Begin typing your search above and press return to search.

ఆ సిటీలో మధ్యాహ్నం 3 గంటలు అధికారిక నిద్ర

By:  Tupaki Desk   |   21 July 2015 5:10 AM GMT
ఆ సిటీలో మధ్యాహ్నం 3 గంటలు అధికారిక నిద్ర
X
భోజనం చేసిన తర్వాత కాసింత సేపు కునుకు తీస్తే.. ఆ ఉత్సాహమే వేరు. అయితే.. అలాంటి అలవాటు ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదని కొందరు చెబుతుంటారు. వ్యక్తుల విషయంలోనే ఇన్ని వాదనలు ఉంటే.. ఒక నగరం..నగరం మొత్తం మధ్యాహ్నం సమయంలో నిద్ర పోవటానికి మూడు గంటల సమయం అధికారికం చేయటం కలలో ఊహించగలమా?

కానీ.. అలాంటిది కూడా సాధ్యమేనని నిరూపించారు స్పెయిన్ లోని ఒక సిటీ పాలకులు. స్పెయిన్ లోని అడోర్ పురపాలక అధ్యక్షుడు జాన్ పాస్ విక్టోరియా ప్రతి రోజూ మధ్యాహ్నం మూడు గంటల పాటు అధికారిక విశ్రాంతిని ప్రకటించారు. దీనికి సంబంధించి చట్టం చేశారు కూడా.

అధికారిక నిద్ర సమయాన్ని మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ రెస్ట్ అవర్స్ గా డిసైడ్ చేశారు. స్పెయిన్ లో మధ్యాహ్న విశ్రాంతి అన్నది మామూలే అయినప్పటికీ.. ఇలా చట్టబద్ధం చేయటం మాత్రం ఇదే తొలిసారని చెబుతున్నారు. ఈ విశ్రాంతి సమయంలో దుకాణాలతో పాటు.. బార్లు.. హోటళ్లు అన్నీ మూసేస్తారని చెబుతున్నారు. మొత్తంగా సదరు నగరం మధ్యాహ్నం సమయంలో మూడు గంటల పాటు నిద్రలో జోగుతుందన్న మాట.