి నివేదికలు రావడం ఇదే మొదటిసారీ కాదు. 2022లోనూ యమహా ఆర్ఎక్స్100 మళ్లీ రాబోతుందని వార్తలొచ్చాయి. అయితే అప్పట్లో యమహా ఇండియా ప్రెసిడెంట్ ఇషిన్ చిహానా ఆ కథనాలపై స్పందిస్తూ... ఆర్.ఎక్స్100 మళ్లీ రానుందని అన్నారు. దీంతో ఈసారి వచ్చే నివేదికలు నిజమే అయ్యుండచ్చని అంటున్నారు ఈ బైక్ లవర్స్!