Begin typing your search above and press return to search.

చైనా జురాసిక్ పార్క్ అయిపోతుందా..?

By:  Tupaki Desk   |   7 Aug 2015 12:46 PM GMT
చైనా జురాసిక్ పార్క్ అయిపోతుందా..?
X
చైనాలో ఒక ఇంట్లో పెద్ద సంఖ్యలో్ డైనోసార్ల గుడ్లు దొరికాయి. గువాంగ్ డోంగ్ ప్రావెన్స్ ప్రాంతంలోని ఒక ఇంటిలో డైనోసార్ గుడ్లు ఉన్నాయని అధికారులకు సమాచారం అందింది. దీంతో వారం కిందట అధికారులు ఆ ఇంటిపై దాడి చేశారు. వారికి అక్కడ ఏకంగా 231 గుడ్లు, ఒక డైనోసార్ అస్థిపంజరం కూడా దొరికింది. వాటన్నిటినీ అధికారులు స్వాదీనం చేసుకున్నారు.

గువాంగ్ డోంగ్ రాజధాని హెయువాన్ నగరంలో నెల క్రితం నుంచి ఓ వ్యక్తి ఇంటి నిర్మాణం కోసం పునాది తవ్విస్తున్నాడు. తవ్వకాలు జరుపుతుండగా శిథిలావస్థలో ఉన్న 231 డైనోసార్ గుడ్లతో పాటు అస్తిపంజరం బయటపడింది. అయితే ఇంటి యజమాని వాటిని ప్రభుత్వానికి అప్పగించకుండ దాచిపెట్టుకున్నాడని అధికారులు అంటున్నారు.

కాగా చైనాలో డైనోసార్ గుడ్లు బయటపడటం ఇది కొత్త ఏమికాదు. అంతేకాదు... హెయివాన్ పట్టనానికి డైనోసార్ల స్వగ్రామం అని పేరు కూడా ఉంది. డైనోల గుడ్ల కారణంగానే ఈ పట్టణానికి గిన్నిస్ బుక్ లో చోటు దొరికింది. గతంలో ఇక్కడ అనేక గుడ్లు స్వాధీనం చేసుకున్నారు. చైనా లోని మ్యూజియంలో 10 వేలకు పైగా డైనోసార్ గుడ్లు ఉన్నాయి. అయితే పురాతన వస్తువులు దొరికినప్పుడు వాటిని ప్రభుత్వానికి అప్పగించకపోతే చైనాలో పెద్ద కేసు అవుతుంది... దీంతో ఇప్పుడా యజమాని న్యాయపరంగా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మొత్తానికి డైనో గుడ్లు ఆయనకు పైసాకు పనికిరాకపోయినా వాటిని దాచిపెట్టుకున్నందుకు ఇబ్బందులు పడాల్సివస్తోంది. ఇదంతా ఎలా ఉన్నా ఆ గుడ్లన్నీ పిల్లలయి పెద్దపెద్ద డైనోసార్లయిపోతే పరిస్థితితేమిటని కొందరు ఊహించుకుంటున్నారు.. అప్పుడు చైనా ఓ జురాసిక్ పార్క్ అయిపోతుంది కదా..!